Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈనాటి భాష ‘ఈనాడు’దే … మెరుగులు దిద్దింది, ప్రామాణికత తెచ్చింది…

June 9, 2024 by M S R

ఇప్పుడు పత్రికల్లో, టీ వీల్లో, రేడియోల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రామాణిక భాష అనుకుంటున్నది రాత్రికి రాత్రి గాల్లోనుండి పుట్టినది కాదు. ప్రయత్నపూర్వకంగా ఎవరో ఒకరు పట్టుబట్టి సాధించినది. స్థిరీకరించినది. తొలి తెలుగు జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్, చరిత్ర పరిశోధకుడు, బహుభాషావేత్త రాంభట్ల కృష్ణమూర్తి (1920-2001) అధ్యయనం ప్రకారం- కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి జస్టిస్ పార్టీ ఏర్పడింది. జస్టిస్ పార్టీలో ఉన్నవారంతా సామాన్యులు. జస్టిస్ పార్టీ ప్రచారంకోసం ‘జనవాణి’ పత్రికను ప్రారంభించింది.

సామాన్యులు సునాయాసంగా చదువుకోవడానికి వీలుగా జనవాణి సరళమైన తెలుగు భాషలో రాయడాన్ని ఒక ఆదర్శంగా, అవసరంగా, ప్రమాణంగా భావించింది. అంతవరకు సంస్కృత భార సమాస పదబంధురంగా ఉన్న తెలుగును జనవాణిలో అత్యంత సరళం చేసింది దాని సంపాదకుడు తాపీ ధర్మారావు. ఆయన దగ్గర పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు తరువాత ఆంధ్రప్రభ ఎడిటర్ గా ఆ ఆదర్శాన్ని కొనసాగించారు. అంతకుముందు పత్రిక భాషతో పోలిస్తే కొంత మెరుగే కానీ…అది సరిపోలేదు.

పత్రికా భాషకు మెరుగులు దిద్ది… వెలుగులు అద్ది… కొత్త బట్టలు తొడిగి… అందచందాలు తీర్చి… అలంకారాలు పెట్టి… దానికి ఒక ప్రామాణికతను తీసుకొచ్చింది మాత్రం రామోజీరావే. ఆయన ఆధ్వర్యంలోని ఈనాడే. దానికి ఆయన గొప్ప యజ్ఞమే చేశారు. ఈనాడు దిద్దిన ఒరవడే తరువాత మిగతా పత్రికలు కూడా అనుసరించక తప్పలేదు. అంతకుముందు పత్రికలు చదవడం అలవాటులేనివారు కూడా ఈనాడు భాషకు దాసోహమై పత్రికలు చదవడం మొదలుపెట్టారు. సరళభాషతో రామోజీరావు కొత్త మార్కెట్ నే సృష్టించుకోగలిగారు. అంత వైవిధ్యంగా, దీర్ఘదృష్టితో ఉంటాయి ఆయన వ్యాపార సూత్రాలు.

Ads

ఈనాడులో కొత్తగా చేరిన జర్నలిస్టులకు జర్నలిజం, భాషా వ్యవహారాల్లో అనుభవజ్ఞులతో శిక్షణ తరగతులు నిర్వహించారు. తరువాత అదే ఈనాడు జర్నలిజం స్కూల్ గా రూపాంతరం చెందింది. ఈనాడులో వచ్చే తప్పులను ఎత్తి చూపుతూ… ఒప్పులు ఎలా రాయాలో చెబుతూ “ఈనాడు సమీక్ష” పేరుతో సిబ్బందికి ప్రతి నెలా చిన్న బుక్ లెట్ పంపేవారు. మంచి శీర్షికలను ప్రస్తావిస్తూ మెచ్చిన శీర్షికల పేరుతో ఆ సమీక్ష చివరి పేజీలో ఆ శీర్షికలు పెట్టినవారి ఊరు- పేరు పేర్కొనేవారు.

ఈ యజ్ఞంలో రాంభట్ల కృష్ణమూర్తి మొదలు కొండవీటి వేంకటకవి, వరదాచారి, ఎం వి ఆర్ శాస్త్రి, తెలుగు అకాడెమీ రామచంద్రరావులాంటి ఎందరో హేమాహేమీలను రామోజీరావు ఏరికోరి ప్రవేశపెట్టారు. ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ సారథ్యంలో ఈనాడు జర్నలిజం స్కూల్లో మెరికల్లాంటి జర్నలిస్టులు తయారయ్యారు.

మనం మాట్లాడినంత సహజంగా, అందంగా రాయలేము. రాసేప్పుడు సవాలక్ష ప్రతిబంధకాలు. చాలాసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లు రాశామని అనుకుంటాం. కానీ పాఠకుడికి అది ఇంకోలా ఒక్కోసారి మనమనుకున్నదానికి విరుద్ధంగా కూడా అర్థమవుతూ ఉంటుంది. అనువాదంలో సమస్యలు. అన్వయంలో సమస్యలు.

గ్రాంథిక దశనుండి, సరళ గ్రాంథిక దశనుండి శిష్టవ్యవహారంలోకి మారి స్థిరపడిన పత్రికా భాషలోనుండి తన అవసరానికి, లక్ష్యానికి వీలుగా ఈనాడు ఒక భాషా శైలినే ఆవిష్కరించింది. ఈనాడు వ్యవహార పదకోశాలను తయారు చేయించి ప్రచురించింది. తెలుగు వెలుగు మాసపత్రికను నిర్వహించింది. ఈటీవీలో తెలుగు వెలుగు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. పత్రికా భాషలో యొక్క, బడు, మరియు, శ్రీ శ్రీమతి, కై లాంటి ఇనుపగుగ్గిళ్లను ఏరి అవతల పారేసింది.

ఈనాడు భాషా స్వరూపమే తెలుగు ప్రామాణిక భాషా స్వరూపం అన్నంతగా పేరు రావడానికి కర్త- కర్మ- క్రియ అన్నీ రామోజీరావే.

తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన రామోజీరావుకు నివాళి.

(ఈ వ్యాస రచయిత 1989-1993లో ఈనాడు లేపాక్షి, హిందూపురం, హైదరాబాద్ లలో విలేఖరి, ఉప సంపాదకుడు. ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థి) -పమిడికాల్వ మధుసూదన్    9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions