Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాకూ ఓ చేదు అనుభవం… అందుకే నాకు ‘పాట్నా శుక్లా’ నచ్చిందేమో…

May 1, 2024 by M S R

ప్రసేన్ బెల్లంకొండ   ‘ పాట్నా శుక్లా ‘ నాకు బాగా నచ్చింది. కార్పొరేట్ కళాశాలల్లో నిరుపేద దళిత విద్యార్థుల మార్క్ షీట్లను తారుమారుచేసి వాళ్ళను ఫెయిల్ చేసి, తాము పాసైపోయే డబ్బున్న మహారాజుల పిల్లల వెనుక తల్లి తండ్రులు జరిపే స్కామ్ కథ ఇది.

నిస్సందేహంగా మంచి కథ. మంచి సినిమా. అయితే ఈ సినిమా నాకు ఇంతగా నచ్చడం విషయంలో నా మీద నాకే సందేహాలున్నాయి. నాకు కోర్ట్ రూమ్ డ్రామాలంటే బోలెడు ఇష్టం. అందువల్ల నచ్చిందా. ఈ సినిమా ఇతివృత్తంతో నా ఒకానొక జీవితానుభావం ముడివడి ఉంది. అందుచేత నచ్చిందా. లేక నిజంగానే సినిమా బాగుండి నచ్చిందా తేల్చుకోలేకపోతున్నాను. అందుకే నా ఈ రాత పాట్నా శుక్లా సమీక్ష అని స్పష్టంగా చెప్పలేను. ఆ ఇతివృత్తంతో ముడిపడ్డ నా అనుభవం గురించి మాత్రమే మాట్లాడతాను బహుశా …

అది 2002. నా పెద్దకొడుకు శశాంక ఇంటర్ పరీక్షలు రాసాడు. శశాంక అప్పటి వరకూ అన్ని తరగతులు బాక్ లాగ్ లు లేకుండా పాసవుతూ వస్తున్నాడు కనుక పాసవుతాడన్న ధీమా మాకూ ఉంది తనకూ ఉంది. తీరా ఫలితాలు మాత్రం తను ఎకనామిక్స్ లో ఫెయిలయినట్టు చెప్పాయి. 19 మార్కులు వచ్చాయి. ఆ రోజంతా నేను శశాంక తో ముభావంగా ఉన్నాను. అసలు మాట్లాడలేదు.
కోప్పడి తిట్టినా బాధపడకపోయేవాడేమో గానీ నా ముభావాన్ని మాత్రం వాడు తట్టుకోలేకపోయాడు. నా దగ్గరికొచ్చి కడుపులో తలపెట్టి ‘ నేనైతే బాగా రాసా నాన్నా, ఒకవేళ బాగా రాయలేదనుకున్నా మరీ 19 మార్కులొచ్చేంత చెడ్డగా అయితే రాయలేదు నాన్నా 60 వస్తాయని లెక్కేసుకున్నాను, కనీసం నలభై అయినా రావాలి కదా, ఈ 19 అన్యాయం నాన్నా ‘ అంటూ భోరున ఏడ్చాడు. అయినా నేను మాట్లాడలేదు. ఆ టైం లో నేనలా ప్రవర్తించడం తప్పు అని నాకు తెలుస్తూనే ఉన్నా నా ప్రవర్తన అవుటాఫ్ నా కంట్రోల్. ఓ నాలుగు రోజులు అదే స్థితి.

సప్లమెంటరీ ఫీజ్ కట్టేసాడు. నాలుగు రోజుల తరవాత నా దగ్గరకొచ్చి ‘రివాల్యూయేషన్ చేయిద్దాం నాన్నా’ అన్నాడు.

ఇక్కడొక విశేషం ఉంది. ఇంటర్ బోర్డు రి-కవుంటింగ్ కు అవకాశం ఇస్తుంది కానీ రి-వాల్యూయేషన్ కు అవకాశం ఇవ్వదు. రి కవుంటింగ్ అంటే కేవలం ప్రతి ప్రశ్నకూ వేసిన మార్కులను మరోసారి కూడడం. ఆ కూడికలో ఏమైనా తేడా వచ్చిందేమో చెక్ చేయడం. ఈ రి-కూడికలో తక్కువ వస్తే కూడా తగ్గిచ్చేస్తారు.

