Nancharaiah Merugumala ……. సనత్ నగర్ లో మూడో స్థానంలో నిలిచిన తెలుగు బిడ్డ కోట నీలిమ పంజాబీ భర్త, కాంగ్రెస్ ప్రవక్త పవన్ ఖేడా వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తారట!
–––––––––––––––––––
రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో కాంగ్రెస్ పార్టీ తరఫున దిల్లీకి చెందిన పవన్ ఖేడా తలపడతారని ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్ నిన్నటి నుంచి ఊదరగొడుతున్నాయి. టీవీ చానళ్ల డిబేట్లలో, ఏఐసీసీ ఆఫీసులో జరిగే కాంగ్రెస్ మీడియా సమావేశాల్లో పార్టీ ప్రవక్తగా (స్పోక్స్ పర్సన్) ఇంగ్లిష్ భాషలో దంచికొట్టే పంజాబీ హిందూ ఖత్రీ నేత పవన్ ఖేడా (55) భార్య కోట నీలిమ (52) తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత విద్యావంతురాలు, జర్నలిస్టు, రచయిత అయిన డాక్టర్ నీలిమ ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు జర్నలిస్టు దివంగత కేవీఎస్ శర్మ, ఉమా శర్మ దంపతులకు పుట్టారు.
Ads
పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో రాజస్తాన్ నగరం జైపూర్ లో జన్మించిన ఖేడా 1980ల చివర్లో యువజన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. 1991లో పీవీ నరసింహారావు హయాంలో 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన ఖేడా సోనియాగాంధీ నాయకత్వం చేపట్టాక 1998లో పవన్ ఖేడా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ కు (సోనియా–రాహుల్–ప్రియాంకా త్రయం) అత్యంత సన్నిహితుడిగా పరిగణించే ఖేడా 2022 ఆరంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తన పేరు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఉంటుందని ఆశించారు.
అయితే, చివరికి ఆయనకు కాంగ్రెస్ నామినేషన్ లభించలేదు. దీంతో ఆయన ఆగ్రహించి, ‘ కాంగ్రెస్ రాజ్యసభ సభ సభ్యత్వం లభించేంతటి ‘తపస్య’ నేను చేయలేదు. బహుశా నా ‘తపస్సు’ తగినంత లేదనే కారణంతో నాకు టికెట్ ఇవ్వలేదేమో. అందుకేనేమో దేశంలోని ఏదో ఒక రాష్ట్రం నుంచి పార్టీ హైకమాండ్ నన్ను పోటీకి దించి గెలిపించలేదు,’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. అయితే ఏడాది తర్వాత 2023 మార్చి నెలలో తన పాత ట్వీట్ పై ఖేడా విచారం ప్రకటిస్తూ పార్టీ అధిష్ఠానం తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ టికెట్ ఇవ్వనందుకు హైకమాండ్ పై అలిగి, క్షమాపణ చెప్పిన ఖేడా
……………………………………………………………………………………
కిందటేడాది ఫ్రిబ్రవరిలో ఓ గుజరాత్ కోర్టు తీర్పు కారణంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేయడంతో కాంగ్రెస్ దిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద అందుకు నిరసన తెలుపుతూ రోజంతా ‘సంకల్స సత్యాగ్రహం’ నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఖేడా ప్రసంగిస్తూ తన పాత వ్యాఖ్యను గుర్తు చేసుకుని సారీ చెప్పారు. ‘రాజ్యసభ సభ్యత్వం లభించలేదనే స్వార్ధంతో నేను ‘తపస్య’ కామెంట్ చేశాను. రాహుల్జీ ‘త్యాగనిరతి’, అధికారానికి ఆమడ దూరంలో నిలిచే స్వభావం నేను ఇప్పుడు దగ్గర నుంచి చూశాక నా తప్పు తెలుసుకున్నాను,’ అని ఖేడా ఏడాది తర్పాత మారు మనసు పొంది పాత తప్పుకు లెంపలేసుకున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే– నెత్తిపై ఒత్తుగా ఉండే తెల్ల జుట్టుకు తనదైన శైలిలో నల్ల రంగేసుకునే ఈ పంజాబీ కాంగ్రెస్ మేధావి– పార్టీ అధిష్ఠానం వద్ద తనకున్న కొద్దిపాటి పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి తన భార్య నీలిమకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అయితే, నాటి పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డితో తనకున్న పాత సాన్నిహిత్యాన్ని అప్పటి బీఆరెస్ అభ్యర్థి, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉపయోగించుకుని నీలిమ వంటే నాన్ లోకల్ ‘బలహీన బ్రాహ్మణ’ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున పోటీచేసేలా తన మొబైల్ ఫోన్ తో చక్రం తిప్పారని పుకార్లు షికార్లు చేశాయి.
ఈ వధంతులకు అనుగుణంగానే సనత్ నగర్ స్థానంలో తలసాని తన సమీప బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం చెన్నారెడ్డి గారి చిన్నకొడుకు మర్రి శశిధర్ రెడ్డిపై 41 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన కోట నీలిమ కేవలం 17.54 శాతం ఓట్లతో (22,492) మూడో స్థానంలో నలిచారు. మరి ఆమె పంజాబీ భర్త (పవన్ ఖేడా) అయినా వారణాసిలో ప్రధాని తో తలపడి కనీసం ధరావతుకు (డిపాజిట్) అవసరమైన ఓట్లయినా తెచ్చుకుంటే తెలుగోళ్ల పరువు నిలబడుతుంది. మన అమ్మాయి నీలిమ మొన్న డిసెంబర్ తెలంగాణ ఎన్నికల్లో తెలుగు గడ్డపై ఘోరంగా ఓడినా, అల్లుడు పవన్ రేపు పార్లమెంటు ఎన్నికల్లో కాశీలో గౌరవప్రదమైన రీతిలో ఓట్లు వేయించుకో గలిగితే బాగుంటుంది.
Share this Article