.
సముద్రం పాడిన ప్రేమ గీతం…. — డాక్టర్ మనోహర్ కోటకొండ… కడప….
నా మనసు ఎక్కడెక్కడ తిరిగితే అక్కడికంతా రాగలవా.. అంటుంది కథానాయక ఈ పాట ముందటి సన్నివేశంలో.. టేప్ రికార్డర్ లో ప్రియుడి గొంతు వింటున్న తన కూతురి దగ్గర నుంచి క్యాసెట్ తీసుకొని కాల్చి వేయడంతో.. నా జ్ఞాపకాలను కాల్చలేవు అని చెప్పి వెళుతుంది కథానాయక.. ఎక్కడికి వెళ్తున్నావ్.. అని తల్లి అంటే నువ్వూ వస్తావా అని ఆహ్వానం చెబుతుంది .
Ads
.
మనసు స్వేచ్ఛగా తన ప్రియుడితో తిరిగిన సంకేత స్థలాల సంచారం మొదలవుతుంది. తాము కలిసిన ప్రదేశాలను చూస్తూ అక్కడ తాము చేసిన అల్లరిని తానే తిరిగి దర్శిస్తూ ఆనాటి ఆ “పదహారేళ్ళ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు ” చెబుతూ సాగే అద్భుతమైన పాట.
ఆ ప్రాయంలో ఇసుకతిన్నెలు పానుపులవుతాయి., గాలులు పాటలు పాడతాయి, అలలు దీవెన జల్లులయితాయి , శిలలు వారి ప్రేమకు తెరచాటు ఒసగుతాయి.
ప్రేమికుని తలపులలో మునకలు వేస్తూ పులకితమైన హృదయం నుండి పుడుతుంది ఈ పాట. “భ్రమలో లేచిన తొలి జాములకు” ఆత్రేయ గారి అద్భుత ప్రయోగం కదా.. కలలూ కలవరాలూ కమ్ముకునే కన్నె వయసులో ఆ తొలి జాములు భ్రమలలోనే కదా గడిచేది.

పాట మొదట్లోనే హీరోకు అరబ్బుల లాగా వంగి సలాం చేస్తుంది హీరోయిన్.. పాట మాత్రం శతకోటి దండాలు చెప్పడం. ఇదో విచిత్రం అనిపిస్తుంది.
తన విప్పారిన నేత్రాలలో వింత స్వప్నాలు కొత్తదారులు దర్శిస్తున్న ప్రాయం అది. అందుకే ఆమె తను తానే పొగుడుకుంటుంది..
నాతో కలిసి నడచిన… కాళ్ళకు
నాలో నిన్నే నింపిన… కళ్ళకు
నిన్నే పిలిచే… నా పెదవులకు
నీకై చిక్కిన… నా నడుమునకూ…
కోటి దండాలు… శతకోటి దండాలూ…
ఇంకా తను ఇలా చెబుతుంది.. తొలి జామునకు సంధ్య వేళలకు కోటి దండాలు చెబుతూ.. నిన్నూ నన్నూ కన్న వాళ్లకు కూడా కోటి దండాలంటుంది.
స్వప్న లోకాలకు సత్యదారుల్లో ప్రయాణించే ఆ ప్రాయంలో మనకై వేచిన ముందునాళ్ళకూ.. శతకోటి దండాలు చెబుతుంది.. భవిష్యత్తు మీద అంత నమ్మకం ఉంటుంది ఆ పదహారేళ్లకు..
కంఠం వరకు సైకతంలో కూరుకుపోయిన అల్లరి పిల్లలు..
బొంగరాలను ఉదరం మీద తిప్పే చిలిపి చేతలు… జంట పాదముద్రలు వేసే అడుగులు . బుల్లెట్ బండికి సైకిల్ కట్టుకొని సాగే చిలిపి ప్రయాణాలు. శిలలపై కౌగిలింతలలో అలలచిరుజల్లుల ఆశీర్వచనాలు. బొమ్మ తేలును వేలు మీద ఉంచుకొని కరిచిందని చేసే అల్లరి ..
