ఎందుకు లేవు..? ఎన్నో విశేషాలు… సర్దార్ పటేల్ సారథ్యంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పాలకుడు నిజాంను వంగదీసి, లొంగదీసి, హైదరాబాద్‌ను యూనియన్‌లో కలిపేసుకున్న రోజు సెప్టెంబరు 17… మొత్తానికి 74 ఏళ్ల తరువాతనైనా ఈ ప్రాంతం ఆ మరుపురాని రోజును అధికారికంగా కేంద్రప్రభుత్వ సారథ్యంలో స్మరించుకుంటోంది… విలీనమా, విద్రోహమా, విమోచనమా పేరు ఏదయితేనేం..? హైదరాబాద్ ఓ దక్షిణ పాకిస్థాన్ గాకుండా ఈ దేశంలో ఓ భాగమైపోయింది… అదంతా చరిత్ర…
కానీ… ఒక చరిత్రాత్మక సందర్భాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకరకంగా, రాష్ట్ర ప్రభుత్వం మరోరకంగా సెలబ్రేట్ చేయడం నిజంగా విచారకరం కాదా…? రాష్ట్రం వేరు, కేంద్రం వేరా..? బహుశా ఇలాంటి పెడపోకడలు ప్రపంచంలోని ఏ దేశంలోనూ కనిపించవేమో… రాజకీయాలతో ఓ స్మరణీయ సందర్భాన్ని ఇరు పార్టీలూ భ్రష్టుపట్టించాయి… తనే మైలేజీ తీసుకుని, కేసీయార్‌ను ఇరుకునపెట్టాలని బీజేపీ… దానికి విరుగుడుగా తన పాత ధోరణులకు పాతరేసి, కొత్తగా సమైక్య దినం అనే రాగాన్ని అందుకున్న కేసీయార్…
మొత్తానికి పేరు ఏదయితేనేం… కేసీయార్ ఈరోజును సెలబ్రేట్ చేయకతప్పని స్థితి ఏర్పడింది… తన జాన్‌జిగ్రీదోస్త్ పార్టీ మజ్లిస్‌కు కోపం రావద్దని, నాటి నిజాం పాలనలో సాగిన అకృత్యాలు, రజాకార్ల అరాచకాలను కేసీయార్ ఒక్కమాట కూడా ప్రస్తావించకపోవచ్చుగాక.. కానీ మీడియా నాటి నిజాం రోజుల్ని ప్రత్యేక కథనాలతో ఊదరగొడుతూనే ఉంది… తెలంగాణ సమాజం నాటి పీడదినాల్ని మరోసారి గుర్తుచేసుకుంటూనే ఉంది… కేసీయార్‌ను బీజేపీ ఒకరకంగా కార్నర్ చేయగలిగింది…
Ads
బీజేపీ మరోపని చేయగలిగింది… కేసీయార్ అడుగులకు మడుగులొత్తేందుకు సిద్ధపడిన లెఫ్ట్ పార్టీలను కూడా డిఫెన్స్‌లో పడేసింది… బీజేపీ పూర్తిగా మైలేజీ పొందకుండా, కేసీయార్ తెలివిగా సమైక్యత పేరుతో కౌంటర్ చేయడం రాజకీయంగా కరెక్టే కావచ్చుగాక… కానీ ఒకే సందర్భాన్ని రెండు వేర్వేరు పేర్లతో, రాష్ట్రం, కేంద్రం (అధికారికంగా) వేర్వేరుగా సెలబ్రేట్ చేయడమనే ఓ విచిత్ర సంప్రదాయానికి తెరతీశాడు… బీజేపీ కూడా అందులో భాగమైపోయింది…
విశేషమే… కేసీయార్ కుర్చీ ఎక్కిన ఇన్నేళ్లకు, ఏదో ఒక పేరుతో… సెప్టెంబరు 17 దినాన్ని సెలబ్రేట్ చేయాల్సి రావడాన్ని మనం ఊహించలేదు… ఇన్నేళ్లూ అర్థం లేని సాకులతో అవాయిడ్ వేస్తూ వచ్చాడు, అదంతా సరే… అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ఖాసిం రజ్వీతో మాకు సంబంధం లేదని చేసిన బహిరంగ ప్రకటనను కూడా మనం ఊహించలేదు… అవునూ, రజ్వితో సంబంధం ఎందుకు లేదు..? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు… ఖాసిం రజ్వీ ఓ దశలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు కూడా..! హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియాలో కలిపేశాక, బయటి దేశాలకు పారిపోబోతూ రజ్వీ దొరికాడు…
