అదో పూరిగుడిసె..!
ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవర్లే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి.
గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు తుడుచుకుంటున్నారు. ఆడంగులు పెళపెళలాడే చీరలు కట్టేసుకుని వలవలా ఏడుస్తున్నారు.
Ads
త్యాగరాజూ, రాజనాలా, సత్యనారాయణ మాత్రం శంఖుమార్కు లుంగీ, చారల టీ షర్టూ వేసుకుని, ఓ బెల్టెట్టుకుని, దాంట్లో ఓ తోలుపటకా, వాటిల్లో తలా ఓ బాకు దోపుకుని, ఛాన్సు మిస్సందియే అనుకుంటా చూస్తున్నారు. ముగ్గురూ నున్నగా గెడ్డం గీసుకునీ, బుంగమీసాలు పెంచుకునీ ఉన్నారు. వాళ్ల ముగ్గురి మొహాలమీదా సేమ్ సైజులో పులిపిర్లున్నాయి. వాళ్లు అడ్డొచ్చిన సాక్షి రంగారావుని దూరంగా నెట్టేసారు.
గుడిసె సావిట్లో గుడ్డి జయంతి శవం పడుకోబెట్టి ఉంది…!
ఆ శవం ప్రశాంతంగా నిద్రపోతోంది కానీ, దాని గుడ్డికళ్లు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నాయి. ఆ శవం పెద్దబోర్డరు కంచిపట్టు చీర కట్టింది. బోలెడు నగలు వేసుకుంది. గుండ్రటి తిలకం బొట్టు, దానిమీద అంగారు కుంకుమబొట్టు, దానిమీద చందనం చుక్కా, దానిమీద అరవ స్టైల్లో విభూతి పెట్టింది. శవం కొంచెం స్థూలంగా ఉన్నా, అది తల మీదున్న విగ్గులో సన్నజాజి పూల దండ పెట్టింది.
ఆ పక్కనే ముసలివేషంలో ఉన్న నడిమివయసు గుమ్మడి ఉన్నాడు. ఆయన నెరిసిన చిరుగడ్డంతో అక్కడక్కడా చిరుగులున్న పంచె కట్టుకుని, ఓ సైన్ బట్ట బనియనేసుకుని, ఓ పక్క విరిగిన కళ్లజోడెట్టుకుని, ఎడమచేయి నేలకాన్చి, కుడిచేయి తలమీదెట్టుకుని మౌనంగా, దిగులుగా, ఆక్రోశంగా, విషాదంగా, దైన్యంగా, నిస్సహాయంగా, నిర్లిప్తంగా, నిర్వికారంగా కూర్చుని ఉన్నాడు.
ఆయనకు ఏ కో డైరెక్టరూ డైలాగులేవీ ఇవ్వలేదు. అవేం లేకండానే ఆయన క్యారెక్టరు జీవించేస్తాడని క్లాప్ బాయిక్కూడా తెలుసు.
అప్పుడొచ్చాడు ఎన్టీఆర్.
****
కుక్క నాలుక కాలరున్న రెండు జేబులున్న చిలకాకుపచ్చరంగు చొక్కా, బెల్‌బాటమ్ పసుప్పచ్చ ప్యాంటూ, తిరుమల కళ్యాణకట్ట వారు సంవత్సరంలో పోగేసిన కేశాల స్టాకులో నలబై మూడు శాతంతో పేనిన మాంఛి దళసరైన విగ్గూ, పొట్ట నుండీ నడుము దాకా కవరయ్యేట్టు నాలుగించీల తెల్ల బెల్టూ, ఎర్రబూట్లతో హెర్క్యులస్ సైకిల్ మీద వచ్చాడు. కాటుక మీసాలూ, చక్కటి సింగార్ లిప్ స్టిక్కూ, దిద్దిన కనుబొమ్మలూ, మూడొంతుల మొహాన్ని కప్పెట్టేసే గాగుల్సూ వగైరాలతో చాలా షోగ్గా ఉన్నాడు . తన చేతిలో తంగమాళిగై అండ్ కో, పాండీ బజార్, మద్రాసు-600023 వాళ్ల కవరుంది. దానిమీద చొట్టానిక్కర అమ్మవారి బొమ్ముంది.
అంతకు ముందే తను రావుగోపాల్రావు ఒక్కగానొక్క కూతురు శ్రీదేవిని “అత్తమడుగు వాగులోనా అత్థ ఖూతురా..!” అంటూ హుషారైన పాటపాడుతూ ఏడిపించాడు.
