.
ఒక్క ముక్కలో చెప్పాలంటే… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనను ఎండగడుతున్నట్టే..! అందరూ అంగీకరించకపోవచ్చుగాక… కానీ ఒక మంత్రిని, అందులోనూ ఓ మహిళా మంత్రిని, ఓ హోం మంత్రిని బాధ్యత తీసుకోవాలని చెబుతున్నాడంటే…
అది ఆ మహిళా మంత్రికన్నా మంత్రివర్గం పనితీరుకు స్థూలంగా బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబును అన్నట్టే లెక్క..! తను డీజీపీని, పోలీసు అధికారులను మీకు ఏమీ చేతకావడం లేదని విమర్శిస్తున్నట్టే లెక్క…
Ads
పేరుకు వైసీపీ నాయకుల్ని విమర్శిస్తున్నట్టు కనిపించినా సరే… ఎందుకు ఇది చంద్రబాబును విమర్శించడం కింద లెక్కేయాలంటే…? హోం మంత్రికి ఏ రాష్ట్రంలోనైనా చాలా పరిమితులుంటాయి… కీలకమైన ఐపీఎస్, ఇతర సీనియర్ పోలీస్ అధికారుల మీద ఆజమాయిషీ, శాంతి భద్రతల సంపూర్ణ బాధ్యత ముఖ్యమంత్రిదే…
అత్యాచారాలను నిరోధించడంలో వైఫల్యాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించడంలో తప్పులేదు… తన ఆందోళనను వ్యక్తపరచడంలో కూడా తప్పులేదు… కానీ ఆ ఎన్డీయే కూటమి భాగస్వామిగానే ఉన్నందున బహిరంగ విమర్శ అనేది తప్పు… అది ఒకరకంగా తనను తాను నిందించుకోవడమే…
మంత్రివర్గ సమావేశాల్లో ప్రస్తావించొచ్చు… నేరుగా ఆ మహిళా మంత్రికే ఫోన్ చేసి తన ఆందోళనను వ్యక్తం చేయవచ్చు… ముఖ్యమంత్రితో భేటీ వేసి తన అభిప్రాయాలను చెప్పవచ్చు… అంతేగానీ, బహిరంగంగా ప్రభుత్వం మీద విమర్శ చేయడం అంటే, తనను తాను తప్పుపట్టుకోవడం, ముఖ్యమంత్రిని తప్పుపట్టడం…
అబ్బెబ్బే… ఆయన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదు, జస్ట్, అలర్ట్ చేస్తున్నాడంతే, ఐనా మా సీఎం అన్నీ సమన్వయపరుస్తాడులే అని మంత్రి నారాయణ ఎంత వెనకేసుకొచ్చినా సరే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు జనంలోకి కూటమి పాలన మీద తప్పుడు సంకేతాల్ని పంపించినట్టే అవుతుంది…
అన్నింటికీ మించి… నేను హోం శాఖ తీసుకోలేనా అంటాడు… ఎవరొద్దన్నారు..? ఆమె శాఖ నీకు, నీ శాఖ ఆమెకు అదల్ బదల్ చేయించుకోవచ్చు కదా చంద్రబాబుకు చెప్పి..! నేను హోం తీసుకుంటే అది ఉత్తరప్రదేశ్‌లో యోగి పాలనలోలాగే క్రిమినల్స్ తాటతీస్తాను అనడమంటే… యోగి సీఎం కదా, అంటే పవన్ కల్యాణ్ ఎవరిని విమర్శిస్తున్నట్టు..? చంద్రబాబును కాదా..?
ఇప్పటికిప్పుడు కూటమిలో విభేదాలు వచ్చాయని ఏ అంబటి రాంబాబో అన్నాడంటే దాన్ని పట్టించుకునే పనిలేదు… తన అవగాహన స్థాయి అది.., కేవలం పవన్ కల్యాణ్‌కు ఎక్కడ ఏ విషయాల్ని ఎంతమేరకు, ఎలా వ్యక్తపరచాలో తెలియని పాలన రాహిత్యమే తప్ప… తన వ్యాఖ్యల్లో పెద్ద దురుద్దేశాలు ఏమీ లేవు… కాకపోతే అది తెలియనితనం…
మీరు చూస్తూ ఉండండి… చంద్రబాబు సైలెంటుగా ఉంటాడు… ఏమీ మాట్లాడడు… బీజేపీ కూడా ఏమీ మాట్లాడదు… యెల్లో మీడియా కూడా అండర్ ప్లే చేస్తుంది వివాదాన్ని… సాక్షి వింత బాష్యాలతో కాస్త పెట్రోల్ పోయడానికి ప్రయత్నిస్తుంది… అంతే…
అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నాం అంటున్నాడు పవన్ కల్యాణ్… ముందుగా ఒక కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో సంయమనం పాటించాలి అనే సోయి మాత్రం కనిపించదు… పవన్ కల్యాణ్ కదా… చాన్నాళ్ల నుంచి చూస్తున్నదే కదా… తను అంతే..!!
అవును సారూ… చిన్న సందేహం… పంచాయత్ రాజ్ శాఖ పనితీరు మీద హోం మంత్రికి కూడా అసంతృప్తి ఉండి, ఆమె కూడా నేను పంచాయత్ రాజ్ శాఖ తీసుకోలేనా అని వ్యాఖ్యానిస్తే, మీ మనోభావాలు ఏమీ దెబ్బతినవు కదా…!!
Share this Article