.
కొన్ని జీవితాలు… అవీ సినిమా జీవితాలు… సినిమా కథలను మించి ఉంటాయి… విషాదమే కాదు, విచిత్రంగా ముగుస్తుంటాయి… కులశేఖర్ జీవితం ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ…
ఓ వ్యక్తి ఒంటరిగా అమీర్‌పేటలో దారెంట నడుస్తూ పోతుంటాడు… హఠాత్తుగా కుప్పకూలిపోతాడు… స్థానికులు ఎవరో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే, పోలీసులు వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసుకుని, గాంధీ హాస్పిటల్‌లో చేర్పిస్తారు…
Ads
అక్కడా పేరు లేని రోగిగా నమోదు… ఎవరు పట్టించుకుంటారు..? అదే రాత్రి మరణిస్తాడు… అనామకుడిగానే మార్చురీకి తరలించే సమయంలో అనుకోకుండా ఓ నర్సు తనను గుర్తుపడుతుంది… ఓ పాటల రచయిత కన్నుమూశాడనే వార్త లోకానికి తెలుస్తుంది…
లేకపోతే..? ఆ నర్సు గుర్తుపట్టకపోతే… నిజానికి తనున్న స్థితిలో పరిచయస్తులే తనను గుర్తుపట్టలేని దుస్థితి… చాన్నాళ్లుగా అసలు ఆయన తెర మీదే లేడు… ప్రజెంట్ తరానికి తెలియడు… ఐనా ఆమె గుర్తుపట్టడం విశేషమే… ఆమే గుర్తించకపోతే ఆ కులశేఖరుడు ఓ అనామక శవంగా కాల్చివేయబడేవాడేమో…!!
ఇదీ కాస్త బాధనిపించింది… మంచి ప్రతిభ ఉన్న రచయిత… ఒకప్పుడు వెలిగినవాడే… సింహాచలంలో తనది పెద్ద, సాహిత్య కుటుంబం… తండ్రి పేరున్న సంస్కృత పండితుడు… మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది… హైదరాబాద్ వచ్చి కులశేఖరుడు ఒకవైపు టీవీ జర్నలిస్టుగా చేస్తూనే సిరివెన్నెల దగ్గర శిష్యరికం చేశాడు…
ఆర్పీ పట్నాయక్‌తో పరిచయం, తద్వారా తేజకు పరిచయం… పాటల రచయితగా అవకాశం… అప్పట్లో వీళ్లది సూపర్ హిట్ కాంబినేషన్… తరువాత ఇతర సినిమాలకూ రాశాడు… అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి… భార్య, ఇద్దరు పిల్లలు… జీవితం ఇలాగే సాఫీగా సాగితే కథేముంది..?
విధి వక్రించింది… ఏదో సినిమాకు దర్శకత్వం వహించాడు కూడా… తరువాత హఠాత్తుగా మానసికంగా దెబ్బతిన్నాడు… ఏదో అంతుపట్టని మానసిక వైకల్యం… కుటుంబానికి దూరంగా… ఏం చేసేవాడో ఎవరికీ తెలియదు… అనుకోకుండా ఏదో గుళ్లో శఠగోపం దొంగిలించినట్టు ఆరోపణ… అరెస్టు…
అసలు శఠగోపం దొంగిలించడం ఏమిటి తను..? తర్వాత ఇంకేదో గుడిలో బ్యాగ్ చోరీ కేసు ఏమిటి..? తన కథలోనే ఏదో తేడా ఉంది… కొన్నాళ్లపాటు కోమాలో ఉండిపోయాడుట… తరువాత స్వస్థుడయ్యాడు గానీ పాత కులశేఖరుడు కాలేకపోయాడు… చివరకు ఇదుగో అయోగ్యుడై, అర్థరహిత జీవుడై… చివరకు ఇలా ఓ అనామకుడిగా, దిక్కులేని మరణానికి గురయ్యాడు…
ప్చ్, బాధాకరం… ఎవరు పట్టించుకున్నారు, ఎవరు మోసగించారు, ఎలా బతుకు దెబ్బతిన్నదీ అనే వివరాలు ఇప్పుడిక అప్రస్తుతం… ఒక ప్రతిభ కలిగిన బుర్ర ‘పెన్నుమూసింది’… అదీ దయనీయంగా… అదే కాస్త కలుక్కుమనిపించే కథ…
తను రాసిన పాటల్లో కొన్ని…
* ‘మావో…ఎ ల్లిపోతున్నాది’ (చిత్రం)
* ‘నన్ను కొట్టకురో.. తిట్టకురో ‘(ఫ్యామిలీ సర్కస్)
* ‘ప్రియతమా తెలుసునా’ (నువ్వునేను)
* ‘నా గుండెల్లో నువ్వుండిపోవా’ (నువ్వునేను)
* ‘అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా’ (వసంతం)
* ‘అభిమన్యుడు కాడు వీడు.. అర్జునుడూ కాడు’ (నిజం)
* ‘ధీందినక్‌తరి తక్‌ధిక్‌తోం’ (సంతోషం)
* ‘దేవుడే దిగివచ్చినా’ (సంతోషం)
* ‘రానురానంటూనే చిన్నదో’ (జయం)
* ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో’ (జయం)
* ‘ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ’ (జయం)
* ‘నిండు గోదారి కదా ఈ ప్రేమ ‘ (నువ్వు లేక నేను లేను)
* ‘వానా వానా వానా.. నీలకాశంలోన’ (శ్రీను వాసంతి లక్ష్మి)
* ‘ఎందుకో ఏమిటో.. తొలిసారి నా గుండెలో’ (దిల్)
* ఏ చిలిపి కళ్ళలోన కలవో (ఘర్షణ)
Share this Article