.
Mohammed Rafee …….. బొబ్బరలంక వృద్దాశ్రమంలో పాకీజా… సినీ నటి పాకీజా కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో వున్న బొబ్బరలంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె అసలు పేరు వాసుకి!
చెన్నైకి చెందిన పాకీజా కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతూ తిరుచ్చిలో ఉండేవారు! తమిళనాడు ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమ నుంచి సహకారం అందలేదు! దాంతో ఆమె సుమన్ టివిని ఆశ్రయించి ఇంటర్వ్యూ ద్వారా కొంత సమకూర్చుకున్నారు.
కొన్నాళ్ళ తరువాత మళ్ళీ మంగళగిరి వచ్చి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన రెండు లక్షలు ఆర్ధిక సాయం చేశారు. ఆ తరువాత ఆమె తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు మకాం మార్చారు.
Ads
బొబ్బరలంక లో వున్న శ్రీరామ ఆశ్రమంలో ఆశ్రయం పొంది అక్కడే వుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం ఆశ్రమాన్ని సందర్శించి పాకీజాను పరామర్శించారు. ఆరోగ్య క్షేమాలు తెలుసుకున్నారు. 50 వేల రూపాయలు ఆర్ధికసాయం అందించారు.

అసలు ఈ దుస్థితి ఎందుకు?
తెలుగు చలన చిత్రసీమలో ఇలాంటి నటులు ఎందరో జీవనం గడవక ఇబ్బందులు పడుతున్నారు! సినిమా పరిశ్రమపై ఆసక్తితో వచ్చి చిన్నాచితకా వేషాలు వేస్తూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్ర పరిశ్రమ ఒక ఊబిలాంటిది! ఎంతో ఉత్సాహంగా ఆకర్షిస్తుంది! అందులోకి దిగాక రానురాను తెలిసి వస్తుంది! అలా అని వదలి వెనక్కి వెళ్ళలేరు! పెద్దగా ఊహించుకుని ఎన్నో ఆశలతో వస్తారు! చివరకు భ్రమలు తొలగిపోయి జూనియర్ ఆర్టిస్టులుగా సరిపెట్టుకుంటారు! కొన్నాళ్ళకు ఆ వేషాలు కూడా అంతంత మాత్రమే కొందరికి! అయినా సరే, సినిమా రంగాన్ని వదల్లేరు!
తెలుగు చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ కు ప్రత్యేక సంఘాలు ఉన్నాయి! అందులో సభ్యత్వం తీసుకోవాలన్నా తడిసి మోపెడు! సినిమా అవకాశాలు వస్తాయని అప్పులు చేసి మరీ సభ్యత్వం తీసుకుంటారు! కానీ, వయసు పైబడే కొద్దీ అవకాశాలు తగ్గిపోతాయి! ఇక అక్కడ నుంచి సమస్యలు మొదలవుతాయి! జీవనం దుర్బరమవుతుంది! ఆర్ధిక సాయం కోసం ఎదురు చూపులు!
ఈ పరిస్థితిని తెలుగు చిత్ర పరిశ్రమ అధిగమించలేదా? అంటే ఈజీగా అధిగమించవచ్చు! కానీ, ఎవ్వరూ తలచుకోరు! పట్టించుకోరు! అదే సమస్య! తెలుగు చిత్ర పరిశ్రమ తలచుకుంటే ఒక అపురూపమైన వృద్దాశ్రమం ఏర్పాటు చేసి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సీనియర్ నటులకు అవకాశం కల్పించవచ్చు! ఈ ఆలోచన ఎన్నాళ్ళుగానో వింటున్నాం ఆయా సంఘాల నుంచి! కానీ, ఆచరణలోకి రాదు!
పేరున్న నటులంతా కొంచెం కొంచెం వేసుకుంటే వేలాది మంది నటులకు ఆశ్రయం కల్పించవచ్చు! అది పెద్ద కష్టం కూడా కాదు! అదే జరిగితే ఇలా పాకీజా, శ్యామల, జయ వాహినిలా ఇంకా చాలామంది నటుల్లా… ఆర్ధిక సాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండదు!
ఎవరికైనా కావాల్సింది సమయానికి కాస్త తిండి, అనారోగ్యానికి కాసింత చికిత్స, మందులు! ఇంతకు మించి ఆ వయసులో ఏం కోరుకుంటారు? – డా. మహ్మద్ రఫీ
Share this Article