హమ్మయ్య… ఒక సెగ చల్లారింది… పనికిమాలిన, దిక్కుమాలిన పంచాయితీ అది… ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం… ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో ఓ కోన్‌కిస్కా ఏదో ఇండస్ట్రీకి చెందిన ఓ దివంగత సెలబ్రిటీపై ఏదో మతిలేని వ్యాఖ్య చేస్తే… దాని ఇండస్ట్రీ అభిప్రాయంగా పరిగణించాలా..? సీరియస్‌గా ఖండించేసి, ఇష్యూ చేయాలా..? అసలు విషయం ఏమిటీ అంటారా..? సింపుల్‌గా, సూటిగా చెప్పుకోవాలంటే… విజయ్ రంగరాజు అనబడే ఓ తెలుగునటుడు కన్నడ దివంగత సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనేది వివాదం… ఇంకాస్త వివరంగా చెప్పుకోవాలంటే..?
ఈ విజయ్ రంగరాజు ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఓ సన్నివేశంలో తను విష్ణువర్ధన్ కాలర్ పట్టుకుని, చెడామడా కడిగేశాననీ, తిట్టేశాననీ ఏదేదో చెప్పాడు… నిజానికి అది ఏ సందర్భంలో, ఏ అర్థంలో చెప్పుకొచ్చాడో తెలియదు… ఎవడో స్టార్ట్ చేశాడు… కన్నడ సుప్రీం స్టార్‌ను తిట్టిన తెలుగు నటుడు అని…! అదీ పంచాయితీ…
Ads
ఇక్కడ రంగరాజు అలియాస్ రాజ్‌కుమార్‌ను తెలుగు నటుడు అని ముద్రవేయడమే కరెక్టు కాదు… తను పుట్టింది మహారాష్ట్ర, మద్రాసులో నాటకాలు వేసేవాడు, తరువాత మళయాళ సినిమాల్లో కొన్ని చాన్సులు… తెలుగులో పట్టుమని ఆరేడు సినిమాలు కూడా చేయలేదు… ఎక్కువగా విలన్ తరహా… కన్నడంలో కూడా చేశాడు… మరి తెలుగు నటుడు అనే ముద్ర ఎందుకు వేస్తున్నట్టు..?
సరే, వేశారు, ఈ తరానికి తనెవరో తెలియదు… తన వ్యాఖ్యలకు చిల్లరపైసలకు ఉన్న విలువ కూడా లేదు… ఏదో వాగాడు, దానికి మొత్తం కన్నడ మూవీ ఇండస్ట్రీ అంత సీరియస్‌గా రియాక్ట్ కావాలా..? ఖండించకపోతే మైలపడిపోతాము అన్నంతగా టాప్ స్టార్స్ అందరూ ఈ రంగరాజు మాటల్ని ఖండఖండాలుగా నరికి దాన్ని ఓ ఇష్యూగా మార్చారు… అది కన్నడ చిత్రసీమకు జరిగిన అవమానం అన్నట్టుగా ఓవర్ రియాక్షన్… కొందరైతే మళ్లీ బెంగుళూరులో అడుగుపెట్టకు బిడ్దా అని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు…
చివరకు ఏమైంది ఇదే రంగరాజు ఓ వీడియో విడుదల చేస్తూ… అందరికీ క్షమాపణలు, అందరి కాళ్లు మొక్కుతున్నాను అన్నట్టుగా అందులో కవరింగు… మరి ఈ తెలివి ముందే ఉండాలిగా… పోనీ, లేదు… తన వ్యాఖ్యలపై నిలబడాలి కదా… అదీ లేదు… ఢామ్మని అందరి కాళ్లమీద పడిపోయాడు… ఇలాంటి లెవల్ వ్యక్తి ఏవో కామెంట్లు చేస్తే, దానికి రియాక్ట్ అయిన కన్నడ స్టార్స్ నిజానికి ఇప్పుడు సిగ్గుపడాలి… ఈ స్థాయి మనిషి వ్యాఖ్యలకా మేం స్పందించిందీ అని…!!
సోషల్ మీడియాలో ట్రోలర్లకు… ఇదుగో ఇలాంటి నటుల పిచ్చి వ్యాఖ్యలకు విలువ ఇవ్వడం మొదలుపెడితే… ఇదుగో ఇలాగే పెంట పెంట అయిపోతుంది యవ్వారం… దేనికి స్పందించాలో, దేన్ని లైట్ తీసుకోవాలో ఇంకా కన్నడ స్టార్స్‌కు తెలిసినట్టు లేదు…!
వాస్తవంగా ఇతర సౌతిండియన్ ఇండస్ట్రీ ముఖ్యులతో ఉన్న సత్సంబంధాలు టాలీవుడ్‌కు కన్నడ చిత్రసీమతో ఉండవు… మన సినిమాలను వాళ్లు డబ్ చేయడానికి లేదు, వాళ్లవి డబ్ చేసుకుని చూసేంత సీన్ కూడా ఉండదు… అందుకే మన తెలుగు ప్రస్తుత ప్రేక్షకతరానికి విష్ణువర్ధనూ తెలియదు… రంగరాజూ తెలియదు… ఎవరో తెలియని వాళ్ల గురించి కూడా ఓ ఇష్యూ… ఖర్మ…!!
Share this Article