.
( రమణ కొంటికర్ల )
….. గోవా తీరాల నుంచి గ్లోబల్ గ్లోరీ వరకు: ప్రసిద్ధ విస్కీ పాల్ జాన్ స్టోరీ!
గోవా అంటే పర్యాటకమే కాదు.. చాలా మంది పర్యాటకులకు కిక్కిచ్చే మందు తయారీకి పుట్టిల్లు కూడా. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన విస్కీకి గోవా సముద్రతీరం కేరాఫ్ అని తెలుసా..? మందుపై మాంచి అవగాహన ఉన్నవాళ్లకు వెంటనే తెలిసే పేరు పాల్ జాన్.
Ads
గోవాలోని పాండూరు తీరం ప్రపంచ స్థాయి డిస్టిల్లరీ కంపెనీకి.. గ్లోబల్ స్పిరిట్స్ కు ఫేమస్ గా మారి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 370 అంతర్జాతీయ అవార్డులందుకున్న పాల్ జాన్ ఆసియాలోనే అత్యధిక గుర్తింపు పొందిన సింగిల్ మాల్ట్. లండన్ లోని ఇంటర్నేషనల్ అండ్ స్పిరిట్ కాంప్టీషన్ నుంచి మొదలుకుంటే శాన్ ఫ్రాన్సిస్కో వరల్డ్ స్పిరిట్స్ పోటీల వరకూ ఈ పాల్ జాన్ విస్కీ నాణ్యతలో భౌగోళిక పరిమితులను అధిగమించి పేరు తెచ్చుకుంది.
కేవలం ఆసియా దేశాల్లోనే కాకుండా అంతర్జాతీయ సమాజంలో కూడా ఎనిమిది ముఖ్యమైన పురస్కారాలను పాల్ జాన్ స్పిరిట్ కంపెనీ గెల్చుకుంది. ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్ కాంప్టీషన్ లోనే 53 అవార్డులు కొల్లగొట్టింది. శాన్ ఫ్రాన్సిస్కో వరల్డ్ స్పిరిట్ పోటీల్లో 2017 నుంచీ 2022 వరకూ కూడా 20 పురస్కారాలతో కింగ్ గా నిల్చిన రారాజు పాల్ జాన్ విస్కీ.
అయితే, పాల్ జాన్ సక్సెస్ వెనుక ఉన్నత స్థాయి నిపుణులు, మాస్టర్స్ ఆఫ్ వైన్, ప్రముఖ డిస్టిల్లర్సెందరి కృషి ఉండటమేగాకుండా.. బ్లైండ్ టేస్టింగ్ తో నిష్పక్షపాతంగా నిర్ణయించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుండటమే ఈ విస్కీని గ్లోబల్ లెవల్ లో ప్రత్యేకంగా నిలబెట్టింది.
పాల్ జాన్ కు చెందిన పాల్ జాన్ క్లాసిక్ ఇప్పటికే 44 అవార్డులను గెల్చుకుంది. వాటిల్లో 16 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ విస్కీకి మాస్టర్ హోదా దక్కింది. పాల్ జాన్ కంపెనీకి చెందిన బ్రిల్లియన్స్, పీటెడ్ వంటివి 42 అవార్డులను గెల్చుకోగా… నిర్వాణకు 30 అవార్డులు దక్కాయి.
ఇక మిథున ఫ్లేవర్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ప్రపంచంలోని అత్యుత్తమ విస్కీల గురించి వివరించే గైడ్ గా.. జిమ్ ముర్రే రాసిన విస్కీ బైబిల్ లో ప్రపంచంలోనే మూడో అత్యుత్తమ విస్కీగా పాల్ జాన్ ఫ్లేవర్ మిథునను కొనియాడారు. అలాగే ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీగా కన్య ఆసియాలోనే ఉత్తమ విస్కీగా గుర్తింపు పొందింది.
గోవాకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీగా గుర్తింపు పొందిన ఈ ఫ్లేవర్స్ గురించి చెప్పాలంటే… వివిధ డిస్టిల్లరీస్ లో తయారైన ప్రోడక్ట్స్ నుంచి కాకుండా.. ఒకటే డిస్టిల్లరీ నుంచి తయారవ్వడమే ఈ సింగిల్ మాల్ట్ ప్రత్యేకత. 2017లో ఐకాన్స్ ఆఫ్ విస్కీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పాల్ జాన్ విస్కీ ఇండస్ట్రీస్ చైర్మన్ పాల్ జే జాన్ వరల్డ్ విస్కీ అంబాసడర్ ఆఫ్ ది ఈయర్ అవార్డునందుకున్నారు. 2022లో వరల్డ్ విస్కీ హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తింపు పొందిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఈ గోవా ఇండస్ట్రియలిస్టే.