రి-వాల్యూయేషన్ అంటే మాత్రం జవాబులకు వేసిన మార్కులు ధర్మంగా వేసారా లేదా అని చెక్ చేయడం. ఇవాల్యేటర్ న్యాయం చెయ్యలేదు అనుకుంటే మరోసారి దిద్దడం అనమాట. నేను ఇక్కడ విశేషం అనే మాట ఎందుకు వాడానంటే బోర్డు అప్పటి వరకూ ఎప్పుడూ రివాల్యూయేషన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఆ ఒక్క సంవత్సరం మాత్రమే సబ్జెక్టుకు రెండు వేలు కట్టి రివాల్యూయేషన్ చేయించుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది. గమ్మత్తేమిటంటే ఆ సంవత్సరం తరవాత ఇప్పటివరకూ మళ్ళీ ఆ ఆప్షన్ లేదు.

శశాంకను సంతృప్తి పరిచేందుకు మాత్రమే నేను రెండు వేలు కట్టాను. ‘రికవుంటింగ్ పెడదాం’ అని నేనంటే వద్దు నాన్నా రి- వాల్యూయేషన్ పెడదాం అన్నాడు. రి-కవుంటింగ్ అయితే వెయ్యి కడితే చాలు. ఒక వెయ్యి మిగుల్చుకుందాం అన్నది నా మధ్యతరగతి పీనాసితనం. కానీ తను పట్టుబట్టి రివాల్యూయేషన్ కట్టిచ్చాడు నాతో.

గమ్మత్తేమిటంటే బోర్డు ఆ ఒకే ఒక్క సంవత్సరం ఆ ఆప్షన్ శశాంక కోసమే పెట్టినట్టుంది..

రివాల్యూయేషన్ లో శశాంకకు 36 మార్కులు వచ్చినట్టు కొత్త మెమో ఇచ్చింది బోర్డు. బోర్డు తన ఫేస్ సేవింగ్ కోసం మాత్రమే 36 ఇచ్చి తప్పించుకుని ఉండవచ్ఛనీ, నిజానికి శశాంక 60 మార్కుల లెవెల్ లోనే రాసి ఉంటాడనీ నేను అప్పుడు నమ్మాను.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా మీద నాకే కోపం వచ్చింది. బిడ్డడు ఎంత కుమిలి ఉంటాడో కదా అని అప్పుడు అనిపించింది.

నేను కాజువల్ సారీ తప్ప సీరియస్ గా సారీ ఎవరికీ ఎప్పుడూ చెప్పను. అంత సీరియస్ సారీ చేసేంత తప్పు నేనెప్పుడూ చెయ్యననేది నా మూఢ విశ్వాసం. సరే అది డిఎన్యే. కానీ ఆ రోజు వాడికి సీరియస్ గానే సారీ చెప్పా. దగ్గరకొచ్చి నా భుజం మీద తలపెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.

ఇప్పుడు ఈ పిడకల వేట లాంటి నా గొడవ వదిలి అసలు సినిమాలోకి వస్తే ఆ విద్యార్థి రింకు కుమారి కూడా అంతే వేదన అనుభవించి ఉంటుంది కదా . ‘ నేను పరీక్ష రాసాక లెక్కేసుకున్నాను నాకు కనీసం 60 కి పైనే మార్కులు రావాలి 31 మాత్రం కానే కాదు’ అంటుంది కోర్టుకెక్కి. సినిమా పొడవునా ఆ అమ్మాయిలో ఆ విశ్వాసం చెక్కు చెదరకుండా నిటారుగానే ఉంటుంది. ఆ అమ్మాయి వాదనను గెలిపించడానికి సర్వం ఫణంగా పెట్టిన న్యాయవాదిగా రవీనా టాండన్ బాగా నటించింది. జడ్జిగా సతీష్ కౌశిక్ అద్భుతం. సినిమాలో ఉత్కంఠకేం కొదవలేదు. చూడండి.

ఒకరు కష్టపడి ర్యాంక్ కొడితే ఆ సర్టిఫికెట్ ను మరెవరో కొట్టేయడం అనే త్రీ ఇడియట్స్ కాన్సెప్ట్ ను పొడిగించినట్టు అనిపించొచ్చేమో కానీ ఇక్కడ వేదన ఉంది. దోపిడీ ఉంది. కార్పొరేట్ నిర్వాకం ఉంది. క్లయిమాక్స్ డ్రామా మరీ అతి అని అనిపిస్తుందేమో గానీ… నాకైతే నా అనుభవంతో జీవితంలో ఉన్నంత గాఢ నాటకీయత ఏ కల్పిత కథలోనూ ఉండదనిపించింది… నిజమేనేమో !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions