సీనియర్ పాత్రికేయ మిత్రుడు Nancharaiah Merugumala పోస్టులో కొన్ని అంశాలు మొదట చదవండి… ‘‘సోమవారం కడ్తాల్ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మై హోం గ్రూప్ అధిపతి డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు…
‘‘2018లో నేను టేకోవర్ చేసే వరకూ టీవీ 9 చానల్‌ను ఒక నక్సలైట్ వ్యవస్థలా నడిపారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారు ఈ చానల్ సంపాదకులు. స్వర్గీయ బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీని కించపరుస్తూ ఈ చానల్‌లో ప్రసారాలు నడిచాయి’’ అనే రీతిలో విరుచుకుపడుతూ మాట్లాడారు మై హోం కన్‌స్ట్రక్షన్స్, మహాసిమెంట్, టీవీ 9 చానల్ లో పెట్టుబడులు పెట్టి నడుపుతున్న జూపల్లి రామేశ్వర్ రావు గారు…
హయత్ నగర్‌లో హోమియో డాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన నాలుగు దశాబ్దాలకు హైదరాబాద్ నగర శివార్లలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వంటి ఆధ్యాత్మిక నేతలకు సైతం ఆశ్రయం ఇచ్చారు రామేశ్వరరావు గారు. శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు ఉన్నాయని మరో పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారి నుంచి కిందటేడాది ప్రశంసలు కూడా అందుకున్న మై హోం గ్రూపు అధినేత– తాను కొనుగోలు చేయక ముందు టీవీ 9 ఎలా నడిచిందీ, ఎలా నడిపారు? అనే విషయాలపై లైవ్‌లో సూటిగా, చక్కగా మాట్లాడడం సంచలనంగా మారింది…
Ads
….. ఇదీ ఆ పోస్టు సారాంశం… ఐతే… మై హోం రామేశ్వరరావు అసందర్భంగా ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు… బహుశా పత్రీజీ ధ్యానమహాయాగం ఉత్సవాల సందర్భంగా… ఇప్పటి నా చానెల్ గతంలో పత్రీజీకి వ్యతిరేకంగా నానాకూతలూ కూసింది, కించపరిచింది, నేను ఆ చానెల్ కొనేశాను కదా, ఇక అలాంటి కించపరిచే కంటెంట్ రాదు అని పరోక్షంగా అక్కడి సమూహానికి ఓ వివరణ ఇచ్చుకున్నాడేమో తెలియదు… ఏమో, పరోక్షంగా క్షమాపణ కూడా…
ఐతే ఇక్కడ తను గమనించాల్సింది, ఒక నిజం తెలుసుకోవాల్సింది ఒకటుంది… ఆ చానెల్ గతంలో ఎలా నడిచింది, ఏ ఎడిటోరియల్ లైన్ ఉండేది అనేది తనకు అప్రస్తుతం… అప్పటి వోనర్లు వేరు, అప్పటి చానెల్ చీఫ్ ఎడిటర్ వేరు… అవును, రవిప్రకాష్ తన భావజాలానికి అనుగుణంగా లేదా తనకు పనికొచ్చే అవసరాలకు అనుగుణంగా వార్తలు వండించవచ్చు, జనానికి ఉపయోగకరం అని భావించి ఉండవచ్చు… ప్రోగ్రెసివ్ సొసైటీకి అదే అవసరం అని కూడా నమ్మి ఉండవచ్చు…
పత్రీజీని కించపరుస్తున్నారనే కారణంతో టీవీ9 కొనుగోలు చేయలేదు కదా మైహోం… అదొక ఇన్వెస్ట్‌మెంట్, తన చేతిలో ఓ మీడియా గ్రూపు… అది తన అవసరం, తన అభిరుచి… ఎస్, యాజమాన్యం మారింది… రవిప్రకాష్ పాత పోకడల్ని ఇష్టపడలేదు, అసలు రవిప్రకాష్ అక్కడ ఉండటమే నచ్చలేదు… అప్పటి పవర్ పార్టీ సహకారంతో రవిప్రకాష్‌ను పంపించేశారు… ఆ దెబ్బకు ఆయన మళ్లీ ఇప్పటికీ తన సొంత తెర మీద కనిపించలేదు… అంటే తనకంటూ ఓ సొంత బుల్లితెర లేదని అర్థం…
అప్పుడు రవిప్రకాష్ సారథ్యంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇప్పుడు అక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారు… ఓ పెద్ద మనిషి తనకంటూ ఓ రాచరిక వ్యవస్థను నిర్మించుకున్నాడు… మరి మైహోం ఎందుకు సహిస్తోంది… ఎందుకంటే..? రామేశ్వరరావు పొలిటికల్ లైన్‌కు అనుగుణంగా టీవీ9 ఎడిటోరియల్ లైన్ మారిపోయింది కాబట్టి… మారకతప్పదు కాబట్టి… మారకపోతే బాధ్యులు మారిపోతారు కాబట్టి, ఏమారిపోతారు కాబట్టి… ఓనర్ ఇష్టం…
అప్పుడు నక్సలైట్ చానెల్‌లా నడిచిందనే వ్యాఖ్యలో లోతు గురించిన విశ్లేషణ, వివరణలు అవసరం లేదు… ఇప్పుడేమీ అది ఆధ్యాత్మిక, ప్రజాసేవ మార్గంలో ఏమీ లేదు… ఓ సగటు పెట్టుబడిదారీ టీవీ చానెల్ తరహాలోనే నడుస్తోంది… సంచలనమే దానికి ఆక్సిజెన్, టీవీ రేటింగ్స్, యాడ్స్, డబ్బు మాత్రమే దానికి ప్రధానం… రవిప్రకాష్ ఇప్పటికీ టీవీ9 యాజమాన్యంలో భాగస్వామే కదా, ఒక్కసారి మళ్లీ పగ్గాలు ఇచ్చి చూడండి… మళ్లీ నక్సలైట్ చానెల్ కాకపోతే అడగండి… సహజం… జై పత్రీజీ…! జై సుభాష్ పత్రీజీ…!!
Share this Article