తాజాగా 2025లో కూడా పాల్ జాన్ డిస్టిల్లరీ, విజిటర్ సెంటర్ కు గ్లోబల్ అట్రాక్షన్ ఆఫ్ ది ఈయర్ అవార్డ్ దక్కింది. దీంతో ఇప్పుడు గోవాకు చెందిన పాల్ జాన్ ప్రపంచంలోని ప్రముఖ డిస్టిల్లరీ కంపెనీల సరసన నిల్చింది. అందుకే, గోవాకు వెళ్లేవారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీయల్ ప్రాంతాన్నీ సందర్శిస్తున్నారట.
గోవా నుంచి బయటకొచ్చే పాల్ జాన్ విస్కీ ఉత్పత్తుల విజయం వెనుక ఉన్న రహస్యమేంటంటే.. సాంప్రదాయంలో నవీనత ఇక్కడి ప్రత్యేకత. స్కాట్లాండ్ లోని మబ్బు పట్టిన వాతావరణానికీ, అమెరికా కెంటుకీలోని లైమ్ స్టోన్ నీటితో కల్గి ఉన్న ప్రత్యేకతలకు భిన్నంగా.. గోవా ఉష్ణమండల వాతావరణం ఇక్కడ విస్కీ తయారీలో కావల్సిన తేమకు ప్రయోజనకారిగా నిలుస్తోంది.
తగినంత ఉష్ణోగ్రత, కావల్సినంత తేమ ఉండటం వల్లే గోవా విస్కీ ప్రత్యేకమైందిగా అమెరికా, యూరప్ పరిశోధకులు తేల్చిన విషయం. స్పిరిట్ ఎంత మాగితే అంత బాగుంటుందనేది తెలిసిందే. ఈ క్రమంలో చెక్క పెట్టెల్లో మాగబెట్టడం, వాతావరణంలోని తేమ వెరసి.. చల్లని వాతావరణంలో మాగడానికి 15 నుంచి 20 ఏళ్ల సమయం పట్టాల్సిన విస్కీ.. గోవా ఉష్ణమండల వాతావరణంలో ఐదేళ్లకే ఆ రుచిని అందిపుచ్చుకోవడం కూడా గోవా ఇండస్ట్రీకి కలిసివచ్చే అంశం.
విస్కీ ఇండస్ట్రీలో పాల్ జాన్ ప్రయోగాలతో పాటు.. గోవా వాతావరణం కూడా కలిసివచ్చిన అంశం. రాజస్థాన్, హర్యానాతో పాటు.. హిమాలయ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే సిక్స్ రో బార్లీ గింజలతో పాటు, దేశీయంగా తయారుచేసే కాపర్ స్టిల్స్, అమెరికన్ ఓక్ బ్యారెల్స్ వంటివన్నీ కలిసి నాణ్యమైన లిక్విడ్ ఎక్సలెన్సీని పాల్ జాన్ విస్కీకి అద్దుతున్నాయి.
ఈమధ్యకాలంలో పాల్ జాన్ విస్కీ SIP అవార్డును కూడా గెల్చుకుంది. ఇదెవరో నిపుణులిచ్చే పురస్కారమేం కాదు.. సాధారణ వినియోగదారుల తీర్పు ప్రకారమిచ్చే అవార్డ్. అలా ఐదు అవార్డులు గెల్చుకుంది పాల్ జాన్. ఆ అవార్డుల్లో ప్లాటినం, డబుల్ గోల్డ్ తో సత్కరించారు. మొత్తంగా ఉన్నత స్థాయి నుంచి సామాన్య మందు ప్రియుల వరకూ ఇప్పుడు పాల్ జాన్ ఓ చరిత్ర సృష్టిస్తోంది.
ఇప్పుడు పాల్ జాన్ విస్కీ ఇండస్ట్రీ మరింత విస్తరిస్తోంది. ఆసియాలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2024లో సింగపూర్ లో జరిగిన వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ లోనూ రెండు అవార్డులను సాధించింది. పశ్చిమదేశాల్లోనూ తన ఉనికిని చాటుతోంది.
ఇలా గోవాలోని ఓ స్వదేశీ డిస్టిల్లరీ కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ పురస్కారాలన్నింటినీ కొల్లగొట్టి.. భారతీయ విస్కీకి ఒక స్థానం కల్పించడంతో పాటే.. ప్రపంచ విస్కీ పటంలో ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి కూర్చుంది…
Share this Article