పాడుతా తీయగా…. తెలుగు టీవీలో సంగీత ప్రధానమైన తొలి రియాలిటీ షో… దాన్ని కొట్టిన షో మరొకటి రాలేదు… రాదు కూడా… కారణం :: ఎస్పీ బాలు… పిల్లల దగ్గర్నుంచి, పెద్దల దాకా ఎందరో ఔత్సాహిక గాయకుల ఎదుగుదలకు అది వేదిక… ఎందుకు మెచ్చుకోవాలీ అంటే… బాలు దాన్ని నిర్వహించిన తీరు..! ఎవరినో గెస్టుగా పిలిచేవాడు, పాడుతున్నవాళ్ల తప్పుల్ని చెప్పేవాడు సున్నితంగా, సరిదిద్దేవాడు, ఆ పాట రచయిత గురించి వీలైతే చెప్పేవాడు, సంగీత దర్శకుడి గురించి ప్రస్తావించేవాడు, ఆ పాట వెనుక విశేషాల్ని వివరించేవాడు… తద్వారా ఏకాలం నుంచో మన తెలుగు సినీగీతాల్ని సుసంపన్నం చేసిన దర్శకులు, రచయితల్ని స్మరించేవాడు… నిజానికి తను ఆ షోకు జడ్జి కాదు, యాంకర్ కాదు… అన్నింటికీ మించి..! అదొక యూనిక్ స్టయిల్… పలు భాషల్లో కొన్ని వేల పాటల్ని పాడిన అనుభవం, సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో ఉండటం, స్వతహాగా ఓ రికార్డింగ్ స్టూడియో ఓనర్ కావడం వంటి అనేక కారణాలు బాలుకు ఆ సాధికారతను కల్పించాయి…
తను శిఖరసమానుడు… తన కొడుకుగా ఎస్పీ చరణ్ కొత్తగా ఏమీ ఆయన పేరును ఉద్దరించనక్కర్లేదు… ఈ పిల్ల కాకికి అంత సీన్ కూడా లేదు… బాలు చనిపోయాక స్వరాభిషేకం ఎలా భ్రష్టుపట్టిందో విన్నాం, చూశాం… అయితే ఇప్పుడు కొత్తగా మరో నిర్వాకానికి తెరతీస్తున్నాడు.,. ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడట… ఈటీవీ వాళ్ల తాజా ప్రోమో చూస్తే కలుక్కుమనిపించింది… సరికొత్త సంచిక, సురాగవిపంచిక అంటూ ఆ ప్రోమో చక్కర్లు కొడుతోంది… కానీ చరణ్‌కు సినిమా సంగీత ప్రపంచం లోతుపాతులు ఏం తెలుసని..? పాత పాడుతా తీయగాలో బాలు పోషించిన పాత్రను పోషించగల అనుభవజ్ఞులు, సమర్థులు ఎవరున్నారని ఇప్పుడు..? ఒక చంద్రబోస్, ఒక సునీత, ఒక విజయప్రకాష్, ఒక చరణ్ కలిసి ఆ షోను కొత్తగా ఉద్దరిస్తారట…
Ads
అసందర్భ నవ్వులు, వగలు తప్ప సునీతకు అన్ని సినిమా పాటల గురించి ఏం తెలుసని..? ఆ పాటల్లోని సాహితీవాసనల గురించి ఏం చెప్పగలదు..? పాత పాటల నేపథ్యాల్ని ఏం తెలుపగలదు..? సేమ్, చంద్రబోస్ కూడా అంతే కదా… తను రచయిత తప్ప సంగీతకారుడేమీ కాదు… అప్పట్లో ఎయిర్టెల్ సూపర్ సింగర్ షో తప్ప తను జడ్జిగా కూడా ఇతర మ్యూజిక్ రిలేటెడ్ రియాలిటీ షోలలో పెద్ద ఇంప్రెసివ్‌గా కూడా అనిపించలేదు… ఆమధ్య జీటీవీలో భారీ ఖర్చుతో, ప్రదీప్ యాంకర్‌గా సరిగమప అంటూ ఓ షో వచ్చింది… అందులో జడ్జిలందరూ ఉత్త పోశిగాళ్లే… చివరకు శైలజ కూడా వెలవెలబోయింది… విజయప్రకాష్ బేసిక్‌గా కన్నడిగ… మొన్నామధ్య స్వరాభిషేకంలో ఏదో పాట పాడి ఖూనీ చేస్తే మనమే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… అసలు ఈ నలుగురిలో ఆయనకు ఎలా స్థానం దక్కిందనేదే పెద్ద హాశ్చర్యం… చరణ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… పైగా ఈ నలుగురిలో చంద్రబోస్ తప్ప మిగతా ముగ్గురికీ తమ అభిప్రాయాల్ని ప్రేక్షకులు కనెక్టయ్యేలా వ్యక్తీకరించడమే సరిగ్గా తెలియదు… పోనీ, కేవలం జడ్జిలుగా వ్యవహరిస్తారా..? అలాంటప్పుడు ఆ ‘పాడుతా తీయగా’ పేరును ఎందుకు వాడుకోవడం..? దాన్నెందుకు భ్రష్టుపట్టించడం..? వదిలేయొచ్చు కదా… ఆ విపంచిక పేరుతోనే కొత్త షో చేసుకోవచ్చు కదా…! కనీసం ఈటీవీ టీంకైనా బుర్ర పనిచేయాలి కదా…!!
Share this Article