.
ముందుగా ఓ సంగతి చెప్పాలి… ఎందుకంటే… 1) ఇది ఓ సుదీర్ఘ పోస్టు… 2) వాట్సప్‌లో బాగా కనిపించింది… 3) ఒరిజినల్ రచయిత తెలియదు నాకు… 4) పంచాంగ శ్రవణాన్ని మోడరన్ సోషల్ భాషలో చెప్పడం… 5) తప్పేమీ లేదు, పంచాంగం అంటే ప్రయోగవ్యతిరేకం కాదు కదా… 6) మంచో చెడో పంచాంగం, రాశిఫలాల వైపు నమ్మేవాళ్లను, నమ్మనివాళ్లను ఆకర్షించి చదివించడం ఇది…
ఇప్పుడే మిత్రుడిచ్చిన క్లారిటీ, రచయిత పేరు Haribabu Maddukuri
Ads
అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో..
మేష రాశి:
కష్టపడి సంపాయించేది 2, సులభంగా పోగొట్టేసేది 14,
చేతులు కట్టుకునేది ఐదుగురు, నీ బొంద అని మొఖం మీదే అనేది ఏడుగురు..
ఈ ఏడాది మేష రాశివారిని శనిగారు సల్సా డ్యాన్సులు వేయించే సరసమైన సంవత్సరం.. దానికి తోడు గురువుగారు కూడా కొంచెం గుర్రుగా ఉన్నందున ఈ బకరములు పోగేసేదానికంటే బయట తగలేసేదే ఎక్కువ. ఇస్తన్నాయి కదాని ఏ యాప్పుల్లోనూ అప్పులు చేసేయ్యకూడదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని అప్పడిగితే తీస్కున్నోడికి ప్రాణగండం అని చెప్పి తప్పించుకోవాలి.. ఉద్యోగుల్ని బాసులు కాల్చుకు తింటే, వ్యాపారుల్ని అందరూ వేపుకుతింటారు.. ఎలా చూసినా గ్రహాలన్నీ అల్లాడించి డీజే కొట్టించే సంవత్సరం కాబట్టి, చేతులు కాలక ముందే హెల్త్ ఇన్సూరెన్సులనే ఆకులు కట్టుకుని రెడీగా ఉంచుకోవాలి.. ఖాళీ ఉన్నప్పుడు దక్షిణామూర్తికి దండం పెట్టుకుని, శనిగారికి పూజలు చేయిస్తే మంచిది.
ట్యాగ్ లైన్: ఏది ముట్టుకుంటే అది మసి..
———————————————————————-
వృషభ రాశి:
వచ్చేది 11, వొంపేసేది 5..
దండం పెట్టేది ఒకరు, పంగనామాలు పెట్టేది ఏడుగురు.
శనిగారు, గురువుగారు కల్సి ఈ ఏడాది మీ సైడే బ్యాటింగ్ ఆడతన్నారు గనుక రంకెలేసుకుంటూ ఫుల్లు ఫామ్లో ఉంటారు వృషభాలు.. అరుణాచలం సినిమాలో రజనీకాంత్లాగా మీరేం జేసినా సరే చేతిలో లచ్చిందేవి గలగల్లాడిపోద్ధి.. ఆఖరికి సరదాగా పెట్టిన పెట్టుబడులు కూడా విపరీతంగా కలిసొచ్చేస్తాయ్ మీ దుంపతెగాని.. ఎక్కడ శుభకార్యాలు జరిగినా సరే.. బట్టల దుకాణం ఓపెనింగుకొచ్చిన హీరోయిన్లా మీరే స్పెషల్ ఎట్రాక్షను… కనుక నగలు గట్రా ముందుగానే కొనేసుకుని, బట్టలవీ ఎంబ్రాయిడరీ వర్కులకి ఇచ్చేసుకుని రెడీగా ఉంచుకోండి..
మీరెక్కడికెళ్ళినా వైట్ & వైట్ వేసుకొచ్చినోళ్ళు కూడా వొంగి వొంగి దణ్ణాలెడతారు.. పన్జేసేచోట మీరేదంటే అదే.. చేసిందే పని, పెట్టిందే లీవు.. కూర్చున్నదే డెస్కు, మాట్లాడిందే మీటింగు.. మరన్నీ ఇంత పెర్ఫెక్టుగా ఉంటే మనకి ఏదోటి వెలితి కాబట్టి అప్పుడప్పుడూ కొంచెం ఆరోగ్యం చూసుకుంటే చాలు..
ట్యాగ్ లైన్: ఈ ఏడాది మొత్తం మీదేనెహే..!!
———————————————————————-
మిథున రాశి:
చేతిలో పడేది 14, చాలా జార్తగా వదిలేది 2..
వినయం నటించేది నలుగురు, మీమీద పడి ఏడ్చేది ముగ్గురు..
ఏతావాతా చూసుకుంటే ఈసారి ఒత్తిళ్లు బెమ్మాండంగానే ఉన్నాయి. చేతిలో 16 pro max ఫోనుంటాదిగానీ అందులో నెట్ కనెక్షనుండదు.. ఏటీఎం మెషీన్ ఎత్తుకొచ్చేద్దామనెళ్లి కష్టపడి పాస్ బుక్ మెషీన్ ఎత్తుకొచ్చుకుంటారు… ఇలాంటి రివర్స్ గేరు టెన్షన్లు, మతిమాలిన ఒత్తిళ్లు ఎక్కువయ్యి బీపీ బిళ్ళలు, షుగర్ మందులు మింగాల్సొస్తుంది ఒక్కోసారి. కనుక కాలు ఓ తెగ తొక్కేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటూ యోగాలు, జిమ్ములు చేస్తే మంచిది.. కానీ.. ఏ మాటకామాట.. చిల్లర లేదని మీరు చేతులు పిసుక్కునేలోపు యే అరటిపండుగాడో ఎదురొచ్చి, ఆడి క్రెడిట్ కార్డు మీకిచ్చేసి పళ్ళికించి ఎళ్పోతాడు.. మరి ఆళ్ళలా సమర్పించుకోవాలంటే .. మీరు సూర్రావుగారికి, దక్షిణామూర్తిగారికి దణ్ణాలెట్టుకోడం మంచిది.
ట్యాగ్ లైన్: కొంచెం ఇష్టం కొంచెం కష్టం..
———————————————————————-
కర్కాటక రాశి:
పోగేసేది 8, పారబోసేది 2..
జేజేలు పలికేది ఏడుగురు, సంకలు గుద్దుకునేది ముగ్గురు..
గురువుగారు వ్యయంలోనూ, శనిగారు భాగ్యంగానూ ఉన్నారు గనుక పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోటంలోనూ, అక్కర్లేని దండగ ఖర్చులు పెట్టడంలోనూ ముందుంటారు ఈ ఎండ్రకాయలు.. అమెజాన్లో అగరొత్తులు ఆర్డర్ పెడదామనుకుని బీడికట్ట కూడా కొనుక్కుంటారు మాలోకాలు.. చేతిలో చిల్లర తెగ ఆడేస్తోంది కదాని ఇష్టమొచ్చినట్టు ఖర్చుచేస్కుంటా పోతే ఆఖరికి ఆర్థిక కష్టాలు చింతపండేసి తోమినట్టు తోమేస్తాయని తెల్సుకోలేరు పాపం.. అలాగే ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఆవేశంగా చేతులు మడతెట్టుకుని రయ్యిన దూసుకుని పోకూడదు.. గొడవలకి దూరంగా, ఎంత మూసుకునుంటే అంత మేలు.. ఆరోగ్యమే మహాభాగ్యలక్ష్మీ బంపర్ డ్రా అన్నారు గనుక అప్పుడప్పుడూ ఒంటిని కూడా పట్టించుకుంటే మందుల ఖర్చు మిగుల్తుంది. వీలైనప్పుడు దుర్గాదేవికి, దక్షిణామూర్తికి కూడా దణ్ణం పెట్టుకోండి..
ట్యాగ్ లైన్: అన్నీ బాగానే ఉన్నా, పనికిమాలినవాటిని ప్రోత్సహించడంలో ఫస్టు ప్రైజు మీదే !
———————————————————————-
సింహ రాశి:
పోగేసేది పదకొండు, పోయేది రెండు..
సూపరనేది ఏడుగురు, థూ అని ఊసేది ముగ్గురు..
ఇప్పటిదాకా మీరు పిల్లలు ఎదురు తిరగడం చూసుంటారు, పనోళ్ళు ఎదురు తిరగడం చూసుంటారు.. కానీ మొదటిసారి గ్రహాలు ఎదురుతిరగడం అంటే ఏంటో చూస్తారు మేష్టారూ.. మీలాగే మీ దగ్గరున్న డబ్బుకి కూడా కంగారెక్కువ కనుక జేబులో ఎక్కువసేపు నిలబడలేదు.. శనిగారు అష్టమంలో తిష్ట వెయ్యడంతో ఇంట్లో మొగుడుపెళ్ళాల మధ్య చేటలు, చీపురుకట్టలు గాల్లోకి ఎగిరే అవకాశాలు లెక్కకుమిక్కిలిగా ఉన్నాయ్.. అది చాలదన్నట్టు బయటివాళ్లతో కూడా కూలిచ్చి మరీ కొట్టించుకునే సందర్భాలు సైతం స్పష్టంగా ఆనతన్నాయ్.. కనుక.. ఎవ్వరొచ్చి కెలికినా సరే.. “ఇప్పుడు కాదు చిన్నా” అని నవ్వుతూ దణ్ణం పెట్టి, ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకెళ్లిపోవాలి తప్ప కండలు బిగించి ఫైటింగులకి దిగిపోకూడదు.. మీరు పెన్సిల్తో వేస్కున్న టైమ్ టేబుల్ని ఎప్పటికప్పుడు శనిగారు రబ్బర్తో చెరిపేస్తారు కాబట్టి, అనుకున్న పనులన్నీ అయ్యేదాకా జేబులో జంతికలు నలుపుకుంటూ ఓపిగ్గా ఉండాలి తప్ప ఎవ్వరిమీదా నోరేసుకుని పడిపోకూడదు. అలాగే, ఆరోగ్యం అటూఇటూ అవ్వకముందే జార్త పడటం మంచిది. ప్రయాణాలప్పుడు కంగారడకుండా నింపాదిగా తోలడం మంచిది.. ఇన్ని దైద్రాలు మనం పడలేంరా సామీ అనుకుంటే.. శనికి తైలాభిషేకం, సూర్యాష్టకం చేయిస్తే మరీ మంచిది.
ట్యాగ్ లైన్: అసలు బొమ్మ ముందుంది ఆచార్యపుత్రా.. రండి రండి..!
———————————————————————-
కన్యా రాశి:
పొందేది 14, వదిలించేది 2,
మీరు తోపనేది ఆరుగురు అయితే , లేదు మీరు పాపి అని కూసేది తొమ్మండుగురు.
ఈ ఏడాదంతా కన్యగారి చుట్టూ శనిగారు మరియూ గురువుగారు బౌన్సర్లలాగా చుట్టూనే తిరుగుతూ ఉండటం వలన ఆర్థికంగా సూపరో సూపరు.. ఫిల్టర్లేసిన సెల్ఫీలాగా సంవత్సరమంతా కలర్ఫుల్ గా ధగధగలాడిపోద్ది.. అనుకోకుండా బంపర్ మెజార్టీతో గెలిచేసిన ఎమ్మెల్యేలాగా పలుకుబడి అమాంతం పెరిగిపోద్ది. క్యాటరింగ్ జేసే గ్రహాలన్నీ మీ సైడే కాబట్టి ఈ పాడు సమాజంలో మీరెక్కడ కూర్చున్నా సరే మీ ముక్కలు మీకు పడిపోతాయ్.. ఆఖరికి ఇంట్లో కూడా మీరంటే ఒణికిపోయి, లేచి నుంచుని చేతులు కట్టుకుంటారు.. ఇక అంతకంటే ఏం కావాలండీ బాబా ఈ పనసతొక్క జీవితానికి. పనిలోపనిగా సూర్యుడికి గనుక దణ్ణం పెట్టుకుంటే ట్రంపు గారు కూడా మీ అపాయింట్మెంటు కోసం వీసా తీసుకుని లైన్లో నుంచుంటాడు..
ట్యాగ్ లైన్: జీ హుజూర్.. మీ కన్యలు ఎంత చెప్తే అంత బాబయ్యా..
———————————————————————-
తులా రాశి:
భయంకరంగా సంపాయించేది 11, కష్టపడి తగలేసేది 5.
లవ్ ఐకాన్ ఇచ్చేది ఇద్దరు, లాఫ్ ఐకాన్తో ఎక్కిరించేది కూడా ఇద్దరు..
తులాగారికి ఈ ఏడాదంతా తులం బంగారం లెక్క ఉంటాది.. సుడి మీద వట్రసుడి తిరిగినట్టు ఎక్కడికెళ్తే అక్కడ దండేసి, కూల్డ్రింకు కాయ చేతిలో పెట్టి జేజేలు కొడతారు జనం.. ఆఫీసులోనేమో ప్రమోషన్ కావాలా లేక ట్రాన్స్ఫరా కావాలాని తెగ మొహమాటపెట్టేస్తారు..
ప్రింటింగ్ మెషీన్లు కొనుక్కుని ఇంట్లోనే నోట్లు అచ్చేస్కున్నా సరే, నిర్మలా సీతారామన్ గారు కూడా ఏమనరు.. సరదాగా ఎందులో పెట్టుబడులు పెట్టినా సరే తెగ లాభాలొచ్చేస్తాయ్ వీళ్ళ దుంపతెగాని.. పాతప్పులు తీర్చి పారేస్తారు, కొత్త అప్పులకి రెడీ అయిపోతారు.. అవసరమైతే రిజర్వ్ బ్యాంకుకే రుణాలిస్తామని జాలి చూపిస్తారు ఈ తక్కెడలు. లేదంటే మనమే ఓ కొత్త బ్యాంక్ పెట్టేస్తే ఎలాగుంటాదని కూడా అవిడియాలేస్తారు.. ఏదేమైనా లచ్చిందేవి ఈళ్ళ సైడే ఈసారి..
ట్యాగ్ లైన్: మీ అదృష్టం తుకానికెయ్యా.. పీలింగ్ జెలసీ యార్..
———————————————————————-
వృశ్చిక రాశి:
గుండాపిండీ ఐపోయిం కూడబెట్టేది 2, పక్కోడి జేబులోంచి కూడా తీసి ఖర్చుపెట్టేసేది 14..
అయ్యోపాపం అనేది ఐదుగురు, పోరా అని పేలేది ఇద్దరు.
అష్టమ గురుడి కారణంగా వృశ్చికంగారిని ఏడాది పొడుగునా రకరకాల ఒత్తిళ్లు, భయాందోళనలు బ్యాండ్ బాజా బరాత్ చేసొదుల్తాయ్.. ఇంటా బయటా అందరూ ఎక్కడబడితే అక్కడ ఏసుకోవడం ఆనవాయితీ.. ఆరోగ్యం దెబ్బేసే అవకాశాలు దండిగా ఉన్నాయ్ కనుక మందులు, సిగరెట్లు లాంటి పోషకాహారాలకి దూరంగా ఉండి, నర్సుల కంటే డాక్టర్లతో ఫ్రెండ్షిప్పులు చెయ్యడం కొంచెం మంచిది.. సంపాదన ఎంతొచ్చినా EMIలు కట్టడానికే సరిపోతాయి గనుక డబ్బుల్ని ఊరికే జల్లేసుకోకుండా ఒబ్బిడి చేసుకుంటే ఆ తర్వాత మీకే పనికొస్తాయ్.. దెబ్బలు తిన్నప్పుడల్లా దక్షిణామూర్తికి దణ్ణమెట్టండి.
