అంథాలజీ… సినిమా కథలకు సంబంధించి ఇదొక వెబ్ ట్రెండ్… నిజమే, అది థియేటర్ ట్రెండ్ కాదు… భిన్నమైన కథలను ఓ దారంతో కుచ్చి, హారంగా చేయడం… మంచి అభిరుచి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే..! అదీ సరిగ్గా కుదరాలి, ఓ పువ్వు చిన్నగా, వర్ణరహితంగా ఉంటే హారం సరిగ్గా కుదరదు… పైగా వేర్వేరు కథలను ఒకేచోట కలిపి కుట్టేయడం అంత వీజీ కూడా కాదు… అది అమరాలి…
పైగా కమర్షియల్ వాల్యూస్ లేకుండా… ఓ వర్తమాన సినిమా లక్షణాలు లేకుండా… రంగురుచివాసన లేకుండా…. ఎస్, రంగురుచివాసన లేకుండా అంటుంటే గుర్తొచ్చింది… ఇవ్వాళ విడుదలైన పంచతంత్రం అనే సినిమా కూడా అదే… అయిదు పంచేంద్రియాల కథ… రుచి, దృశ్యం, వాసన, స్పర్శ, వినికిడి… వాటి మీద అయిదు కథలు… పెద్ద టాస్కే… టేస్ట్ ఉండగానే సరిపోదు, సరైన కేస్టింగ్, మంచి నిర్మాత అవసరం… దర్శకుడు హర్ష పులిపాకకు పాక్షిక విజయమే అనిపిస్తుంది చూడబోతే…
శివాత్మిక, కలర్స్ స్వాతి, బ్రహ్మానందం అనేసరికి కాస్త ఇంట్రస్టు… మరీ బ్రహ్మానందం… కామెడీకి ఒక దశలో సూపర్, బంపర్ స్టార్… ఇప్పుడు ఎవరికీ అక్కర్లేకపోవచ్చు… ఒక దశలో బాలసుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాసరావు అనుభవించిన దశే… బ్రహ్మానందం ఒకప్పటి ఫామ్, ఫేమ్ ఇప్పుడు వెన్నెల కిషోర్ అనుభవిస్తున్నాడు… బ్రహ్మానందంతో పోలిస్తే కిషోర్ ఎంత అనడక్కండి… కొందరికి కొన్ని దశలు వెలిగిపోతయ్, అంతే… ఈరోజు బొచ్చెడు సినిమాలు విడుదలయ్యాయ్, కానీ ఈ సినిమా మాత్రమే విశ్లేషకుల ఆసక్తికీ కేంద్రమైంది… కారణం, ఆ ముగ్గురే…
Ads
నటుడు ఎంతటి ప్రతిభావంతుడైనా సరే… మంచి కథ పడాలి, మంచి పాత్ర దొరకాలి, అది ఎగ్జిక్యూషన్‌లో పండాలి… బ్రహ్మానందానికి ఇది పెద్దగా పేరు తెచ్చేదేమీ కాదు… కలర్స్ స్వాతి భిన్నంగా ఉంది… వాళ్లిద్దరినీ ఇలా చూడటం ఎందుకో బాలేదు… అంటే కనెక్ట్ కాలేదు అని అర్థం… శివాత్మిక సోసో… నిజానికి ఇవి వెబ్ సీరీస్‌కు బెటర్… థియేటర్ సరుకు కాదు ఇది… ఏవో నాలుగు డబ్బులు రాకపోవు అని రిలీజ్ చేసినట్టున్నారు…
మొదటి ఎపిసోడ్ చూపు, అనగా దృశ్యానికి సంబంధించింది… వేస్ట్… ఈ ఎపిసోడ్ మీద అసంతృప్తి మొదలై సినిమా మీద ఓ నెగెటివ్ ఇంప్రెషన్ స్టార్టవుతుంది… ఆ మూడ్ చివరి వరకూ కొనసాగి, చివరలో కాస్త బరువైన సీన్స్… అంతే… ఒక కథ, సంక్షిప్తంగా చూడటమే థియేటర్‌లో కష్టమైపోతోంది… మంచి బీజీఎం, పవర్ ఫుల్ పంచులు, పాటలు, వావ్ అనిపించే సీన్లు ఉంటేనే జనం అంతంతమాత్రంగా ఆదరిస్తున్నారు… ఇక అయిదు కథలున్న ఓ పుస్తకం వంటి సినిమా ఎవరిని ఆకర్షించాలి..? పాఠకుడు వేరు, ప్రేక్షకుడు వేరు…
రుచి, వాసన కథలు కాస్త నాసిరకంగానే అనిపిస్తాయి… స్పర్శ కథ జస్ట్, వోకే… వినికిడి కథ స్వాతికి మంచి పాత్రే అయినా, అంత పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది ఆమె… నిజానికి దర్శకుడిది మంచి అభిరుచి… కానీ తనకు ఆప్ట్ అయ్యే పోకడ కాదు ఇది… పైగా కథనం స్లో… చివరగా చిన్నమాట… కొన్ని పుస్తకాల్లో కథలుగా చదివితేనే ఆ ఫీల్ వస్తుంది… అవి సినిమాలుగా పనికిరావు… ఇదే సూత్రాన్ని పంచతంత్రం అనబడే సినిమాకు వర్తింపజేసుకున్నా పెద్ద తేడా ఏమీ రాదు… తప్పు, అబద్ధం కూడా కావు…!!
Share this Article