ఆ నొప్పిని తగ్గించాలని వేలును ముద్దిడే అమాయకపు స్వాంతనలు. వేలు మీద నేనా బుగ్గ మీద వద్దా అంటూ హీరో గారి ఆకతాయి దబాయింపు.. ప్రియురాలి శిరోజాన్ని వేలికి చుట్టుకుని ఉంగరం లాగా భావించి ముద్దు పెట్టుకునే అమాయకత్వం ఈ పాటలోని దృశ్య అపురూపాలు.
విశాఖ సముద్రం చెప్పే ప్రేమ కథే మరో చరిత్ర. ఆ సముద్రపు అలలు బాలు వ్రాసిన ప్రేమ లేఖల్ని స్వప్నకే కాదు మనకు కూడా అందిస్తూనే ఉంటాయి..
ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతం ఇరుకు శిలల దారుల్లో వేగంగా ప్రయాణించి ఒక్కసారిగా ఎగసే అలల్లాగా మన మనసును ముంచెత్తుతుంది. ముఖ్యంగా ఆయన వాయు లీనాల రాగాలు మనల్ని మేఘాల పైన ఊరేగిస్తాయి. టైటిల్ కార్డ్ అప్పుడు వచ్చే హమ్మింగ్.. గిటార్ ధ్వనులు ఇళయరాజా గారివి.. ఆ రాగాన్ని తిరిగి ఐ లవ్ యు ఐ లవ్ యు అన్న కోరస్ తో కలిపి గీతాంజలి సినిమా టైటిల్స్ లో మళ్ళా వినవచ్చు.
1975’లోనే “అపూర్వ రాగంగల్ “తెలుపు నలుపు చిత్రంతో తన సినిమాటోగ్రాఫీకి నేషనల్ అవార్డు గెలుచుకున్న బిఎస్ లోకనాథ్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా సన్నివేశాలలో ఫ్రేమింగ్ చాలా గొప్పగా ఉంటుంది. చిత్రం మొదలయ్యేటప్పుడు సముద్ర ఘోష.. అలలు శిలల పైన పగిలిపోయే దృశ్యాలు.. శిథిలాల మధ్య కెమెరా రివాల్వింగ్ ..
ఏకాంతం కోసం ఎంతో దూరం ప్రయాణించినb హీరో హీరోయిన్ల సంభాషణ. మన ప్రేమ కథ .. చరిత్ర ఎందుకు కాకూడదు అన్న కథానాయక మాటతోనే మనలో తెలియని ఉద్వేగం కలుగుతుంది. గాఢత కలిగించే చిత్రాలను కథను చెప్పే మాంటేజ్ దృశ్యాలుగా చూపించారాయన తన కెమెరాతో..
విశాఖ స్టీల్ ప్రాజెక్ట్ బోర్డు , పైలాన్ కూడా కనపడుతుంది ఓ సన్నివేశంలో.
ప్రేమంటే ఓ భరోసా.. ఓ తెగింపు.. ఓ ధైర్యం.. ఓ నిబ్బరం.. ఓ అమాయకత్వం. శిలల పైన చెట్ల మొదళ్లలోనూ. విరిగిపడిన స్తంభాల మధ్య శిథిలమైపోయిన గోడల మీద .. ఎక్కడ చూసినా బాలు స్వప్న ల పేర్లే కనపడతాయి.
గణేష్ పాత్రో గారి సంభాషణలు ఆత్రేయ గారి పాటలు బాలచందర్ గారి దర్శకత్వం కమల్ సరితల నటన ఈ చిత్రాన్ని అజరామరం చేశాయి. గుండెలను పిండే ప్రేమ కావ్యం తో మరో చరిత్ర సృష్టించిన బాలు స్వప్నలకు ఎప్పటికీ పదహారేళ్ళే…
Share this Article