.
Subramanyam Dogiparthi …….. అల్లరే అల్లరి . 100% వినోదాత్మక విజయబాపినీడు గారి వంద రోజుల సినిమా . అనగనగా ఓ బామ్మ . ఆ బామ్మకు ఇద్దరు మనమళ్ళు . పెద్ద మనమడు మోహన్ బాబు నిశాని . చిన్న మనమడు చిరంజీవి అగ్రికల్చరల్ B Sc .
నిశాని మనమడికి డిగ్రీ చదువుకున్న భార్య , చదువుకున్న మనమడికి నిశాని భార్య వస్తారు . నిశాని భార్య రాధికకు పట్నం పిచ్చి . తన పిచ్చిని తోడికోడలు గీతకు ఎక్కిస్తుంది . మొగుళ్ళను ఎంత విసిగించినా బామ్మను వదిలి వచ్చేందుకు ఒప్పుకోరు . ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా పట్నం చెక్కేస్తారు .
Ads
పట్నంలో నానా కష్టాలు పడతారు . వాళ్ళకు బుధ్ధి చెప్పి ఇంటికి తీసుకుని వెళతానికి మనమళ్ళు ఇద్దరు పట్నానికి వచ్చి , దుష్టశిక్షణ చేసి , తమ భార్యామణులను ఇంటికి తీసుకుని వెళతారు . ఇదీ టూకీగా కధ .
ఇద్దరు మనమళ్ళుగా మోహన్ బాబు , చిరంజీవి చాలా బాగా చలాకీగా నటించారు . బామ్మ కూచీలుగా , మంచి మొగుళ్ళుగా చక్కగా నటించారు . మొండి పెళ్ళాలుగా గీత , రాధిక ఇంకా బాగా నటించారు . రాధికకు ఓ కోతి ఫ్రెండ్ . అప్పుడప్పుడు చిరంజీవికి రాధికలో కూడా ఓ కోతి కనిపిస్తూ ఉంటుంది .
ఈ సినిమాలో ఈ రెండు జంటలు కాకుండా మరో జంట ఉంటుంది . రావు గోపాలరావు , రమాప్రభ . రావు గోపాలరావు మాలిష్ చేసే కబుర్లరాయుడు . ఏ ఊరి కస్టమరుకి తనదీ ఆ ఊరే అని చెపుతా మాంచి కబుర్లు చెపుతుంటాడు . కాసేపు ఇజయనగరం , కాసేపు ఇశాఖపట్నం , మరి కాసేపు కాకినాడ అంటుంటాడు . సినిమాకు మంచి సపోర్టింగ్ కేరెక్టర్ .
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనే డైలాగుని తెలుగునాడులో వీర పాపులర్ చేసిన నూతన్ ప్రసాద్ పాత్రను ప్రేక్షకులు ఈనాటికీ మరచిపోలేదు . మరచిపోరు కూడా . పోలీస్ ఇనస్పెక్టర్ పాత్రలో నూతన్ ప్రసాద్ నటన , హావభావాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి .
బామ్మగా నిర్మలమ్మ ఎప్పటిలాగే అదరగొట్టేసింది . మన తెలుగు సినిమా రంగంలో గొప్ప versatile actress నిర్మలమ్మ . ఇతర పాత్రల్లో శకుంతల , చాలామంది జూనియర్ ఆర్టిస్టులు , ఔత్సాహికులు నటించారు .
సినిమా విజయానికి సత్యం సంగీతం దోహదపడింది .
వేటూరి వారి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి పాట చాలా బాగుండటమే కాకుండా హిట్టయింది కూడా . మరొక హిట్ సాంగ్ హే పతివ్రతా హేహే పతివ్రతా . టైటిల్సుతోనే కాకుండా సినిమా రన్నింగులో కూడా వస్తుంది . మైలవరపు గోపి వ్రాసారు .
వినుకోండి కొండదొర దండోరా పాట హైదరాబాద్ వీధుల్లో తీసారు . చార్మినార్ , టాంక్ బండ్ , ఇతర వీధులు రహదార్లు కనిపిస్తాయి . ఆల్మోస్ట్ 1970s దాకా మనకు మద్రాస్ వీధులే కనిపించేయి . 1980s నుండే హైదరాబాద్ , గత ఇరవై ఏళ్ళ నుండి విశాఖపట్నం , గోదారి గ్రామాలు కనిపించడం ప్రారంభమయింది .
నీకున్నదే కాస్త బుర్ర అంటూ రాధికను టీజ్ చేసే పాట గ్రామీణ నేపధ్యంలో బాగుంటుంది . కడుపు నెలకడ గడబిడ చేసేను పేరడీ పాట సరదాగా నడుస్తుంది . పాటల్ని వేటూరి , మైలవరపు గోపి , ఉత్పల సత్యనారాయణ వ్రాసారు .
కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిన పట్టణక్కె బంద పత్నియరు సినిమాకు రీమేక్ మన ఈ సినిమా . కన్నడంలో మంజుల , పద్మప్రియ , శ్రీనాధ్ , లోకేష్ నటించారు . 280 రోజులు ఆడిందట కన్నడ సినిమా . అంత భారీగా ఆడకపోయినా మన తెలుగు సినిమా కూడా వంద రోజులు ఆడటమే కాకుండా వ్యాపారపరంగా కూడా విజయవంతం అయింది . తరచూ టివి చానళ్ళలో కూడా వస్తుంటుంది .
ఈ విజయవంతమైన సినిమాకు స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , దర్శకత్వం T S B K మౌళి నిర్వహించారు . చిరంజీవి , మోహన్ బాబు అభిమానులకు బాగా నచ్చే ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . కాలక్షేపం కొరకు , వినోదం కొరకు అప్పుడప్పుడు మళ్ళా మళ్ళా చూడొచ్చు కూడా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article