Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యజమాని తన్ని తరిమేస్తే… సొంతూరు చేరడానికి 1000 కిలోమీటర్ల నడక…

April 22, 2023 by M S R

Pathetic Path:

”ఒక రాజును గెలిపించుట‌లో
ఒరిగిన న‌ర కంఠాలెన్నో?
శ్ర‌మ‌జీవుల ప‌చ్చి నెత్తురులు
తాగని ధ‌న‌వంతులెంద‌రో?”

అన్నార్థులు  అనాథ‌లుండ‌ని
ఆ న‌వ‌యుగ‌ మ‌దెంత దూర‌మో?
క‌రువంటూ కాట‌క‌మంటూ క‌నిపించ‌ని కాలాలెపుడో?

Ads

అణ‌గారిన అగ్ని ప‌ర్వ‌తం క‌ని పెంచిన ‘లావా’ ఎంతో?
ఆక‌లితో చ‌చ్చే పేద‌ల‌ శోకంలో కోపం యెంతో?”

తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి ఆ చల్లని సముద్రగర్భం గేయ కవితలో కొంత భాగమిది. బహుశా డెబ్బయ్ ఏళ్ల కిందటి రచన. ఎన్ని యుగాలకయినా కాలదోషం పట్టని రచన ఇది. ఇందులో దాశరథి చెప్పినట్లే…శ్రమ జీవుల పచ్చి నెత్తురు తాగాడు ఒక బెంగళూరు ధనవంతుడు.

అన్నార్థులు, అనాథలుండని ఆ నవయుగం ఎప్పటికీ రాదేమో! అని నిరాశ, నిస్పృహలు కలిగించే హృదయ విదారకమయిన కథనమిది. కరువులు, కాటకాలు, వలసలు లేని కాలాలు కలలో కూడా సాధ్యం కాదేమో! అని వైరాగ్యం కలిగించే దయనీయ గాథ ఇది.

ఆకలితో చచ్చే పేదల కోసం ఏడ్చే కన్నీళ్లు కూడా ఉండని బండబారిన గుండెల మధ్య మన గుండె కూడా ఏనాడో కొయ్యబారి పోయిందేమో! అని అనిపించే విషాదమిది.

లేకపోతే… ఎక్కడి ఒరిస్సా? ఎక్కడి బెంగళూరు? రాత్రీ పగలు పని చేయించుకున్న బెంగళూరు కామందు ఒక్క పైసా జీతం ఇవ్వక పోగా…రక్తం కారేలా కొట్టాడు. చివరికి… జీతం ఇవ్వకుంటే పని చేయలేము అన్నందుకు… చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా… పనిలోంచి గెంటేశాడు.

రోడ్డున పడ్డ ముగ్గురు ఒరిస్సా వలస కూలీలు. నిలువ నీడ లేదు. నోటికి ముద్ద లేదు. ముగ్గురు ఆరు కాళ్లనే నమ్ముకుని…తమ ఊరికి నడవడం మొదలు పెట్టారు. దూరం వెయ్యి కిలో మీటర్లు. నడుస్తూనే ఉన్నారు. దారిలో దయదలిచిన వారు పెడితే తిన్నారు. రాత్రిళ్లు రోడ్ల పక్కనే పడుకున్నారు. కొన్ని చోట్ల వీరి దుస్థితికి చలించిన లారీ డ్రయివర్లు కొంత దూరం ఎక్కించుకున్నారు. మొత్తం మీద వారం తరువాత ఊరు చేరారు. కాళ్లు పుళ్లు పడ్డాయి. నీరసించి… అనారోగ్యం పాలయ్యారు. నెమ్మదిగా కోలుకుని… వారి కాళ్ల మీద వారు నిలబడాలని కోరుకుందాం.

అన్నట్లు-
పేపర్ తిరగేస్తే… రేడియో, టీ వీ ఆన్ చేస్తే…
జాతీయ ఉపాధి హామీ, అందరికీ పని, రోజ్ గార్ యోజన, అందరికీ అన్నం, అందరికీ చదువు… లాంటి దేశ పౌరుల్లో నిరుపేదలు అందరికీ అన్నీ ఉచితంగా ఇంటి దగ్గరే అందుతుంటాయి.

ఈ ముగ్గురిది ఏ దేశమో?
వారు నడిచిన వెయ్యి కిలో మీటర్లను అడగండి.

ఇలాంటి వేన వేల కిలో మీటర్లు నడుస్తున్న వారు ఎందరో?
కనీస వేతన చట్టాలను అడగండి.

వీరు సాటి మనుషులేనన్న సత్యం మరచిన మనం కనీసం సిగ్గుతో తల అయినా దించుకోకపోతే…
మనసున్న మనుషులన్న పేరు పెట్టుకునే అర్హత కోల్పోతాం.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
  • ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!
  • ‘‘నేనెందుకు అర్చకవృత్తి చేపట్టానంటే…’’ చిలుకూరు రంగరాజన్ కథ…
  • చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…
  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions