Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎస్పీ బాలు పాడనని భీష్మించిన వేళ… జేసుదాస్ పాటలు కర్ణపేయం…

July 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. 16 కేంద్రాలలో వంద రోజులు అడిన చక్కని కుటుంబ కధా చిత్రం . హీరో కామన్ మేన్ . హీరోయిన్ డబ్బున్న అమ్మాయి . తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది .

హీరో గారికి విపరీతమైన ఆత్మాభిమానం అనబడే ఆత్మ న్యూనతా భావం . హీరోయిన్ అన్ని సినిమాలలో హీరోయిన్స్ లాగా కాకుండా భర్తతో సర్దుకుపోయే భార్యే . అయినా , హీరోయిన్ తల్లిదండ్రులు అల్లుడి స్టేటసును పెంచేందుకు అతను పని చేసే యజమాని చేత కొత్త వ్యాపారం పెట్టించి అందులో అల్లుడికి వాటా అదీ ఇప్పిస్తాడు .

Ads

ఈ విషయం తెలిసిన హీరోకి ఆత్మాభిమానం పెల్లుబుకుతుంది . హీరోహీరోయిన్లకు అపార్ధాలు , భేషజాలు , పుట్టింటికి పోవటాలు జరిగిపోతాయి . దొరికిందే ఛాన్స్ అనుకుని వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతాడు హీరోయిన్ తండ్రి .

హీరో గారు ఊటీకి షిఫ్ట్ అవుతాడు . గర్భవతి అయిన హీరోయిన్ డెలివరీ కొరకు వాళ్ళూ ఊటీనే చేరుతారు . బిడ్డ పుట్టగానే అనాధ శరణాలయంలో వదిలి వెళతాడు హీరోయిన్ తండ్రి . ఇది గమనించిన హీరో ఆ బిడ్డను తెచ్చుకొని పెంచుకుంటాడు .

హీరోయిన్ మానసిక స్థితి దెబ్బతింటుంది . పెరిగిన బిడ్డ తల్లీదండ్రులను కలుపుతాడు . సినిమా సుఖాంతం అవుతుంది . ఇదీ స్టోరీ .

హిందీలో హిట్టయిన ప్యార్ ఝుక్తా నహీకి రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో మిధున్ చక్రవర్తి , పద్మిని కొల్హాపురి నటించారు . తమిళం , కన్నడం , బెంగాలీ , ఒడియా భాషల్లో కూడా రీమేక్ అయింది . అన్ని భాషల్లోనూ హిట్టయింది .

కాపురం టైటిలుతో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువ భాగం హిట్టయ్యాయి . ఒక్క కృష్ణే కాపురం టైటిల్ గల సినిమాలు ఎనిమిదింట్లో నటించాడు . 1985 సెప్టెంబర్ ఆరవ తేదీన విడుదలయిన ఈ పచ్చని కాపురం సినిమాలో కృష్ణ నటన చాలా బాగుంటుంది . ఫైట్లూ , గట్రాలు ఏమీ లేకుండా చక్కగా హుందాగా నటించుకుంటూ పోతాడు .

సినిమా మొదట్లో ఏమో ఒక్క ఫైట్ ఉంటుంది . అంతే . అతిలోకసుందరి ప్రేయసిగా , భార్యగా , బిడ్డను కోల్పోయిన తల్లిగా శ్రీదేవి బాగా నటించింది . ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది చిచ్చరపిడుగు మాస్టర్ అర్జున్ని . ముద్దుగా బాగుంటాడు . ఆరిందాలాగా నటించాడు .

అంతస్థుల గురించి తపన పడే తల్లిదండ్రులుగా జగ్గయ్య , షావుకారు జానకి నటించారు . ఇతర పాత్రల్లో కాంతారావు , రాజ్యలక్ష్మి , నూతన్ ప్రసాద్ , పి జె శర్మ , పి ఆర్ వరలక్ష్మి , విజయలక్ష్మి , బెనర్జీ , ప్రభృతులు నటించారు . సినిమా ఎక్కువ భాగం అయిదు పాత్రల చుట్టే తిరుగుతుంది . హీరోహీరోయిన్లు , హీరోయిన్ తల్లిదండ్రులు , మాస్టర్ అర్జున్ .

మిద్దె రామారావు నిర్మాత . తాతినేని రామారావు దర్శకుడు . సినిమాను రిచ్ గానే తీసారు . సత్యానంద్ డైలాగ్స్ బాగుంటాయి . ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం చక్రవర్తి సంగీత దర్శకత్వం , జేసుదాస్ , జానకమ్మ , శైలజ గాత్రం .

ఈ సినిమా ఐకానిక్ సాంగ్ వెన్నెలయినా చీకటయినా చేరువయినా దూరమయినా పాట . సినిమాలో మూడు నాలుగు చోట్ల వస్తుంది . వేటూరి వారు చక్కటి సాహిత్యాన్ని అందించారు . హిందీ సినిమా లోని ట్యూన్నే వాడుకున్నారు . హిందీలో పాట కన్నా మన తెలుగు లోని పాటే ఎక్కువ శ్రావ్యంగా ఉంటుంది . జేసుదాస్ చాలా బాగా పాడారు .

ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది చక్రవర్తి బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని . ఎంత ఆహ్లాదంగా అందించారో ! ఈ తరం సంగీత దర్శకులు తప్పక చూడాలి , నేర్చుకోవాలి . అలాగే సౌండ్ రికార్డింగ్ . ఇప్పుడొచ్చే సినిమాలలో డైలాగులు వినపడకుండా ఢాం ఢాం అని మ్యూజిక్కుని ప్రేక్షకుల మీద వదులుతున్నారు . ఆడమంటే ఏం ఆడతాయి ?

  • కృష్ణ పాటలన్నీ జేసుదాసే పాడారు . బాలసుబ్రమణ్యం కృష్ణల మధ్య గొడవల సమయంలో నిర్మించబడిన సినిమా . అలా జేసుదాస్ పాడటం జరిగింది . కొత్తగా మత్తుగా తొలిసారి చిలిపి కోరిక పుడుతుంది పాట బాగుంటుంది .

పాట చివర్లో హీరోహీరోయిన్లు చక్కగా నడిరోడ్ మీద కౌగలించుకుంటూ జనానికి దొరికిపోతారు . ప్రేమాతురాణాం న పరిసర స్పృహ న భయం . ముక్కు మీద కోపం , నా ప్రేమ రాగం పాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి .

సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ , అతిలోకసుందరి అభిమానులు తప్పక చూడవచ్చు . It’s a neat , feel good , emotional movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions