.
ఉత్తర తెలంగాణలో ప్రధాన పుణ్యక్షేత్రం కొండగట్టు..! ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ప్రతి గ్రామంలో 20 నుండి 200 మంది హనుమాన్ దీక్షాధారులుంటారు… అందరూ దీక్ష విరమణకు వెళ్లేది కొండగట్టు హనుమాన్ క్షేత్రానికే…
ఒకప్పుడు మానసిక వికలాంగుల్ని తీసుకొచ్చి అక్కడ రోజుల తరబడీ ఉంచేసేవారు, కట్టేసేవారు… అందరికీ ఆ ఆంజనేయుడే స్వస్థత చేకూరుస్తాడని నమ్మకం… ఒకప్పుడు చిన్న గుడి… తరువాత భక్తజన సందోహం బాగా పెరిగింది… ఇప్పుడది తెలంగాణలోని ప్రధాన తీర్థం…
Ads
- పవన్ కల్యాణ్ అక్కడ దీక్షావిరమణ మండపం, వసతి గృహ నిర్మాణం కోసం టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించాడు… గుడ్… టీటీడీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టు వింటుంది కాబట్టి చైర్మన్ నాయుడు పీకే అడగ్గానే ఇచ్చేశాడు… ఇక్కడి వరకూ గుడ్… ఈ ఒక్క కోణంలో అభినందిద్దాం… కొండగట్టు ఆంజనేయుడి దయ వల్లే బతికి బట్టకట్టాననే వినమత్రను చూపిస్తున్నాడు, రుణం తీర్చుకున్నాను అంటున్నాడు కాబట్టి..! (కొండగట్టు ఆంజనేయుడు ఎవరినైనా తన వద్దకు రప్పించుకోగలడు…)
ఇక ఉన్నదున్నట్టు కొన్ని విషయాలు చెప్పుకుందాం… 1) పట్టువస్త్రాలు, పూలు, పళ్లు ఎప్పుడు తీసుకుపోతారు ఓ గుడికి… ఏదేని సందర్భం ఉండాలి… కల్యాణాలో, బ్రహ్మోత్సవాలో… మరి పవన్ కల్యాణ్ రావడమే కొండగట్టులో బ్రహ్మోత్సవం అన్నట్టుగా అక్కడి పూజారులు, అధికారగణం సాగిలబడ్డారు ఎందుకు..?
2) అసలు పవన్ కల్యాణ్‌ను చూస్తేనే జన్మ ధన్యం అయిపోయినట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పులకరించి పోయాడు దేనికి..? నువ్వు తెలంగాణ మంత్రివి నాయకా..? సగటు పవన్ కల్యాణ్ అభిమానిలాగే వ్యవహరిస్తే ఎలా..?
- 3) ముందుగా పవన్ కల్యాణ్‌లోని ఆంధ్రా రాజకీయ నాయకుడిని గుర్తుచేసుకుందాం… తెలంగాణ ఏర్పడినప్పుడు వారంపది రోజులు నిద్రాహారాలు మాని దుఃఖించాడు… సమైక్యుడు… మొన్నటికిమొన్న, అంటే తెలంగాణ ఏర్పడిన పుష్కరం తరువాత కూడా అదే ధోరణి… కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందనీ, అసలు ఈ దిష్టే విభజనకు కారణం అనీ ఏవేవో చెప్పాడు… ప్రతి మాటలో తెలంగాణ వ్యతిరేకత… ఇప్పుడు చెబుతున్నాడు తెలంగాణ చైతన్యమే తనకు స్పూర్తి అనీ, ఇంకా ఏదేదో… తన దిష్టి వ్యాఖ్యలకు వివరణ ఇస్తాడేమో అనుకున్నారు, అదీ లేదు…

4) ఇదే కొండగట్టు విషయానికి వస్తే… పదేళ్ల కేసీయార్ పాలన ఎలాగూ పట్టించుకోలేదు, 1300 కోట్ల యాదాద్రి నిర్మాణం తప్ప మరే గుడినీ పట్టించుకోలేదు… చివరకు అదే కొండగట్ట బస్సు ప్రమాదంలో దాదాపు 55 మంది మరణించినా పట్టలేదు తనకు… ఈ 30 కోట్లు చేతకాలేదా..? అందినకాడికి భక్తుల నుంచి దండుకునే తెలంగాణ దేవాదాయ శాఖకు ఎందుకు చేతకాలేదు..? పోనీ, రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చేతకాలేదు..?
5) పోనీ, తెలంగాణ ప్రభుత్వం అడిగితే టీటీడీ ఇవ్వకపోయేదా..? దేశవిదేశాల్లో వందలు, వేల కోట్లను ఖర్చు చేస్తోంది టీటీడీ… తిరుమల ఆదాయంలో తెలంగాణ భక్తుల వాటా ఏమీ తక్కువ కాదు కదా… చివరకు పవన్ కల్యాణ్ అడిగితే తప్ప కొండగట్టులో సౌకర్యాల కల్పనకు ముందుకు రాలేదా..?
6) జనసేన తరఫున గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు, పోటీచేసినవాళ్లతో మీటింగు పెట్టాడు అక్కడే… ఆధ్యాత్మికతకూ, పార్టీ వ్యవహారాలకూ లంకె పెట్టడం దేనికి అక్కడ..? తన ఉద్దేశం క్లియర్, పోటీచేస్తాం తెలంగాణలో అంటున్నాడు…
7) ఓ సంకేత ప్రదర్శనకు వచ్చాడు తను… రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలంగాణలో కలిసి పోటీచేస్తాయని..! ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న తెలంగాణలో బీజేపీలో అంతర్గత విభేదాల మాటేమిటో గానీ… కొందరు బీఆర్ఎస్ వైపు లాగుతున్నారు… ఎన్‌డీఏలోని టీడీపీ, జనసేన తమవైపు లాగుతున్నాయి… దశాబ్దాలపాటు టీడీపీకి తోకగా మారి, సొంత బలం చేజేతులా చెడగొట్టుకున్న తెలంగాణ బీజేపీకి మళ్లీ గడ్డు రోజులు రాబోతున్నాయి…

- 8) చివరగా అక్కడ ఏదో బలప్రదర్శనలాగా వెహికిల్ మీద కూర్చుని, అభివాదాలు దేనికి..? సంధ్య థియేటర్ దుర్ఘటన గుర్తుకురాలేదా..? అసలు తెలంగాణ పోలీసులు ఎలా అంగీకరించినట్టు..? ప్రోటోకాల్‌లో కూడా ఆయన పేరు పైన పెట్టి మంత్రుల పేర్లు కింద పెట్టారు, పవన్ కల్యాణ్ పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత భక్తో కదా… చివరకు ఆనం రామనారాయణ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటి..? ఆయనకు లింక్ ఏమిటి..?
(ఇది ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగింది ప్రోగ్రామ్… రేవంత్ రెడ్డి మరీ తనకు మాలిన ధర్మం చూపిస్తున్నాడు… జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ మీద ఎవరి పర్యవేక్షణ లేకుండా పోయినట్టుంది…)
9) చివరగా… గతంలో కరెంటు తీగెల నుంచి తనను కాపాడాడు ఆంజనేయుడు అనే భక్తితో, కృతజ్ఞతతోనే కదా, మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది… ఓ భక్తుడిగా ఒద్దికగా, ఆ శంకుస్థాపనలేవో చేసేసి వెళ్లిపోకుండా… ఈ అట్టహాసాలు, రాజకీయ ప్రదర్శనలు ఏమిటి..?
10) మీరు పైన ఫోటో చూశారుగా... గతంలో ప్రమాదం తప్పినచోట మళ్లీ కరెంటు తీగెలు అడ్డొస్తే, చాకచక్యంగా వెనక్కి వాలి తప్పించుకున్నాడట... ప్రమాదం తెలిసీ మరెందుకు వాహనం మీద ఎక్కి ర్యాలీలు..? తను వెనక్కి వాలాడు గానీ తన బాడీ గార్డ్ అలాగే కూర్చున్నాడు... కాస్త తలవంచాడు అంతే... ఎందుకీ ప్రదర్శన..? మళ్లీ తృటిలో తప్పిన ప్రమాదం అంటూ వార్తలు... హేమిటో...!!
Share this Article