ట్యాగ్ లైన్: ఎంత బాదినా బాదించుకునే మెత్తటి లేతకొండెలకు ప్రణామములు..
———————————————————————-
ధనస్సు రాశి:
సాధించేది 5, చిల్లపెంకుల్లా చల్లేసుకునేది 5.
వాటేసుకునేది ఒకరు, బూతులు తిట్టేది కూడా ఐదుగురు.
యూట్యూబ్ హెడ్డింగుల్లా టైటిల్కి, కంటెంటుకి సంబంధం లేకుండా మీరేసిన బాణాలు మీకే గుచ్చుకునే మాయదారి సంవత్సరం ఇది. శనిగారు డిప్ప మీద పీకి ఏడిపించేలోపు, గురువుగారొచ్చి బిర్యానీ తినిపిస్తారు.. యూట్యూబ్ లో చెప్పారని పెట్టుబడులు పెట్టొద్దు, ఇన్బాక్స్లో మెత్తగా గోకారని తెలినోళ్ళకి అప్పులివ్వొద్దు.. జీతం పడిందని మెసేజ్ చూసి ఆత్రంగా ఖాతాకెళ్ళి చూస్తే అక్కడ మాత్రం సున్నాయే ఉంటాది. కాబట్టి అయ్యేదాకా ఏదీ నమ్మొద్దు.. ఆరోగ్యాన్ని, ఇంట్లో సమస్యల్ని అస్సలే అశ్రద్ధ చెయ్యొద్దు. ఈసారి ఒత్తిళ్లు తిత్తి తీసేస్తాయ్. కిందవాళ్ళు కాలరెగరేస్తారు, వెనుకున్నవాళ్ళు వీపు గోకుతారు.. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాదంతా మనుషులతో కాకుండా చికాకులతో ఎక్కువగా కాపురం జేస్తారు.. మంచి జరగాలంటే శనిగారికి రోజూ దణ్ణం పెడుతూ, దక్షిణామూర్తిని పూజించాలి.
ట్యాగ్ లైన్: శ్రీముఖికి మేకప్పేసి శ్రీలలని నమ్మించే ఈ మోసకారి పెపంచకంతో చాలా జార్తగా ఉండాలమ్మా ధనం..
———————————————————————-
మకర రాశి:
గడించేది 8, గోదాట్లో కలిపేది 14,
చెయ్యూపేది నలుగురు, చెయ్యేత్తేది మాత్రం ఐదుగురు..
ఈ ఏడాదంతా రాహువుగారు రఫ్ఫాడించే అవకాశాలు దండిగా ఉన్నాయ్ గనుక ఎదుటివాళ్ళతో మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే టెంకిజెల్లలు తినేసే అవకాశాలు జల్లెడలో చిల్లుల్లాగా బోలెడన్నున్నాయ్.. పన్లోపని ఇంటిమీదకి రాయేసి గొడవలు తెచ్చుకునే కంత్రీ పనులకి కూడా దూరంగా ఉండాలి. పాతఅప్పులు ఓ కొలిక్కొస్తాయి.. సహజ చేతి దురదెక్కువ కొద్దీ ఖర్చులు అమాంతం పెరిగిపోయి కొత్త అప్పులు తగులుకోడానికి సిద్ధంగా ఉంటాయ్.. ఇయ్యన్నీ మనవల్ల కాదనుకుంటే దత్తాత్రేయుడ్ని, సుబ్రహ్మణ్యుడ్ని అప్పుడప్పుడూ పలకరించి మనఃశాంతి పొందాలి.
ట్యాగ్ లైన్: రాహుల్ గారితో రప్పా రప్పా
———————————————————————-
కుంభ రాశి:
కుండలో పడేది ఎనిమిది, కుండకి పడ్డ చిల్లులోంచి కారేది పధ్నాలుగు..
దండలేసి దణ్ణం పెట్టేది ఏడుగురు, బాటా చెప్పట్టుకుని పరుగెత్తించేది ఐదుగురు..
కుంభంగారికి గత రెండుమూడేళ్లతో పోల్చుకుంటే చాలా బెటరు. అయినాగానీ రాహుల్ గారి ప్రభావం వల్ల చేతులు, నోరు తీవ్రంగా దురద పెట్టే కారణంగా అద్దిరిపోయే ముహూర్తం పెట్టుకుని మరీ దెబ్బలాటలకి దిగే పౌరుష నామ సంవత్సరం అన్నమాట.. “వాణ్ని ఆపు వరదా..” అని బతిమాలేవాడు కూడా ఎవడూ మీ పక్క ఉండడు కాబట్టి మిమ్మల్ని మీరే పెద్దమనసు చేస్కుని ఆపుకోవాలి.. రాజకీయాలకి, రసాభాసలకి దూరంగా ఉంటూ ఎవర్నీ ఏమనకుండా, ఏమనిపించుకోకుండా తలొంచుకుని నెమ్మదిగా వెళ్ళిపోవడం మీకు మీరు జేసుకునే అతిగొప్ప మేలు. ఖర్చులెక్కువైపోవడం, సమయానికి లెక్క అందకపోవడంలాంటి బంపరాఫర్లు కూడా ఈ ఏడాది తగలబోతున్నాయ్.. మీకు అప్పిస్తామనే వెర్రినాగన్నలకి, మిమ్మల్ని అప్పడిగే మానవాతీత శక్తులకి ఇద్దరికీ దూరంగా ఉండండి.. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ పాటించకపోతే పెంకు పగిలే ప్రమాదం పొంచి ఉంది గనుక అప్పుడప్పుడూ శనికి, దక్షిణామూర్తికి దణ్ణం పెట్టి అన్నీ కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది.
ట్యాగ్ లైన్: థూ దీని మమ్మీ కుండజీవితమని..
———————————————————————-
మీన రాశి:
వలలో పడేది 5, వలలోంచి బయటికి పోయేది కూడా 5,
చప్పట్లు కొట్టేది ముగ్గురు, తపేలాలు విసిరేది ఒకరు.
మీనం వారు పండోరా గ్రహానికెళ్లినా సరే శనిగారు దండయాత్ర మానడు.. అయినాగానీ గత రెండేళ్లతో పోల్చుకుంటే బెమ్మాండంగా ఉంది. తెలియనివాటిలో వేలెట్టకండి, అడిగినోళ్లకి అప్పులు అస్సలు ఇవ్వకండి. ఆరోగ్య విషయాల్లో ఒళ్ళు దగ్గరెట్టుకుని, రక్తపోటు బిళ్ళలు, చక్కెర మందులు చేతిలో ఉంచుకోవాలి. ఖర్చులు తగ్గించేద్దామని మీరెంత పిసికేసుకున్నా సరే నయాపైసా కూడా నిలబడదు.. డబ్బులు దాచడం మొదలెట్టిన మర్నాడే పిల్లకాయలు మీతో మల్టీప్లెక్సులో పాప్కార్న్ కొనిపిస్తారు.. దారప్పోగు కొందామని దుకాణానికెళ్తే, చాకచక్యంగా సిల్కుగుడ్డలు అంటగడతారు.. ఇలాంటి జేబుగండాలు తప్పాలంటే శనిగారికి నమస్కారాలెట్టండి.
ట్యాగ్ లైన్: మీ మట్టగిడస కష్టాలకి ఏ పథకాలు ప్రకటించినా తక్కువే..
Share this Article