మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం… నడుమ ఈ సర్కారు ఏంది..? పన్నులు వేయడమేంది..? రేట్ల మీద నియంత్రణ ఏంది..? మా దుకాణాల జోలికి వస్తే మాడిపోతవ్ బిడ్డా……. అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది..? ‘ప్రభుత్వం విధులు-బాధ్యత-అధికారాలు’ అనే సబ్జెక్టు మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది… సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తుచేయాల్సి ఉంటుంది… తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అనే సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ సాగించిన బెదిరింపులు, అదిలింపులు, వాదనలు కూడా సేమ్..! చిరంజీవి మీద పల్లెత్తు మాట అనడానికి ఎప్పుడూ సాహసించని పీకే చివరకు ఈ ప్రసంగంలో… ‘‘వంగిపోవాల్సిన అవసరం లేదని చిరంజీవికి మీరైనా చెప్పండి, సర్కారును ప్రాథేయపడాల్సిన గతేమీ లేదు’’ అని ఒకరకంగా చురక అంటించాడు… ఎవరో మంత్రిని సన్నాసీ అన్నాడు… రేప్పొద్దున మీ స్కూల్ అడ్మిషన్లను కూడా ప్రభుత్వమే చెప్పుచేతల్లోకి తీసుకుంటే వోకేనా, మీరు మద్దతుదారులే కదా, వెళ్లి మాట్లాడలేరా అంటూ మోహన్‌బాబుకూ పూశాడు… ఏమయ్యా, దిల్ రాజూ, నువ్వు రెడ్డి, మీ జగన్‌రెడ్డితో మాట్లాడొచ్చు కదా అంటూ సమస్యకు కులకోణాన్ని రుద్దాడు… అంటే పరోక్షంగా రెడ్ల మాటే చెల్లుబాటవుతోంది ఈ ప్రభుత్వంలో అని ఎత్తిపొడిచాడు…
సుదీర్ఘంగా సాగిన తన రాజకీయప్రసంగానికి నిజానికి ఆ ప్రిరిలీజ్ వేడుక సరైన వేదిక కాదేమో… ఐనా పీకేకు అవేమీ పట్టవు కదా, ఆవేశమొస్తే ఊగిపోవడమే… చిత్రవిచిత్రంగా తన వాదన అలా సాగిపోతూ ఉంటుంది… స్థూలంగా ఆ ప్రసంగం పైపైన వింటే… అరె, భలే కడిగేశాడు కదా అనిపించవచ్చు… జగన్‌ను నిలదీయడానికి భయపడనివాడు ఒకడున్నాడులే అని కూడా అనిపించవచ్చు… కానీ కొన్ని ప్రశ్నలు, సందేహాలు, అయోమయాలు, గందరగోళాలు అలాగే ఉండిపోయాయి హీరో గారూ…
Ads
- పీకే చదివిన వేల పుస్తకాల్లో లిబియా, గడాఫీ, ఇండియన్ రిపబ్లిక్ వంటి సీరియస్ పుస్తకాలున్నాయి తప్ప… ‘రాష్ట్ర సర్కారు బాధ్యతలు’ అనే పుస్తకం లేనట్టుంది…
- నా సినిమాల్ని అడ్డుకోవడానికి, నామీద కోపంతో ఇండస్ట్రీ జోలికి వస్తున్నాడు జగన్ అనేది పీకే వాదన… ఇది మరీ సెల్ఫ్ ప్రమోషన్… పీకే సినిమాల్ని అడ్డుకోవాలంటే బోలెడు మార్గాలుంటయ్, దానికి మొత్తం ఇండస్ట్రీ జోలికి పోవాల్సిన అవసరం ఏముంది..? స్థూలంగానే తెలుగు ఇండస్ట్రీ కులం కోణంలో చంద్రబాబు మద్దతుదారు, తన వ్యతిరేకి అనే భావన జగన్‌లో ఉంది… దానికి అవకాశం ఇచ్చింది కూడా సినిమా పెద్దలే…
- ఆన్‌లైన్ టికెట్ల నిర్ణయాన్ని మీ ఇండస్ట్రీ పెద్దలే సమర్థిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు కదా..! బెదిరించి అలా మద్దతు ప్రకటింపజేస్తున్నారా..? లేదు కదా…
- టికెట్ల డబ్బులు ప్రభుత్వానికి వస్తే, దాన్ని ఆదాయంగా చూపించి, బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకోవడానికే ఈ ఆన్‌లైన్ నిర్ణయం అంటున్నాడు పీకే… ఇది మరీ ఆంధ్రజ్యోతి వండే ఆర్థికకథనాల స్థాయిలో మరీ నాసిరకంగా ఉంది హీరో గారూ… కొన్నాళ్లు ఆ పత్రిక చదవడం మానెయ్… టికెట్లతో వచ్చే డబ్బెంత..? అది నిర్మాతలకు ఇవ్వాల్సిందే కదా, అది ఆదాయం ఎలా అవుతుంది..? ఆదాయం అనగానే బ్యాంకులు సోయి తప్పి, మైమరిచిపోయి వేలకువేల కోట్ల కొత్త అప్పులు ఇచ్చేస్తాయా..?
- ఇప్పుడు నిజంగానే ఏపీలో థియేటర్లు నడవడం లేదా..? నిర్ణీత సంఖ్యలో షోలకు అనుమతి ఉందా..? లేదా..?
- ఇండస్ట్రీ గొప్పది, పవిత్రమైంది, పత్తిత్తు వంటి కబుర్లు దేనికి బ్రదర్… దాని జోలికి వస్తే మాడిపోతావ్ అనే బెదిరింపులు దేనికి..? మీ ఇండస్ట్రీకి ఇప్పుడంత సీనేమీ లేదు… రాబోయే రోజుల్లో థియేటర్లకు రావడానికే ప్రేక్షకుడు బెంబేలెత్తిపోయే పరిస్థితి క్రియేట్ చేసిందే ఇండస్ట్రీ… మేం ట్యాక్సులు కడుతున్నాం, మేం ఎంత సంపాదిస్తే మీకేంటి..? (10 నుంచి 4.5 తీసేస్తే 6.5 అనే కొత్త ఈక్వేషన్ కూడా చెప్పాడు…) అనే వాదన కూడా కుదరదు… అసలు హీరోల రెమ్యునరేషన్లు, వాటాలు, ఏరియా హక్కులు, ఆధిపత్యాలు, కథలపై పెత్తనాలే తెలుగు ఇండస్ట్రీకి శాపాలు అనే నిజం ఇప్పుడు అందరికీ తెలిసిన నిజం… దాని మీద కూడా ఇలాగే చర్చ జరగాలి…
- ఇడుపులపాయలో నేలమాళిగలు, డబ్బుమూటలు… అదెందుకు మాట్లాడరు, పొలిటికల్ అవినీతి, క్రిమినల్ పాలిటిక్స్ మీద డిబేట్లు కావాలంటున్నావు కదా పీకే… ఆ టైం వస్తే అదీ మాట్లాడుతుంది మీడియా… కాలగతిలో సమాజం, మీడియా చాలామంది కొట్టుకుపోవడాన్ని చూసింది… చూస్తుంది… జగన్ అలా కొట్టుకుపోయే రోజు వచ్చినప్పుడు ఎవరూ ఉపేక్షించరు… కాకపోతే జరిగేది, జరగాల్సింది పవన్ కల్యాణ్ కోణంలో, తను అనుకున్నప్పుడు, తను అనుకున్నట్టు జరగదు..!!
Share this Article