Gopalakrishna Cheraku…. ఇగో – మనషిని రాక్షసుడిగా మార్చే సాధనం! మొన్నామధ్య ఓ చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా హారన్ కొట్టాడంటూ ఇగో హర్ట్ అయిన ఓ ఇద్దరు అర్ధగంట పాటు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు.. చివరికి అక్కడున్న జనాలు విసుక్కోవడంతో బలవంతగా ఎవరి వాహనాలు వారు ఎక్కి వెళ్ళిపోయారు.. ఆ ఇద్దరికి ఇగో హర్ట్ అవడం వల్ల అర్దగంటపాటు రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ,జనం ఇబ్బంది., చివరికి వారికి కూడా మెంటల్ డిస్ట్రబెన్స్ , టైమ్ వేస్ట్.. మళ్లీ ఆ ఇద్దరు ఎక్కడైనా కనీసం ఎదురెదురుపడతారో లేదో కూడా అనుమానమే.. కాని హారన్ కొట్టడం వారిద్దరిని కొట్టుకునేలా చేసింది వారి ఇగో..
ఆ ఇద్దరిలో ఒకరు రియల్టర్ మరొకరు ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరూ చదువుకున్నవారే , డీసెంట్ గా బతికేవారే.. కానీ అక్కడిక్కడ హారన్ వల్ల హార్ట్ అయిన ఇగో వారిద్దరిని స్ట్రీట్ ఫైటర్లని చేసింది..
అచ్చం ఇలానే … ఓ స్కూటీ పట్టుకుని రోడ్డుమీద వెళ్తూ పక్కనే స్పీడ్ గా వెళ్తున్న మరొకరిని చూసి ఇగో హర్ట్ చేసుకునేవారు కోకొల్లలు..ఇక ఈ బర్త్ డే కో , లేక ఇంకేదైనా స్పెషల్ డే రోజున మనల్ని విష్ చేయకపోతేనో , లేక మన ఫోటో స్టేటస్ పెట్టలేదనో ఇగో హర్ట్ చేసుకునేవారు మరికొందరు.. అంతెందుకు మాట్లాడేటప్పుడు మనకంటే ముందు మాట్లాడినా తట్టుకోలేని వారూ చాలా మందే ఉంటారు.. ఇలా ఉద్యోగాలు చేసే దగ్గర, కూరగాయలు కొనే దగ్గర , వాకింగ్ చేసే దగ్గర … భోజనాల దగ్గర…స్నేహితుల దగ్గర..ఇలా ఉదయం లేస్తే ఇగో హర్ట్ లు రోజుకి వందల సంఖ్యలో చేసుకునే వారు కూడా ఉంటారు.. కొంతమంది ఆ ఫ్రస్టేషన్ బయటకి చూపిస్తారు .. మరికొందరు నిత్యాగ్నిహోత్రంలా తమలో తామే మండిపోతుంటారు…
Ads
ఇలాంటివి చూసినప్పుడు అదేదో సినిమాలో బ్రహ్మానందం నేను హర్టయ్యాను అనే క్యారెక్టర్ లు మనకి మదిలో మెదులుతాయి. అయితే ఆ ఇగో ముదిరి మనకి తెలియకుండానే మన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తుందో చెప్పే ప్రయత్నంలో వచ్చింది పార్కింగ్ అనే సినిమా… 28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ యువకుడికి 60 ఏళ్లకి దగ్గర బడుతూ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి మధ్య కేవలం ఒక కారు , దాని పార్కింగ్ కోసం పుట్టుకొచ్చిన అహం వారిద్దరినీ ఎక్కడిదాకా తీసుకెళ్తుంది అనేదే సినిమా.. కానీ ఆ ఇగో ప్రయాణం తీవ్రత ఎలా పెరిగి ఎక్కడికి దారి తీస్తుంది అనే అంశాన్ని చక్కగా చూపించారు డైరెక్టర్.. ఇగో శాటిస్‌ఫై్ చేసుకునేందుకు ఇంట్లో ఆడవాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించడం లాంటి సీన్లు.. మనిషి మృగంలా మారిపోయేందుకు పెద్దగా కారణాలు అవసరం లేదని నిరూపిస్తాయి..
ఇక ఇగో హర్ట్ అయ్యేందుకు వయసుతో సంబంధం లేదు.. ఏ వయసువారైనా అహం వెంట పరుగిడితే తమ కుటుంబసభ్యులను కూడా సరిగా పట్టించుకోలేరు అనేది ఇందులో గర్భవతి క్యారెక్టర్ పడే మానసిక వేదన చూస్తే అర్థం అవుతుంది.. అలా ఒ ఇంట్లో అద్దెకి ఉంటున్న ఇద్దరు వేరు వేరు వయసు వ్యక్తుల ఇగో ఫైటింగ్ పెరిగి పెరిగి ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్తాయి.. చివరికి వారిద్దరూ మనుషులుగా మారాడానికి మానవత్వమే కారణంగా చూపాడు డైరెక్టర్..
నాకు ఇగో ఉండదు అంటూ ఎవరైనా చెబితే ఆ నటసార్వబౌముడు బయటికి కనపడడు అని మాత్రమే అనుకోవాల్సిన రోజులివి.. సో, ఈ సినిమా చూస్తునంత సేపు మనలో మనం చూసుకోవడం .. మన జీవితంలో తారసపడిన క్యారెక్టర్లని గుర్తు చేసుకోవడం మాత్రం పక్కా..!…. గోపాలకృష్ణ చెరుకు ..
Share this Article