.
( ..అశోక్ వేములపల్లి.. )
పెరోల్… the temporary or permanent release of a prisoner before the expiry of a sentence, on the promise of good behaviour…
పెరోల్.. అంటే శిక్ష పడిన ఖైదీకి కొంతకాలం పాటు ఇంటికి వెళ్లే అవకాశం ఇవ్వడం.. అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా అత్యవసరం అయిన సందర్భాల్లో కొద్దిరోజుల పాటు పెరోల్ కింద అవకాశం ఇస్తారు..
Ads
ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అదే.. చేసిన తప్పుకి జీవితమంతా జైల్లో గడిపే.. జైలు పక్షులు కుటుంబ సభ్యుల్ని చూడాలని పడే తపన, పడే వేదన ఇక్కడ కనిపిస్తాయి.. సహజంగా మలయాళ సినిమాలో కనిపించే పచ్చదనం, పచ్చిదనం ఉంటాయి..
పెళ్లి చేసుకుని వెళ్లి పోయాక తోడబుట్టిన చెల్లెలు, లేదా అక్క గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది.. ఈ కమర్షియల్ బంధాల కాలంలో అన్నాచెల్లెళ్ళ అనుబంధాలు టీవీ సీరియళ్లలో చూడటం తప్ప నిజజీవితంలో తక్కువే..
కానీ ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ళ అనుబంధం, తండ్రీ కొడుకు బాంధవ్యం, భార్యా భర్తల అన్యోన్య సంబంధం, అయిన వారి కోసం త్యాగం, స్నేహితుడికి తోడుగా నిలిచే స్నేహబంధం, కమ్యూనిస్టు భావజాలం, క్రిస్టియానిజం అన్నీ కనిపిస్తాయి..
సూపర్ స్టార్ మమ్ముట్టి నటనకు వంకేముంటుంది.. కానీ పెరోల్ సినిమా కాన్సెప్ట్ ఆయన నటనకు మరింత హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది.. చెల్లెలుగా మియా, భార్యగా ఇనియా ఇలా ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు.. డైరెక్టర్ శరత్ సందిత్ అద్భుతంగా చేశారు.. ఎక్కడా లాజిక్ మిస్ అవరు. ఏం కల్పితం అనిపించదు.. ఎక్కడా ఓవర్ యాక్షన్ కనిపించదు..
నిజానికి సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఎక్కడ బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లే ఉంటుంది.. సినిమాలో ఎక్కడా పెద్దగా నవ్వించలేకపోవచ్చు గానీ.. విసుగు పుట్టించడు.. కొన్నిసార్లు మమ్ముట్టిని చూసినప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా.. కాన్ఫిడెన్స్ తో ఎలా ఉండాలో తెలుస్తుంది.
ఇక కథలోకి వెళ్తే.. భార్యని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్షపడిన ఖైదీ అలెక్స్ మేస్ట్రీ ఫిలిప్స్.. భార్యని ఎందుకు చంపాడు.. ఎందుకు చంపాల్సి వచ్చింది.. అసలు చంపాడా లేదా అనేది సినిమా చూస్తేనే బావుంటుంది. ఇదేమీ క్రైమ్ థ్రిల్లరేమీ కాదు.. ఎనిమిదేళ్ల జైలు శిక్ష తర్వాత కొద్దిరోజుల పాటు పెరోల్ లభిస్తుంది..
జైల్లో తన మంచితనంతో తోటి ఖైదీలు, జైలు అధికారుల మనసు గెలుచుకున్న అలెక్స్ ని సంతోషంగా బయటకు సాగనంపుతారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం చూసిన తన కొడుకుని చూడాలన్న ఆశతో జైల్లోంచి బయట కాలు పెట్టెలోపు..పెరోల్ క్యాన్సిల్ అవుతుంది.. కారణం ఆయన బయటకు వస్తే.. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కన్న కొడుకే అభ్యంతరం చెప్పడం వల్ల… ఇదీ సినిమాలో ఒక ట్విస్ట్..
కొడుకు ఎందుకు అభ్యంతరం చెప్పాడనేది సినిమాలో చూస్తే బావుంటుంది.. నిజ జీవితంలో కూడా ఖైదీకి పెరోల్ లభించినపుడు… ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ లెటర్ ఇస్తే పెరోల్ రద్దు చేస్తారట..
తన తోడబుట్టిన చెల్లెలు చనిపోయినప్పుడు రెండోసారి మళ్లీ పెరోల్ కోసం అప్లై చేసుకుంటాడు. ఈసారి పెరోల్ కు అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకు కన్నకొడుకు, అతని స్నేహితుడి దగ్గర పాతిక వేల లంచం తీసుకుంటాడు..
నిజానికి ఒకప్పుడు ఆ కొడుకు చెప్పిన సాక్ష్యం వల్లే అతను నేరస్తుడిగా ముద్రపడి జైలుకు వస్తాడు.. పదిహేనురోజుల పెరోల్ కాలంలో మళ్లీ ఏ చిన్న తప్పు చేసినా పెరోల్ రద్దు అవుతుందని వార్నింగ్ ఇస్తారు.. కన్న కొడుకుని కలవాలని, అసలు నిజం చెప్పాలని తహతహలాడిన ఆ తండ్రి కొడుకు చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని క్రిమినల్స్ తో కలిసి గంజాయి అమ్ముతున్నాడని తెలిసి బాధ పడతాడు.. కొడుకుని కలిసే క్రమంలో కొడుకు చేసిన ఒక హత్య కేసుని తన భుజాన వేసుకుని మళ్లీ జైలుకు వెళ్లయిపోవడంతో సినిమా ముగుస్తుంది..
ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో చెల్లెలు, ఆమె భర్త వల్ల వచ్చిన సమస్యల వల్ల అతను నేరస్తుడు కావాల్సి వస్తుంది.. చెల్లెలు మీద ప్రేమ ఉండొచ్చు. తప్పులేదు కానీ మరీ భార్యాపిల్లలకు అన్యాయం చేసేంత కాదు. అనే పాయింట్ ని భార్య చేత పలికిస్తాడు డైరెక్టర్..
ఇక చెల్లెలు అంటే పెళ్లి చేసుకుని వెళ్లిపోగానే వదిలేయడం కాదు.. జీవితమంతా గుండెల్లో పెట్టుకోవాలి.. ఆమెకి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పాలి.. కానీ చెల్లెలి జీవితం తన జీవితం నాశనం అయ్యే దశకు చేరుస్తుంది..
ఇక సినిమాలో కమ్యూనిస్టు భావజాలాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు.. నిజానికి ఎర్రజెండాకి, ఇంకిలాబ్ జిందాబాద్ కి సినిమా కథకి పెద్దగా సంబంధం ఉండదు.. అయినా సినిమాలో హీరో తండ్రి పాత్రని పరిచయం చేసే క్రమంలో ఎర్రజెండాలు కనిపిస్తాయి.. పెరోల్ వేరు బెయిల్ వేరు.. కానీ పెరోల్ అనే ఒక అంశంతో కుటుంబ సంబంధాలతో సినిమా చాలా బాగా తీశారు…
Share this Article