తను రోజూ మామూలుగా సైకిల్ దిగడు. రన్నింగ్‌లో దిగి సైకిల్ని అలా వదిలేస్తాడు. పనేంలేని పద్మనాభం ఆ సైకిల్నందుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి కార్ పార్కింగ్ స్థలంలో జాగ్రత్తగా స్టాండేసి పెడతాడు. అతడు వాళ్ల క్లాస్మేట్ ఛాయాదేవిని ప్రేమిస్తున్నాడు.
గుడిసె ముందున్న జనాల గుంపుని చూసి ఎన్టీఆర్ మనసెందుకో కీడు శంకించింది. వణుకుతున్న కనుబొమలతో వాళ్లని తప్పిస్తూ గుడిసె ముందుకివెళ్లి జయంతి శవాన్ని చూశాడు.
ఎన్టీఆర్ కుడిచేతిలో ఉన్న తంగమాళిగై అండ్ కో కవర్ జారిపోయింది. అందులో ఉన్న ఎర్రరంగు మట్టి గాజులు జయంతి చేతుల దగ్గరా, బొండుమల్లెల దండ తల దగ్గరా, స్వీట్లు నోటిముందూ, చీర వంటి మీదా, చెప్పులు కాళ్ల దగ్గరా పడ్డాయి. పుహళేంది వంద వాయులీనాలతో ఎక్కడో శివరంజని ఆలాపిస్తున్నాడు.
ఎన్టీఆర్ ఎడమచేతి పిడికిలి బిగించి, నోట్లో వేళ్ల కణుపుల్ని పెట్టుకుని గట్టిగా కొరికేసుకున్నాడు. నాలుగు సెకన్ల తర్వాత “ఛెళ్లేమ్హా..!” అంటూ ఒక్క గావుకేకారుపు పెట్టాడు. శవం కొంచెం ఉలిక్కిపడి మళ్లీ సర్దుకు పడుకుంది.
“ఛెల్లెమ్మా..! రాత్రనఖా, ఫగలనఖా ధివారాత్రాలు ఖష్టపడి మన వంశ ప్రథిష్ట నిలబెట్ఠడం కోసం, నాన్నఘారి ఘౌరవం ఖొనసాగించడం కోసం ఫని చేసి ఉద్యోగంలో ఛేరానమ్మా…!
సంఫాదించిన మొధటి జీథంతో నీ ఖోసం పూలూ ఫళ్లూ, స్వీట్లూ, ఛీరలూ, ఘాజులూ థీసుకొస్తే నువ్వెలా ఖదలకుండా ఉండటం అన్యాయవమ్మా…, అన్యాయం..!
ఒక్క సారి లేమ్మా..! ఆ ఛీర కట్టుకోమ్మా, ఆ ఫూలు పెట్టకోమ్మా, ఆ స్వీట్లు మింగు..! ఆ ఘాజులు. ఏసుకోమ్మా, ఆ ఛెప్పులు థొడుక్కో..!
ఒఖ్ఖసారి, ఒకే ఒఖ్కసారి ఈ అన్నయ్యని నోరారా హన్నయ్యా అని పిలువమ్మా పిలువు..!” అంటూ శవాన్ని తన కౌగిట్లోకి తీసుకుని, దాని పక్కటెముకలు పటపటలాడేంత బలంగా కౌగిలించుకుని భోరుభోరున, గోడుగోడున ఏడవసాగాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఏడుపు చూసి, త్యాగరాజు, రాజనాల, సత్యనారాయణ మొహాల్లో ఓ అకారణ పైశాచికానందం ఫ్లాష్ అయ్యింది.
గుమ్మడి నీళ్లు నిండిన కళ్ళతో ఎన్టీయార్ ని చూసాడు.
“నాయనా ఎన్టీఆర్..! నువ్వు వంశ ప్రతిష్ట కోసం, తండ్రి గౌరవం నిలబెట్టడం కోసం కష్టపడి ఉద్యోగం చేసి, చెల్లెమ్మ కోసం చీరా పూలూ పళ్లూ గాజులూ చెప్పులూ మిఠాయీలూ తెచ్చావ్..! నువ్వు తెచ్చే సరికే అది చచ్చి శవమైంది..!
నాదొక్కటే కోరిక నాయ్నా…! నీ రెండోనెల జీతంతో నాకు మాత్రం చొక్కా, ధోవతీ, చుట్టలూ తేకు నాయనా, తేకు..!” అంటూ ఓ దగ్గు దగ్గాడు.
పక్క గుడిసె ప్రభాకర్ రెడ్డి తన తుండుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు.
Share this Article