దాదాపు తొంభై ఏళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలైన ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి “గ్రేట్ డిప్రెషన్” అని నామకరణం చేసింది. ఈ సంక్షోభానికి మూల కారణం అతి పారిశ్రామికీకరణ అని తేల్చాడు చార్లీ చాప్లిన్. గ్రేట్ డిప్రెషన్ ఇతివృత్తంగా మోడరన్ టైమ్స్ పేరుతో 1936లో చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఒక విషాదానికి కన్నీటి ప్రతిరూపం. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీతం, కథానాయకుడు అన్నీ చాప్లినే.
మనిషి యంత్రంలో యంత్రమై, బోల్ట్ లో బోల్ట్ అయి, చక్రాల పళ్ల మధ్య బెల్ట్ అయి, సైరన్ మోగగానే మరబొమ్మలా పనిచేసి; మళ్లీ సైరన్ మోగగానే ఆగిపోయే ఒక పరికరంగా ఎలా మిగిలిపోయాడో ఎనభై అయిదేళ్ల కిందటే చాప్లిన్ కన్నీళ్లకే కళ్లల్లో రక్తం కారేలా తెలుపు నలుపు మూగసినిమాలో చెప్పాడు. అప్పటికే అంతగా గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి అయితే- ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించిన స్వయంచాలిత రోబో యంత్రాల అధునాతన పరిశ్రమలను, ఆ పరిశ్రమలను ఇళ్లల్లో నుండి నిద్రలో కూడా మానిటర్ చేసే ఉద్యోగులను, రాత్రీ పగలు తేడా లేకుండా పనిచేసే వైట్ కాలర్ సాఫ్ట్ వేర్ కూలీలను చూస్తే చాప్లిన్ ఎన్ని మోడరన్ టైమ్స్ సినిమాలు తీయాల్సివచ్చేదో?
పని వేళలు ఇంకా పెంచాలట!
Ads
ఐటీ ఉద్యోగులు రోజుకు పది గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే చాలదని… రోజుకు పన్నెండు గంటలు ప్లస్ రెండు గంటల ఓవర్ టైమ్ కలిపి పద్నాలుగు గంటలు పనిచేయాలని ఆమధ్య ప్రఖ్యాత ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఎక్కడో ఏదో సందర్భంలో అన్నారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా అవునవును… లక్షలకు లక్షల జీతాలు, అంతులేని వసతులు, ప్రోత్సాహాలు ఇచ్చేప్పుడు రోజుకు పద్నాలుగు ఇంటూ వారానికి అయిదు రోజులు ఈక్వల్ టు డెబ్బయ్ గంటలు పనిచేస్తేనే పరిశ్రమ బతికి బట్టగట్టకలుగుతుందని వంత పాడారు.
భారతదేశంలో కార్మిక చట్టాలు ఎంతగా దేవాతావస్త్రాలైనా ఉద్యోగుల పనివేళలకు సంబంధించి ఏవో కొన్ని నియమనిబంధనలు ఉండి చచ్చాయి. అవి ఐటీ కంపెనీలకు అడ్డొస్తున్నాయి. అందుకు పనివేళలను పెంచుకోవడానికి వీలుగా చట్టాన్నే మార్చబోయారు. కర్ణాటక శాసనసభలో దీనికోసం బిల్లు ప్రవేశపెట్టి… దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చేసరికి… ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
ఒడిలో ల్యాప్ టాప్. చేతిలో స్మార్ట్ ఫోన్. టేబుల్ ముందు డెస్క్ టాప్. ఆఫీస్ లో పని. ఇంట్లో ఆఫీస్ పని. బాత్ రూమ్ కాలకృత్యాల కమోడ్ మీద కూడా వదలని జూమ్ మీటింగులు. భార్యాభర్తల సరస శృంగార హనీమూన్లలో కూడా వదలని ఆఫీసు బాసులు. టార్గెట్లు. ఊస్టింగులు. చేసిన అప్పుల ఈఎంఐలకు సరిపోయే నెల జీతాల ఐటీ జీవితాలు.
రాత్రీ పగలు పని చేస్తున్నట్టుగానే ఉంది.
కంప్యూటర్ కు- ఫోన్ కు మధ్య తేడా లేదు.
ఫోన్ కు- కెమేరాకు;
వ్యాలెట్ కు- ఫోన్ కు- పోస్టు కార్డుకు మధ్య తేడాల్లేవు.
ఉద్యోగులు 24 గంటలూ పైవారికి అందుబాటులోనే ఉంటున్నారు. చాలా మందికి ఇలా ఎల్లవేళలా అందుబాటులో ఉండడం కూడా ఒక పనే అనే సంగతి కూడా తెలియదు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అకడమిక్ గా రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయాలని శ్రమగీతం అందుకున్నారు కానీ… టెక్నికల్ గా ఉద్యోగులు ఆల్రెడీ రోజుకు 24 గంటల పని చేస్తూనే ఉన్నారు.
పని చంపిన వేళ…
అన్నా సెబాస్టియన్ పెరయిల్ 26 ఏళ్ల యువతి. “ఎర్నెస్ట్ యంగ్ ఇండియా- ఈ.వై.” బహుళజాతి కంపెనీలో చార్టెడ్ ఆకౌంటెంట్ గా ఉద్యోగంలో చేరింది. రాత్రీ పగలు పని. టార్గెట్లు. మీటింగులు. మెయిళ్లు. జూమ్ కాల్స్. శారీరక శ్రమ. కంటిమీద కునుకు లేదు. మనసుకు విశ్రాంతి లేదు. నాలుగు నెలల్లో నరకం చూసింది. గుండె గతి తప్పుతున్నా… వైద్యుడిని కలిసి… మళ్లీ ఉద్యోగంలోకే వెళ్లక తప్పని పరిస్థితి. మనిషి యంత్రమైన చోట గుండెను చిక్కబట్టుకుని యంత్రంగా పని చేస్తోంది. అన్నా గుండె యంత్రం ఆగిపోయింది. తల్లి గుండె తల్లడిల్లిపోయింది.
“ఈ వై!
మీరు మనుషులేనా!
కనీసం ఒక కాకి కన్ను మూస్తే తోటి కాకులు వచ్చి కావు కావుమని సంతాపంగా ఏడుస్తాయి. మా అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు. శవాన్ని చూడడానికి కూడా ఒక్కరు రాలేదు. ఎంత మందిని ఇలా పనితో చంపుతారు?”
అని ఘాటుగా ఒక లేఖ రాశారు. అటు ఇటు తిరిగి ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయి… కేంద్ర కార్మికశాఖ మంత్రికి కూడా చేరింది. కేంద్రం విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రయివేటు కొలువుల్లో శ్రమదోపిడి, పని వేళలు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
అందుకే… చార్లీ చాప్లిన్ అలా చెప్పి ఉంటాడు. మనం మనుషులమన్న మౌలికమైన స్పృహ కోల్పోతేనే ప్రయివేటు ఉద్యోగం చేయగలుగుతాం.
కొస బాధ:- ఈ వై ఇండియా అధిపతి ఒక వివరణ ఇచ్చారు. ఆ అమ్మాయి మా దగ్గర నాలుగు నెలలే పని చేసింది. అందరికీ ఇచ్చినట్లే ఆ అమ్మాయికీ పని ఇచ్చాము- అని.
నాలుగు నెలల పనికే ఆ చావును మా అకౌంట్లో వేస్తారా? బుద్ధి ఉందా మీకసలు? అన్నది ఆయన కవి హృదయం.
అన్నా తల్లి సుదీర్ఘ ఉత్తరం చదివితే…మనుషులైతే…మనసుంటే…ఇది హత్యగా పరిగణించాల్సిన కేసు అవుతుంది.
పని…పని…చచ్చే పని.
చచ్చినా…వదలని పని.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article