తన అకృత్యాలకు ఇండియన్ సైన్యం తనను ‘ఖతం’ చేయలేదు… జైలులో పెట్టింది… తరువాత కొన్నేళ్లకు… విడుదల చేసిన రెండురోజుల్లో, తనకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడిన పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలనే షరతుతో వదిలేయబడ్డాడు… మజ్లిస్‌ను లాయర్ అబ్దుల్ వాహెద్ ఒవైసీకి అప్పగించాడు… సర్వత్రా తీవ్ర వ్యతిరేకత, శత్రుత్వం ఆవరించి ఉన్న ఆరోజుల్లో మజ్లిస్ పార్టీ సారథ్యం తీసుకోవడానికి ఒవైసీ సిద్ధపడటం ఒకరకంగా సాహసమే… తరువాత ఆ పార్టీని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)గా మార్చి, పార్టీ విధానాలను, పోకడలను గణనీయంగా మార్చాడు…
ఆయన కొడుకే సలావుద్దీన్ ఒవైసీ… తన వారసుడే అసదుద్దీన్ ఒవైసీ… అయితే, టెక్నికల్‌గా ఖాసిం రజ్వీతో తమ పార్టీకి సంబంధం లేదని ఓవైసీ చెప్పడం కరెక్టు కాకపోవచ్చుగాక… కానీ అది రజ్వీ కాలం నాటి పార్టీ మాత్రం కాదు ఇప్పుడు… ఆ కాలం నాటి అరాచకాలకు, అకృత్యాలకు మేం వారసులం కాదని అన్యాపదేశంగానైనా చెప్పడం అభినందనీయమే… దేశం పట్ల, రాజ్యాంగం పట్ల ఒవైసీ విధేయతను ఎవరూ ప్రశ్నించడం లేదు… తను ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన పని కూడా లేదు…
ఈ మొత్తం ఎపిసోడ్‌లో లెఫ్ట్ పార్టీలకు ఓ వాయిస్ వినిపించే సీన్ లేకుండా పోయింది… కేసీయార్‌తో జతకూడి నాటి నిజాం పాలనను కీర్తించలేరు… నాటి అకృత్యాలపై బీజేపీతో గొంతు కలపలేరు… తమకు సొంతంగా చెప్పుకోవడానికి కూడా ఏమీలేదు… సైనిక చర్య తరువాత కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనే ఓ చరిత్రాత్మక తప్పుడు నిర్ణయం తీసుకుంది… చివరకు తనే రిట్రీట్ అయిపోయింది… దేశం నడిబొడ్డున ఓ కమ్యూనిస్ట్ రాజ్యస్థాపనకు అప్పటిదాకా కలలు కన్నది… రజ్వీ దక్షిణ పాకిస్థాన్ కలలు కంటే, లెఫ్ట్ ఎర్ర రాజ్యం కలలు కన్నది… దొందూ దొందే… ఆ రెండు కలల్నీ కాంగ్రెస్ తుత్తునియలు చేసింది… అది కూడా రాజకీయ పార్టీయే కదా మరి… హైదరాబాద్ విముక్తమైపోయింది.. లేకపోతే, ఏమాత్రం తప్పుటడుగు పడినా… కశ్మీర్‌లా మండుతూనే ఉండేదేమో… థాంక్స్ సర్దార్..!!
Share this Article