కనుమరుగైన ‘సత్యం’…. “రేయ్.. శంకరాభరణం తీసిన ప్రొడ్యూసరే సాగర సంగమం అనే మరో సినిమా తీస్తున్నాడు. దీనికి కూడా స్టిల్స్ నేనే. మరో ఇరవై రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరిద్దరూ మద్రాసు వచ్చెయ్యండి, ఓ పది రోజులు ఉండి వెళుదురుగాని”
1982 జూన్ నెలలో సత్యం నాకు రాసిన ఉత్తరం సారాంశం. అప్పటికి మా పెళ్ళయి రెండేళ్ళు అయింది, మేమిద్దరమూ కలసి చెప్పుకోదగ్గ దూరప్రయాణం చేయలేదు. వెంటనే మద్రాసు వెళ్ళాము. కామరాజుగడ్డ సత్యనారాయణ.. చిన్ననాటి మిత్రులందరికీ సత్యం. సినిమా ఇండస్ట్రి లో స్టిల్స్ సత్యం లేదా స్టిల్స్ సత్యనారాయణ.
@@@
Ads
మా ఇద్దరికీ ఎప్పుడు స్నేహం కుదిరిందో నాకు అసలు జ్ఞాపకం లేదు. ఒకే ఊరు.. మంగళగిరి. ఇద్దరి ఇళ్లకు మధ్య దూరం ఓ ఫర్లాంగు ఉంటుంది. ఒకే వీధి బడి. పూర్తిగా తెల్లవారకముందే మా దినచర్య మొదలయ్యేది. ఎర్ర చెరువు, నల్ల చెరువు ప్రాంతానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు దూరంగా పడమటి వైపు కనిపించే బెజవాడ – గుంటూరు రైల్ పట్టాల వరకు సాగేది మా నడక.
బళ్ళో, వీధిలో, ఊరు మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి మిద్దె వద్ద, పానకాల స్వామి గుడి మెట్ల మీద, గాలిగోపురం దగ్గర, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణలో దేవ గన్నేరు చెట్ల కొమ్మలపైనా ఆటలు, పెద వడ్లపూడి చెరువులో కోసుకొచ్చిన కలువ పూలు, మామిడి తోటల్లో ఆడుకున్న మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
పండుగ రోజుల్లో మంగళగిరి గిరిశిఖరం పై ఉన్న గండాలయ దీపం వద్దకు కష్టపడుతూ ఎక్కడం, హేమంత ఋతు చిరు చలిలో కొండ ఏటవాలులో పుల్ల రేగుపళ్లు కోసుకుని నిక్కరు జేబులనిండా నింపుకోవడం, దసరా, సంక్రాంతి పండుగ తర్వాతి రోజు “పారువేట” పేరుతో జరిగే గిరిప్రదక్షిణ చేయడం, ఆ దారిలో పెట్రో మాక్స్ లైట్ల వెలుతురులో నులక మంచాలపై పెట్టి అమ్మే బెల్లపు మిఠాయిలు కొనుక్కొని తినడం, అంత చిన్న వయసులోనే ఇతర మిత్రులతో కలసి, పెద్దల సహకారంతో నాటకాలు వేయడం, మరచిపోలేని జ్ఞాపకాలు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే మా దినచర్య- సాయంత్రం కనీసం ఓ రెండు గంటలు లైబ్రరీ లో గడపడం. దినపత్రికలు, పుస్తకాలు చదవడం, రేడియో వినడం.
మా ఇద్దరినీ విడి విడిగా చూసిన సందర్భాలు అరుదు.
ఒకరకంగా చెప్పాలంటే మా ఇంట్లో మా అమ్మా నాన్నల దగ్గర నాకంటే వాడికే చనువు ఎక్కువ. మంచి మాటకారి. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూ ఉండేవాడు.
@@@
టీనేజి లోకి వచ్చిన ఒకటి రెండేళ్లకే మా దారులు వేరయ్యాయి. నా గమ్యం హైదరాబాదు వైపు సాగగా. సత్యానిది మద్రాసు వైపు మళ్ళింది.
జీవన సమరం ప్రారంభమయ్యింది అప్పుడే.
వాడు మద్రాసులో ఎవరెవరి దగ్గరో స్టిల్స్ సహాయకుడుగా పనీచేశాడు. దానికి బీజం మంగళగిరి గాలిగోపురం పక్కనే ఉన్న రవీంద్ర స్టూడియోలో ఫోటోలు తీసిన అనుభవం పనికివచ్చింది. 1975 ప్రాంతాల్లో అనుకుంటాను మాంగల్యభాగ్యం అనే ఒక సినిమాకు మొట్ట మొదటిగా, స్వతంత్రం గా స్టిల్స్ తీశాడు. అప్పటి నుండి స్టిల్స్ సత్యం లేదా సత్యనారాయణ అయ్యాడు. ఆ తరువాత చలం హీరోగా నటించిన తోటరాముడు సినిమాకి స్టిల్స్ తీసిన తరువాత ఆ సినిమా విజయవంతం కావడంతో ఇండస్ట్రి లో నిలదొక్కుకోగలిగాడు.
అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
జంధ్యాల, కోదండరామిరెడ్డి, దాసరి నారాయణరావు, కే. విశ్వనాథ్, బాపు, వంశీ ఇలా అగ్ర దర్శకుల సినిమాలకు స్టిల్స్ తీసే అవకాశం వచ్చింది. అదే విధంగా ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి, కమలహాసన్ లాంటి పెద్ద హీరో ల సినిమాలకు స్టిల్స్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. వందకు పైగా సినిమాలు చేసి ఉంటాడని అనుకుంటున్నాను.
@@@
ఆ రోజుల్లో హైదరాబాదు లో షూటింగ్ ఉంటే… ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ స్టూడియో లో, ఏ హోటల్ లో ఉంటాడో ఆ వివరాలతో వాడు ముందుగా ఓ ఉత్తరం రాసేవాడు. అప్పటికే నేను హెచ్. ఎం. టీ లో ఉద్యోగం చేస్తున్నా, ఆ యా రోజుల్లో డ్యూటి తరువాత సరాసరి అక్కడికే వెళ్ళి వాడితోనే ఉండేవాడిని. షూటింగ్ గ్యాప్ లో కబుర్లు చెప్పుకునే వాళ్ళం.
1982 లో మేము మద్రాసు వెళ్ళి ఆ పదిరోజులూ అన్నీ ప్రాంతాలు తిప్పి చూపించాడు. సినిమా ప్రారంభోత్సవాలు, ప్రివ్యూ లకు తీసుకువెళ్లాడు. మేము మరచిపోలేని చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు అనామకులుగా ఉండి ప్రస్తుతం ప్రముఖులైన చాలా మంది నటులు, దర్శకులు సత్యం వద్ద కలుసుకుని గంటలు గంటలు మాట్లాడుకునేవారు. ఆ తరువాత చానాళ్లకు అంటే 1990-91 లో సత్యం కుటుంబం హైదరాబాదు చూడడానికి వచ్చారు. హైదరాబాదు లోని ప్రముఖ ప్రదేశాలన్నీ తిరిగి చూశారు.
@@@
రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు.
తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదుకు తరలి వచ్చింది.
నటులు, టెక్నిషియన్లు మనుగడ కోసం హైదరాబాదు బాట పట్టారు. సత్యం కూడా కుటుంబంతో హైదరాబాదు లో స్థిర పడ్డాడు. అంతా బాగానే జరిగి పోతోంది. అయితే….
ఇరవైవ శతాబ్దం ముగియబోయే ముందు సత్యం జీవితం ఒడిదుడుకుల్లో పడింది. దానికి బీజం.. ఒకరోజు రాత్రి బాగా పోద్దు పోయిన తరువాత స్కూటర్ పై ఇంటికి వస్తూ ఓ మలుపులో కరెంట్ స్తంభానికి గుద్దుకుని పడిపోయాడు. తలకు దెబ్బ తగిలింది. ఆరు నెలల పాటు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఎవర్నీ గుర్తుపట్టేవాడు కాదు. నాతో మాట్లాడేవాడు కానీ, ఏ మాటకు పొంతన ఉండేది కాదు.
ఆ సంఘటన వాడి వ్యక్తిగత, వృత్తి గత జీవితానికి పెద్ద గొడ్డలి పెట్టు అయింది.
ఆ తరువాత వాడు కేవలం సత్యంగానే మిగిలిపోయాడు.
@@@
చికిత్స ముగిసి మామూలు మనిషి అయ్యాడు. అవకాశాలు లేక సినిమా జీవితం పూర్తిగా ముగిసి పోయింది. భార్యా పిల్లలూ (ముగ్గురు అమ్మాయిలు) దూరంగా విడిగా ఉన్నారు చదువుల కోసం. సత్యాన్ని కొన్నాళ్ళు మంగళగిరి – గుంటూరు మధ్య ఉన్న చేబ్రోలు హనుమయ్య వృద్ధాశ్రయంలో ఉంచారు. నేను ఎప్పుడు మంగళగిరి వెళ్ళినా వీలు చూసుకుని వృద్ధాశ్రమనికి వెళ్ళి కొద్ది సేపు వాడితో మాట్లాడేవాడిని. అన్నీ విధాలా సాధారణ స్థితికి చేరుకున్నాడు. పూర్తి విశ్రాంతి జీవితం. ఇప్పుడు హాయిగా ఉందిరా అనేవాడు.
మళ్ళీ విధి చిన్న చూపు చూసింది. తనకు షుగర్ వ్యాధి ఉందని అనుమానం రాలేదో ఏమో .. ఒకరోజు వృద్ధాశ్రమంలో తోటపని చేస్తుంటే కాలికి ఏదో గుచ్చుకుని గాయం అయింది. అశ్రద్ధ వల్లనో, అవగాహన లేకనో వాడు దాన్ని సరిగా పట్టించుకోలేదు. ఆ గాయం గ్యాంగ్రైన్ గా మారి ప్రమాదకరంగా మారడంతో ఎడమ కాలు మోకాలు వరకు తీసేయ వలసి వచ్చింది.
