.
అప్పట్లో కాషాయ శిబిరం ఘనంగా చెప్పుకుంది… పద్మ పురస్కారాలకు జనాభిప్రాయం తీసుకుని ప్రకటిస్తున్నట్టు… నిజమైన అర్హులకే అవి దక్కుతున్నట్టు… సరే, కొంతవరకూ అంగీకరిద్దాం…
బీజేపీ ఓ రాజకీయ పార్టీ… మోడీ ఓ పొలిటికల్ ప్రధాని… పద్మ పురస్కార ప్రకటనల్లో ఖచ్చితంగా రాజకీయాల ప్రభావం ఉంటుంది… ఉన్నది… తాజా పద్మ పురస్కారాలు పైపైన చూసినా అర్థమయ్యేది అదే… అంటే ప్రస్తుతం పురస్కారాలు ప్రకటించబడినవారు అనర్హులని కాదు… కానీ రాజకీయాల ప్రభావం ఉందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం…
Ads
ఉదాహరణకు బాలకృష్ణ… ఏకంగా పద్మభూషణ్ ఇచ్చారు… ఏపీలో కూటమి ప్రభుత్వం, బీజేపీ కూడా భాగస్వామి… ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగుదేశం ఏళ్లనాటి నినాదం… కానీ మోడీ మీద ప్రెజర్ పెట్టరు… ప్రతిగా తన వియ్యంకుడు, బావమరిది బాలయ్యకు పద్మభూషణ్ ఇప్పించుకున్నాడు చంద్రబాబు…
పేరుకు తెలంగాణకు ఓ పురస్కారం అంటూ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్ ప్రకటించారు… నిజానికి తన అత్యంత ప్రతిష్టాత్మక ఎఐజీ హాస్పిటల్ ఉన్నది హైదరాబాదులోనే అయినా తను ఆంధ్రా… సేమ్, మాడుగుల నాగఫణిశర్మకు ఇప్పుడు పురస్కారం ఎందుకో అర్థం కాలేదు గానీ, తను హైదరాబాద్ వాసే, కానీ ఆంధ్రా… అదే కేటగిరీలో ఇచ్చారు…
ఒక్క మందకృష్ణ మాదిగ మాత్రమే రియల్ తెలంగాణ కేటగిరీలో పద్మ పురస్కారం ప్రకటించబడ్డాడు… తను బీజేపీ క్యాంపే ఇప్పుడు… కాకపోతే తన ప్రజా పోరాటానికి అవార్డు దక్కాల్సిందే… మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకు ఏపీ కేటగిరీలో పద్మ పురస్కారాలు దక్కాయి… (వాళ్లు ఎవరో ఈ కథన రచయితకు తెలియదు, కాబట్టి నో కామెంట్…)
అయిదుగురికి అమెరికా నుంచే గాక… సుజుకి బాస్ దివంగత ఒసాము సుజుకికి మరణానంతర పద్మవిభూషణ్ ఇచ్చారు… కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్‌ల నుంచి ఒక్కొక్కరికి…! పద్మ పురస్కారాలకు బలమైన పైరవీలు, రాజకీయ సిఫారసులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఉన్న విమర్శే కదా… మోడీ అతీతుడేమీ కాదు, కాలేడు… మొత్తం జాబితాను పేర్లవారీగా విశ్లేషించలేం గానీ, నాలుగు మెతుకులు పట్టి చూస్తే అర్థమైంది అదే…
‘అద్భుతమైన’ ఆదర్శ పుష్పరాజ్ పాత్రను అనితరసాధ్యంగా పోషించిన అల్లు అర్జున్‌కు పద్మాన్ని సాధించడంలో అల్లు అరవింద్ ఎందుకో విఫలమయ్యాడు ఫాఫం… బహుశా కూటమి ప్రభుత్వంలోనే ఉన్న పవన్ కల్యాణుడికి కోపం వస్తుందని అనుకున్నాడా మోడీ భాయ్..?
అవునూ, మోడీ భాయ్… తెలంగాణ నుంచి కళలు గట్రా కేటగిరీల్లో ఒక్కరూ కనిపించలేదా..? అవునూ, బీసీ కృష్ణయ్య పేరు మరిచారేం..? అబ్బే, పద్మాల జాబితా లోపభూయిష్టంగా ఉంది మాస్టారూ..!!
Share this Article