.
Subramanyam Dogiparthi
….. టైటిలే పల్నాటి సింహం, కానీ కధ మాత్రం ఇరవయ్యో శతాబ్దపు పల్నాటి యుధ్ధమే . 12వ శతాబ్దంలో జరిగింది ఆంధ్ర మహాభారతం లేదా దక్షిణ కురుక్షేత్రం అయిన పల్నాటి యుధ్ధం .
మహాభారతంలోలాగా దాయాదుల మధ్య యుద్దం అయినా మూలాలు శైవులు , వైష్ణవుల మధ్య యుధ్ధమే ఆనాటి పల్నాటి యుధ్ధం . బ్రహ్మనాయుడు చెన్నకేశవుని భక్తుడయిన వైష్ణవుడు . చాపకూడు సిధ్ధాంతాన్ని వ్యాప్తి చేయటం నచ్చని శైవులు నాయకురాలు నాగమ్మను రంగంలోకి దింపుతారు .
Ads
ప్రపంచంలో తొలి మహిళా మంత్రి అయి శకునిలాగా అన్నదమ్ముల మధ్య వైరం పెంచి యుధ్ధానికి తెర లేపుతుంది నాగమ్మ . 1178- 1182 మధ్యలో జరిగిందని భావించబడే పల్నాటి యుధ్ధం కారంపూడి వద్ద నాగులేరు తీరాన జరుగుతుంది . నాగులేరు రక్తపుటేరు అవుతుంది .
ఈరోజుకీ ఆ పల్నాటి యుధ్ధాన్ని తలచుకుంటూ పల్నాటి వాసులు ఊగిపోతూ ఉంటారు . ప్రతాపాలకు , పౌరుషాలకు , కక్షలకు , కార్పణ్యాలకు , రౌద్రానికి , భీభత్సానికి చిరునామా పల్నాడు . కారంపూడి వద్ద నాగులేరు తీరాన వీరుల గుడి/వీర్ల గుడి ఇప్పటికీ ఉంది .
సంవత్సరంలో అయిదు రోజులు తెరవబడుతుంది . ఆ సమయంలో వీరారాధన పేరుతో జాతర జరుగుతుంది . బ్రహ్మనాయుడు , నాగమ్మ , కన్నమదాసు వంశీయులు ఈ పల్నాటి పండుగల్లో , జాతర్లలో పాల్గొంటూ ఉంటారు .
ఆనాటి బ్రహ్మనాయుడు వంశీయుడిగా ఘట్టమనేని కృష్ణమనాయుడు పేరుతో కృష్ణ , నాయకురాలు నాగమ్మ వంశీయయురాలిగా నాగమణి పేరుతో శారద , బాలచంద్రుడిలాగా బాలచంద్ర నాయుడు పేరుతో శివకృష్ణ అద్భుతంగా నటించారు . అసలీ కధను నేసిన పరుచూరి బ్రదర్సుని ఘనంగా అభినందించాలి . 12 వ శతాబ్దపు వైరం కొనసాగింపుగా నేసారు .
మూడు కుటుంబాల మధ్య నడిచే ఈ సినిమా కధలో పల్నాటి వైభవ స్మృతులను ఒక చోటికి చేర్చి గొప్ప మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణమనాయుడు ప్రయత్నం . వాటిని దొంగిలించి విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకునే విలనుగా నీలకంఠమ నాయుడు పాత్రలో సత్యనారాయణ . అతనికి చెల్లెలుగా శారద .
శారద భర్తగా జగ్గయ్య , వారిద్దరి కుమార్తెగా రాధ నటించారు . జగ్గయ్య చెల్లెలుగా అన్నపూర్ణ . ఆమె భర్త హేమసుందర్ బ్రహ్మనాయుడు వంశం . వారిద్దరి కుమారులు కృష్ణ , శివకృష్ణ .
నాగమణి పాత్రలోని శారద IAS కు వెళ్ళకూడదని గ్రామ పెద్దలు తీర్పు చెప్పటం , దానిని వ్యతిరేకించిన ఆమె అన్న సత్యనారాయణ వర్గం కొట్టుకోవటం , ఆ గొడవలో కృష్ణ తండ్రి చనిపోవటం , తన చెల్లెలుకి వైధవ్యానికి తన భార్య కారణమయిందని జగ్గయ్య సన్యసించటం జరుగుతుంది .
ఈ వైరం కొనసాగి రెండు కుటుంబాల మధ్య మరో పల్నాటి యుధ్ధానికి దారి తీస్తుంది . నీలకంఠమ నాయుడి మాటలను నమ్మి మోసపోయిన కలెక్టర్ నాగమణి తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం , చివరకు నిజం తెలుసుకుని నాయకురాలు నాగమ్మలాగా సన్యసించి భర్త వద్దకు చేరటం జరుగుతుంది . ఈ యుధ్ధంలో పలువురిని చంపిన నేరానికి కృష్ణమనాయుడుకి ఉరి శిక్ష పడటం , అందుకు ముందుగానే పుణ్యస్త్రీగా చనిపోవాలని జయసుధ ఆత్మహత్య చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .
మనకు రెండు పల్నాటి యుధ్ధం సినిమాలు ఉన్నాయి . మొదటిది 1947 లోనిది . గోవిందరాజుల సుబ్బారావు , కన్నాంబ , అక్కినేని నటించారు . రెండవది 1966 లోనిది . యన్టీఆర్ , భానుమతిలు నటించారు . 1947 సినిమా లోని కన్నాంబను గుర్తుకు తెస్తుంది శారద ఈ సినిమాలో . Of course . కన్నాంబలాగా ఎవరూ నటించలేరనుకోండి .
కృష్ణ వీర విహారం చేసారు . అల్లూరి సీతారామరాజు సినిమాని గుర్తుకు తెస్తారు . అలాంటి రౌద్ర , భీభత్స రసపూరిత సంభాషణలను వ్రాసారు పరుచూరి బ్రదర్స్ . కృష్ణ , శారదల తర్వాత అత్యద్భుతంగా నటించింది సత్యనారాయణ .
ముఖ్యంగా జాతరలో ఆయన వీరంగ నృత్యం శివ తాండవంలాగా ఉంటుంది . అంత రౌద్రంగా , పవర్ఫుల్గా ఎలా తాండవించ కలిగాడో ఆశ్చర్యమే . అప్పుడు ఆయన వయసు 49 సంవత్సరాలు , కాస్త భారీ కాయమే కదా . తప్పక చూడవలసిన జాతర నృత్యం ఇది .
పరుచూరి బ్రదర్స్ కధకు స్క్రీన్ ప్లేని చాలా బిర్రుగా, పెద్ద కామెడీ ట్రాక్ లేకుండా, సీట్లలో నుంచి ప్రేక్షకుడు లేవకుండా తయారు చేసుకున్నారు దర్శకుడు కోదండరామిరెడ్డి . రంగనాధ్ బుర్రకధతో ప్రారంభం అవుతుంది సినిమా .
పల్నాటి గాధ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఈ బుర్రకధ . వీర ఊపులో ఉంటుంది . ఎత్తిన కత్తి దించలేదు అన్నట్లుగా ఈ బుర్రకధ లేపే ఊపుని సినిమా చివరిదాకా లాగించాడు కోదండరామిరెడ్డి . ఎక్కడా ఊపిరి పీల్చుకోనివ్వడు .
వీటన్నింటికీ తగ్గట్లు చక్రవర్తి సంగీతం , వేటూరి రాజశ్రీ యం యస్ రెడ్డి పాటలు ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మాధవపెద్ది రమేష్ అంత గొప్పగా పాడారు . ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరి పోనీ స్వామీ పాటకు మహిళా ప్రేక్షకులు నీరాజనం పట్టారు . సూపర్ హిట్ సాంగ్ .
పాలు పొంగే గడ్డ పలనాటి సీమను పాలించవచ్చినా కేశవా చెన్నకేశవా జాతర పాట అద్భుతంగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి . అలాగే రంగనాధ్ బుర్రకధ . మిగిలిన మూడు డ్యూయెట్లు గ్లామర్ స్పేసుని ఫిల్ చేస్తాయి .
కృష్ణ , శారద , సత్యనారాయణల తర్వాత మెచ్చుకోవలసింది శివకృష్ణ , జయసుధ , జగ్గయ్య , అన్నపూర్ణ , రాధలను . చాలా బాగా నటించారు . ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ , సూర్యకాంతం , హేమసుందర్ , సి యస్ రావు , గోకిన రామారావు , చలపతిరావు , రాజ్ వర్మ , ప్రభృతులు నటించారు .
వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా యం యస్ రెడ్డి సూపర్ హిట్ సినిమాను సంపాదించుకున్నాడు . కనక వర్షం కురిసిన ఈ సినిమా 14 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కృష్ణ కెరీర్లో పవర్ఫుల్ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది కృష్ణమనాయుడి పాత్ర .
శ్రీనాధ మహాకవి వ్రాసిన పలనాటి వీర చరిత్ర ఆధారంగా సినిమాలు , నాటకాలు , బుర్రకధలు తెలుగు నాట చాలా పాపులర్ . కృష్ణకు 228 వ సినిమా ఇది . An unmissable movie . సినిమా యూట్యూబులో ఉంది . ప్రతి తెలుగు వాడు తప్పక చూడవలసిన సినిమా . సినిమానే కాదు ; కారంపూడి , మాచర్ల , గుత్తికొండ బిలం , ఈ ప్రాంతాలలో ఉన్న దేవాలయాలను కూడా వీలు చూసుకుని తప్పక చూడాలి . నాకయితే వీర ఇష్టం ఈ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article