ఒకరోజు సత్యం తమ్ముడు రాజేంద్రప్రసాద్ నాకు ఫోన్ చేసి విషయం చెప్పి అన్నయ్య మిమ్ములను చూడాలంటున్నాడు ఒకసారి రాగలరా అన్నాడు. నేను హుటాహుటిన వెళ్ళి మంగళగిరి ఎన్నారై హాస్పిటల్ లో ఉన్న సత్యాన్ని పరామర్శించాను. ఒక కాలు లేని వాడికి ధైర్యం నూరి పోయడానికి ఏదేదో చెప్పినా నేను గంపెడంత బాధని గుండెల్లో పెట్టుకుని హైదరాబాదు వెళ్లిపోయాను.
@@@
అవిటితనంతో ఉన్న వాళ్ళను మా నియమాల ప్రకారం ఆశ్రమంలో ఉంచుకోలేమని వృద్ధాశ్రమం వారు చెప్పడంతో, విడిగా ఒక ఇంట్లో ఉంచి రోజూ వంటచేసి పెట్టే ఏర్పాట్లు చేసినా అది కూడా మున్నాళ్ళ ముచ్చటే అయింది. హైదరాబాదు ఏ. ఎస్. రావు నగర్ ప్రాంతంలో సాయినాథపురంలో ఉన్న ఒక ప్రైవేటు వృద్ధాశ్రమంలో 2018 చివరలో చేర్పించారు. ఈ వృద్ధాశ్రమం మాఇంటికి రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో నేను ప్రతిరోజు వాడి దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి వచ్చేవాడిని. ఎడమ కాలు మోకాలు వరకు లేక పోయినా కృత్రిమ కాలుతో సాధారణంగా గడిపేవాడు. రోజు వాకింగ్ కు కూడా వెళ్ళి వచ్చేవాడు.
2020 – కరోనా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రపంచమంతా భయం గుప్పిట్లో బిగుసుకుపోయిన తరుణంలో, వృద్ధుల క్షేమం కోరి ఆశ్రమాన్ని మూసేస్తున్నామని, మరో మార్గం చూసుకోమని యాజమాన్యం చెప్పడంతో సత్యాన్ని కూకటపల్లిలో మరో వృద్ధాశ్రమానికి తరలించారు. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటం తప్పించి నేను సత్యాన్ని మళ్ళీ చూడలేదు. ఆ మధ్య రాజేంద్రప్రసాద్ ఫోన్ లో మాట్లాడుతూ సత్యానికి స్వల్ప స్థాయిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెప్పాడు.
2023 ఫిబ్రవరి 8 న హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీ ఆవల ఉన్న ఏదో ఒక వృద్ధాశ్రమంలో సత్యం మరణించాడని తెలిసింది. మరణించిన తరువాత ఐదు రోజులకు ఆ వార్త తెలిసిన మరుక్షణం నాలో ఏ భావము కలగలేదు. విచిత్రంగా బాధ కూడా అనిపించలేదు. విమానాల్లో తిరిగి, స్టార్ హోటల్లలో గడిపిన జీవితం సత్యానిది. వృత్తి సినిమాల్లో పనిచేయడం అయినా .. వాడి జీవితమే సినిమా కథ అయింది అనిపించింది నాకు.
ఆస్తులు మాత్రం తీసుకుని.. ఆప్యాయతలను పంచడం మరచిన మనుషుల ద్వారా నిద్రను కోల్పోయి గుండెల్లో బాధను ఇముడ్చుకుని వేదన చెందే సత్యానికి ఇపుడు అసలు సిసలైన ప్రశాంతమైన స్థితి లభించిందనిపించింది. శారీరక, మానసిక బాధలు లేని ఒక అలౌకికమైన లోకానికి పయనమై వెళ్లాడనిపించింది. ఈ దుర్మార్గపు లోకాన్ని చీదరించుకుని దూరంగా వెళ్లిపోయాడనిపించింది.
ఒక జీవిత సారాన్ని, వేదనాభరిత మౌనాన్ని మన ముందు పరచి వెళ్లిపోయాడనిపించింది. డెబ్బైఏళ్ల బ్రతుకు కోణాలను మనకు గురిపెట్టి ఒక సత్యం మసక బారింది. అనేక ప్రశ్నలను మనకు సంధించి ఓ సత్యం కనుమరుగయింది. విశ్రాంతి తీసుకో మిత్రమా! విశ్రాంతి తీసుకో… బాల్య మిత్రుడిగా ఇది నా నివాళి. నాకు ఎందుకో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఈ పద్యం పదే పదే గుర్తుకు వస్తోంది.
‘స్థిరములు”కావు కావు” చలజీవితముల్; సిరిసంపదల్; సుఖం
కరములు “కావు కావు”; పలుగద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా
కరములు ‘కావు కావు’; నవకమ్ములు నిత్యము ‘కావుకా’ వటం
చరచుచు నుండె కాకి; కను మల్లదిగో బహరాము గోరిపై.’
— తుమ్మా బాలగంగాధరరావు…
Share this Article