భారతదేశంలో జనాభా తగ్గుముఖం పడుతోంది అనే వార్తకన్నా… చైనా యువత ‘‘వద్దురా సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా’’ అని పాడుకుంటూ పెళ్లికి దూరంగా ఉంటోంది అనే వార్తే ఎక్కువ ఆసక్తికరంగా ఉంది… పెళ్లి చేసుకోకపోతే పైలాపచ్చీస్గా ఉండవచ్చునని కాదు, పెళ్లి చేసుకుంటే ఖర్చులు పెరుగుతయ్, పిల్లలు, పోషణ, చదువులు, మరింత ఖర్చు… ఇప్పటి జీవన వ్యయప్రమాణాల్లో అవన్నీ భరించలేక, కొలువుల్లో స్థిరత్వం లేక, రేపు ఏమిటో తెలియక యువత ఏకంగా పెళ్లిళ్ల పట్లే విముఖత చూపిస్తున్నారు… ఏం, పెళ్లి చేసుకోకపోతే నష్టమేమిటట అని ఎదురు ప్రశ్నిస్తున్నారు… ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉండి, జనసంద్రత ఉన్న చైనా ఇప్పుడు తమ సమాజాన్ని ‘‘బాబ్బాబు, పెళ్లి చేసుకొండిరా, పిల్లల్ని కనండర్రా’’ అని పిలుపునిస్తోంది… ‘‘చెప్పొచ్చారులే, కంటాం సరే, ఎవడు పోషించాలి’’ అని చైనా యువత లైట్ తీసుకుంటోంది… వరుసగా ఏటేటా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోతూనే ఉంది… తాజా లెక్కలు చెబుతున్నదీ అదే… ఏడేళ్ల కనిష్ఠ స్థాయికి పెళ్లిళ్ల సంఖ్య పడిపోయిందట…
నిజానికి ‘‘వన్ చైల్డ్’’ అనే నిబంధనను కఠినంగా అమలు చేసింది చైనా… కానీ దాని రివర్స్ ఫలితాన్ని ఊహించలేకపోయింది… రాను రాను ‘‘నాణ్యమైన మానవవనరులు’’ జాతి సంపద అవుతాయని అంచనా వేయలేకపోయింది… దాంతో జననాల రేటు పడిపోయింది… దీనికితోడు సగటు ఆయుప్రమాణం పెరుగుతోంది, దీంతో వృద్ధుల జనాభా పెరుగుతూ, పిల్లలు-యువకుల సంఖ్య పడిపోయింది… ఏ జాతికైనా ఇది భారం… ఇప్పుడు వన్ చైల్డ్ రూల్ ఎత్తేసినా సరే, యువత పిల్లల గురించే కాదు, అసలు పెళ్లిళ్ల గురించే పట్టించుకోవడం లేదు… ప్రస్తుతం అక్కడ జననాల రేటు ఒక శాతంకన్నా తక్కువ… ముసలోళ్ల శాతం జనాభాలో 18.7 శాతం, 2036కల్లా అది 29 శాతానికి చేరే చాన్స్ ఉంది… అంటే దాదాపు మూడోవంతు ముసలోళ్లే… మరో మూడో వంతు పిల్లలు… అంటే ఆర్థికవేత్తల దృష్టిలో రెండొంతుల జనాభా ‘అన్ ప్రొడక్టివ్’… అర్జెంటుగా ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ అయిపోవాలని పరుగు తీస్తున్న చైనాకు ఇదీ ఇప్పుడు కలవరం కలిగిస్తున్న సమస్య… ఏమో, అది చైనా, ఫలానా వయస్సు రాగానే తప్పకుండా పెళ్లి చేసుకోవాలని, ముగ్గురు పిల్లల్ని తప్పక కనాలని ఓ కఠినమైన ఫర్టిలిటీ రూల్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవద్దు…
Ads
మరి మన మాటేమిటి..? నిన్న చాలా పేపర్లు జనాభా తగ్గిపోతుందహో అని వార్తలు రాసుకున్నయ్ తమ సైట్లలో… జనాభా తగ్గడం అంటే జననాల రేటు తగ్గడం, దానికి తగినట్టు రీప్లేస్మెంట్ రేటు లేకపోవడం… ఇదొక పరిభాష… అంత త్వరగా అర్థం కాదు… సింపుల్గా చెప్పాలంటే… మరణాల వల్ల ఏర్పడే ఖాళీలను కొత్త జననాలు భర్తీ చేయలేకపోతున్నాయి అని..! ఇంకా సింపుల్గా చెప్పాలంటే… ఒక ఇంట్లో ఇద్దరు ముసలోళ్లు చనిపోయారని అనుకుందాం… కానీ కొత్తగా ఇద్దరు పిల్లలు పుట్టడం లేదు… ఎవరో కాదు, మన ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆ సూచనల్ని గణాంకాలతో సహా పట్టిస్తోంది… ఎహె, ఇవన్నీ తప్పుడు సూత్రాలు… ఏటేటా జనాభా పెరిగిపోతూనే ఉందిగా అంటారా..? కాదు… ప్రస్తుతం ఇండియాలో జననాల రేటు 2… అంటే ఒక మహిళ సగటున ఇద్దరిని కంటోంది… 1998-99లో 3.2 ఉండేది, అంటే సగటున ఒక మహిళ ముగ్గుర్ని కనేది, ఈ రేటు తగ్గుతోంది, ఇంకా తగ్గితే ఇక జనాభా పెరుగుదల అంకెల్లో ఈ తేడా, ఈ ప్రభావం క్రమేపీ కనిపిస్తుంది…
కుటుంబనియంత్రణలో మన దక్షిణ రాష్ట్రాల్లో క్రమశిక్షణ కనిపిస్తుంది, జనంలో చైతన్యం ఉంటుంది… అందుకే జననాల రేటు తక్కువ… బీహార్, యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ 2.5 నుంచి 3 దాకా ఉంటోంది సగటు మహిళ పిల్లల సంఖ్య… సిక్కింలో ఈ రేటు (టీఎఫ్ఆర్- Total Fertility Rate) జస్ట్, ఒకటి మాత్రమే… అంటే ఒకరిని మాత్రమే కంటోంది అక్కడ మహిళ… నారు పోసేవాడు నీరు పోయడా అని గంపెడు మంది పిల్లల్ని కని పడేయడం కాదు… ఆ ధోరణి పోతోంది క్రమేపీ… అసలు ఒకరిని కని, పోషించి, విద్యాబుద్ధులు చెప్పించడమే గగనం అవుతోంది చాలామందికి… కాదు, తమ కడుపులు నింపుకోవడమే సమస్యగా ఉంది… సో, ‘అన్ ప్రొడక్టివ్’ పాపులేషన్ అనే సమస్య చైనాకే కాదు, మనకూ రాబోతున్నదన్నమాట..! ఒక్కటి మనసు నింపే అంశం కూడా తేలింది సర్వేలో… మగ-ఆడ నిష్పత్తి మారుతోంది, మహిళల సంఖ్య మగాళ్లను మించుతోంది…! ఆడపిల్ల అనగానే కడుపులోనే ఖతం చేసే క్రౌర్యం తగ్గిపోయి, ఆ వివక్ష క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్నమాటే..!! ఒకప్పుడు సగటున 1000 మంది మగవాళ్లు ఉంటే 900కు దిగువన ఆడవాళ్ల సంఖ్య ఉండేది… ఇప్పుడు రివర్స్… 1000 మంది మగవాళ్లకు 1020 ఆడవాళ్లు… జయహో…!!
Share this Article