.
‘సంధ్య థియేటర్’ తొక్కిసలాట- అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకన్నా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందనే హుందాగా, ఆ పోస్టుకు తగినట్టుగా అనిపించింది…
నిన్న ఎక్కడో స్పందించడానికి నిరాకరించినా, ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు… దిల్ రాజు తన సినిమా గేమ్ చేంజర్ ప్రిరిలీజు ఏపీలో చేయడానికి నిర్ణయించాడు… తెలంగాణలో ప్రిరిలీజు ఫంక్షన్ చేసే వాతావరణం ప్రస్తుతానికి లేదు…
Ads
హైదరాబాదులోనే ప్రి-రిలీజు ఫంక్షన్ చేయడానికి నిర్ణయించి, సీఎం రేవంత్ రెడ్డిని పిలవాలని అనుకుంటున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది కానీ… సందేహమే… సినిమావాళ్లను కట్టుదిట్టాల్లోకి దింపిన రేవంత్ రెడ్డి ఒకవేళ తనే ఈ ప్రి-రిలీజుకు వెళ్తే తనే బదనాం అవుతాడు…
గేమ్ చేంజర్ సినిమా పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కొడుకుది… పవన్ కల్యాణే స్వతహాగా ఈరోజుకూ సినిమా హీరో… సో, వెళ్తే వెళ్తాడేమో… పైగా కొంతకాలంగా చిరంజీవి మెగా క్యాంపుకీ, ప్రత్యేకించి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కూ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కూ నడుమ వైరం ముదిరిపోయి ఉంది…
అల్లు అరవింద్ కుటుంబం కూడా పవన్ కల్యాణ్‌కు దూరదూరంగానే ఉంటోంది… ఈ స్థితిలో అల్లు అర్జున్ అరెస్టయ్యాక సినిమా ఇండస్ట్రీ పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు తనను పరామర్శించడానికి తన ఇంటి ముందు క్యూ కట్టాయి… ఐనాసరే, ఇండస్ట్రీ ముఖ్యుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం అల్లు అర్జున్ తనను కలవడానికి శతథా ప్రయత్నించినా సరే, చాన్స్ ఇవ్వలేదు… హైదరాబాదుకు వచ్చి వెళ్లినా బన్నీ ఇంటి మొహం చూడలేదు…
ఇప్పుడు కూడా అల్లు అర్జున్ బంధువుగా కాదు, ఓ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరించాడు… పొరుగు రాష్ట్రానికి సంబంధించి కీలకమైన రాజకీయ పదవిలో ఉన్నాడు… ఇక్కడ బంధుత్వం చూడలేదు… అదే చంద్రబాబు మాత్రం తగుదునమ్మా అని అల్లు అర్జున్ ఏదో బాధితుడన్నట్టుగా ఫోన్ కాల్ చేసి పరామర్శించాడు… కరెక్టు కాదు… ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డిని తప్పుపట్టినట్టే..!
చిట్‌చాట్‌లో పవన్ కల్యాణ్ ఏమంటాడు అంటే..?
‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు- అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి… మానవతా దృక్పథం లోపించినట్టైంది- వెళ్ళకపోవడం పొగరు అనుకుంటారు… ప్రత్యక్షంగా వీళ్లే కారణం కాకపోయినా యూనిట్ మొత్తం మద్దతు ఇవ్వాల్సింది… అలా చెయ్యకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేశారు… సినిమా అనేది టీమ్, హీరోని ఒంటరిని చేసేశారు…
కనీసం టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది… సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు – రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత… బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు… చట్టం ఎవరికీ చుట్టం కాదు- తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేది…
సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు… పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే-…’’
తనకు అల్లు అర్జున్ అంటే పడదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడనే అంచనాకు రాలేం… తను హుందాగానే స్పందించాడు… ఒక పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మాత్రమే మాట్లాడాడు… రెండు ప్రభుత్వాల నడుమ ప్రస్తుతం సత్సంధాలున్నాయి కాబట్టి, అదే దిశలో తన మాటలున్నాయి… చంద్రబాబు ధోరణికి భిన్నంగా…!!
పవన్ కల్యాణ్ మాటలు అల్లు అర్జున్ ధోరణిని వ్యతిరేకిస్తున్నట్టు ఉండటమే కాదు, ప్రస్తుతం హీరోలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులు లేవనీ అన్నాడు… తన మనసులో ఉన్న విషయాల్ని నిర్మొహమాటంగా, ఏవో మర్యాదల ముసుగులేవీ వేసుకోకుండా స్ట్రెయిట్‌గానే చెప్పాడు… పర్లేదు..!! ఐతే అల్లు అర్జున్ స్థానంలో మరో హీరో ఉండి ఉంటే, ప్రత్యేకించి మెగా హీరో ఉండి ఉంటే ఇలాగే మాట్లాడేవాడా..? ఇది ఊహాజనితం, కాబట్టి ఆన్సర్ కష్టం..!!
Share this Article