.
Ashok Kumar Vemulapalli....
ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా ?
పవన్ కళ్యాణ్ గారు నిన్ను రమ్మంటున్నారు అంటూ ఒకరోజు స్నేహితుడు అంజిబాబు ఫోన్ చేసారు .. పవన్ కళ్యాణ్ గారికి ఆయన మంచి సన్నిహితుడు..
ఆయన నన్నెందుకు రమ్మంటారు ? అసలు నేనెవరో కూడా బహుశా ఆయనకు తెలిసి ఉండదేమో కదా అన్నాను
ఏమో తెలీదు .. వస్తే అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు
Ads
అనేక సందేహాలతో .. అంజిబాబుతో కలిసి హైదరాబాద్ బయలుదేరాను ..
2018 లో.. విజయవాడ బ్యూరో చీఫ్ గా ఉన్న నేను కొన్ని కారణాల వల్ల టీవీ 9 కి రిజైన్ చేసాను .. నిజానికి అప్పుడు వేరే ఉద్యోగం వెదుక్కోకుండానే రిజైన్ చేసి ఖాళీగా ఉన్నాను .. ఒక విధంగా జీవితం గమనం ఎటో తెలీక .. డిప్రెషన్ లో కూడా ఉన్నాను.. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు ఆహ్వానం అంటే ఆశ్చర్యం అనిపించింది ..
ఎందుకు అయ్యుంటుంది ? ఏదైనా ఉద్యోగం ఇస్తారా ? లేక ఏదైనా ఛానెల్ కి నన్ను రికమండ్ చేస్తారా ? పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు . ఆ అవకాశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు .. అలాంటిది ఆయన నుంచి నాకు ఆహ్వానం అంటే నిజంగా ఆశ్చర్యమే నాకు .. పైగా అప్పటికే ఆయన తల్లిగారిని ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ తో ఆగ్రహంగా ఉన్న పవన్ గారు .. అప్పడు టీవీ 9 సహా కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు .. జనసేన వాట్సాప్ గ్రూపుల నుంచి నన్ను తప్పించేశారు కూడాను ..
అలాంటిది అదే ఛానెల్ లో పని చేసిన తనను ఎందుకు పిలిపించారు అని ..అనుకుంటుండగా .. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్న రోడ్డులో ఒక ఇంటికి తీసుకెళ్లాడు అంజిబాబు.
ఆ ఇల్లు చాలా నీట్ గా ఉంది .. ఎదురుగా గార్డెన్ తో చాలా ప్రశాంతంగా ఉంది .. కానీ ఆ ఇంట్లో ఫ్యామిలీ ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదు .. ఎవరి ఇల్లు ఇది అని అడిగితే ఇదే పవన్ సార్ గెస్ట్ హౌజ్ అన్నారు ..లోపలికి వెళ్ళగానే .. పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు , ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన అవార్డులు , బహుమతులు అన్నీ ఎదురుగా కనిపించాయి .. అప్పటికే హాల్లో .. లింగమనేని రమేష్ గారు , సాహితీ లక్ష్మీనారాయణ సోఫాల్లో ఉన్నారు..
ఎలా ఉన్నారు అని అడిగారు లింగమనేని రమేష్ .. ఆయనపై అప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో వైసిపి భూకబ్జా చక్రవర్తి అని ఆరోపిస్తోంది .. సాక్షిలో ఆయనపై వరుస కథనాలు రాస్తున్న సమయం అది .. అంతేగాక ఆయన ప్రారంభించిన ఎయిర్ కోస్తా ఎయిర్ లైన్స్ అప్పటికే మూతపడింది .. ఆ సందర్భంలో ఒకసారి ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను కూడా.. అప్పుడు అర్ధం అయింది .. పవన్ కళ్యాణ్ గారు నన్ను రమ్మని పిలవడం వెనుక ఆయన కారణం అయ్యి ఉంటారని ..
కొద్దిసేపటి తర్వాత పవన్ గారు నన్ను లోపలికి పిలిస్తే .. లింగమనేని రమేష్ నన్ను లోపలికి తీసుకెళ్ళి పవన్ గారికి పరిచయం చేసారు ..
నన్ను చూడగానే ఆయన ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే ఇప్పటికీ ఆయన చిరునవ్వు బాగా గుర్తు .. చాలా కాలం నుంచి పరిచయం వ్యక్తి మాదిరి నన్ను .. రండి కూర్చోండి అశోక్ అన్నారు ..
నేను ఆయన్ని నేరుగా చూడటం అదే మొదటిసారి .. అంతకుముందు సినిమాల్లో, ఎన్నికల ప్రచారం లో సభల్లో చూడటం తప్ప నేరుగా ఎప్పడు కలవలేదు .. ఆ అవకాశం కూడా రాలేదు .
ఏంటి విశేషాలు అంటూనే .. మీరు జాబ్ మానేశారంట కదా… లింగమనేని రమేష్ గారు , అంజిబాబు చెప్పారు అన్నారు.
అవును సార్ ..
మరి ఏమి చేద్దామను కుంటున్నారు ?
ప్రస్తుతానికి ఎలాంటి ప్లానింగ్ లేదండీ .. మళ్లీ ఏదో ఒక ఛానెల్లో జాబ్ వెదుక్కోవాలి
ఓకే.. అంటూనే నన్ను గమనిస్తూనే.. ఇతర విషయాల గురించి మాట్లాడారు.. అనేక అంశాల మీద ఆయనకు ఉన్న సబ్జెక్ట్ చూసి ఆశ్చర్యపోయాను
పైగా ఏ గర్వం అనేది ఇంతైనా లేకుండా .. ఒక సాధారణ వ్యక్తిలా ఆయన నాతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది
అసలు నేను మాట్లాడుతున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితోనేనా ? మెగాస్టార్ తమ్ముడుతోనేనా? జనసేన పార్టీ అధినేత తోనేనా అని .. అసలు ఇదంతా నిజమా లేక డెల్ట్యూషనా ? అని డౌట్ పడుతూనే ఆయనతో మాట్లాడుతున్నాను.
మేడం పిల్లలు ఇక్కడే ఉంటారా సర్ ?
లేదు ..ఇది నా పర్సనల్ గెస్ట్ హౌజ్ .. కేవలం చదువుకోవడానికే ఇక్కడికి వస్తుంటాను .. అంటూ ఆ గదిలో ఉన్న తన పుస్తకాలను చూపించారు.
ఇలా మాట్లాడుతుండగానే సడెన్ గా ఆయన . అశోక్,మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు ? అన్నారు
అసలే ఉద్యోగం మానేసి నెల జీతం లేక .. విపరీతమైన బాధలో ఉన్న నాకు ఆయన్ని కలవడమే పెద్ద విషయం అనుకుంటే .. పోనీ ఆయన్ని కలిస్తే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తారేమో అనుకుంటున్న తరుణంలో .. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి ? పైగా అంతా స్థాయి వ్యక్తి నాకు ఆఫర్ ఇవ్వడం ఏంటి ? ఇదంతా నిజమేనా ? అనుకుంటూ ఆలోచిస్తుంటే ..
మీరు విన్నది నిజమే, ఈ ఎలక్షన్స్ లో నేను మెజార్టీ సీట్లు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని , చదువుకున్న యువకులకు ఇవ్వాలనుకుంటున్నాను .. రాజకీయాలు మారాలి .. యువతరం రావాలి .. మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి .. రాజకీయ వ్యవస్థని మార్చాలి .. జనానికి మంచి చేయాలి .. ఈ సిస్టం మార్చాలి .. అందుకే నేను మీలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను .
సర్ .. నాకు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేవు .. కనీసం తిరగడానికి కారు కూడా లేదు .. TV9 లో ఉన్నపుడు మొన్నటి వరకు 50 వేల జీతం వచ్చేది .. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది .. అలాంటి నేను రాజకీయాల్లో ఎలా పోటీ చేయగలను? ఎన్నికల్లో నిలబడటం అంటే మాటలా ? కోట్లు కావాలి సర్ .. నా దగ్గర ఒంటిమీద వేసుకునే కోటు కూడా లేదు
రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు కావాలని ఎవరు చెప్పారు ? కోట్లు ఉంటేనే గెలుస్తారని ఎవరన్నారు .. డబ్బు లేకుండా రాజకీయం చేయాలి .. కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనే కల్చర్ మారాలి .. ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి.
మీకు కావాల్సిన ఏర్పాట్లు పార్టీ చూసుకుంటుంది .. నేను మీరు పోటీ చేసే నియోజకవర్గంలో అవసరమైతే రెండు సార్లు పర్యటిస్తాను.. సభలు పెడదాం .. మీరు విజయవాడ సెంట్రల్ లేదా ఈస్ట్ , పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల్లో ఏదైనా ఎంచుకోండి ..
నేను ఆయనకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు ..
నాకు కొద్దిగా టైం ఇస్తారా ? ఆలోచించుకుంటాను .. అన్నాను
సరే.. మీకు కావాల్సినంత టైం తీసుకోండి.. కానీ వెనక్కి తగ్గకండి ఏమీ ఆలోచించకండి .. మీకు మంచి భవిష్యత్ ఉంటుంది .. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకే .. గెలవకపోతే ఎక్స్ పీరియన్స్ వస్తుంది .. జనాల నాడి తెలుస్తుంది .. అంటూ కుర్చీలోంచి లేచారు ..
సరేనని ఆయనకు నమస్కారం పెట్టి బయటకు వచ్చాను .. అప్పటికే అంజిబాబు , లింగమనేని రమేష్ నవ్వుతూ నాకోసం చూస్తున్నారు. ఏకంగా రెండు గంటలు పాటు మీరిద్దరూ ఏమి మాట్లాడారు అన్నారు లింగమనేని.
నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నారు పవన్ సర్ అన్నాను.
అవునా.. నిజమా ? బంపర్ ఆఫర్ కొట్టేసావు అంటూ చప్పట్లు కొడుతున్నాడు అంజిబాబు
ఆయనది మంచి ఆలోచన.. ఏమీ ఆలోచించకుండా రంగంలోకి దిగిపోండి .. మీ భవిష్యత్ అంతా ఆయన చూసుకుంటారు అని అంటున్నారు లింగమనేని.. బయటకు వచ్చాక గుర్తొచ్చింది ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోలేకపోయానే అని …
(కానీ ఆయన అంతా అద్భుతమైన అవకాశం ఇచ్చినప్పటికీ నేను వినియోగించుకోలేదు .. ఒక నెలరోజుల పాటు జనసేన పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్ వర్క్ కొంత చేసాను.. మధ్యలో మరో రెండు సార్లు పవన్ గారిని కలిశాను .. ఆయన అప్పజెప్పిన ఒక అసైన్మెంట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను..
మీరు నాకు ఎవరికీ దక్కని అవకాశం ఇచ్చారు కానీ నేను రాజకీయాలకు సెట్ అవ్వను .. నా మనస్తత్వం వేరు.. నా ఆలోచన వేరు .. రాజకీయాల్లో చాలా ఓర్పు, సహనం కావాలి, నాకు అవి లేవు .. నన్ను క్షమించండి అని చివరి సారి ఆయన్ని కలిసినప్పుడు ఆయనకు చెప్పాను..
పొగరుతోనో మరే కారణాలతోనో నేను ఆ మాట అనలేదు.. నా కారణాలు నాకున్నాయి.. అంతటి స్థాయి వ్యక్తి కోట్లమంది అభిమానులున్న స్టార్ ని కలవడమే అదృష్టం అయితే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అనడం.. ఈ జన్మకి నేను మర్చిపోలేని గొప్ప విషయం .
ఆ తర్వాత నేను NTV నరేంద్ర చౌదరి గారు ఇచ్చిన అవకాశంతో ఆ ఛానెల్లో చేరి కొద్ది రోజుల తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఒక ఫంక్షన్ హాల్ ఇంటర్వ్యూ చేశాను .. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినపుడు ఆయన నన్ను చూసి ఎమ్మెల్యేగా ప్రచారం చేయాల్సిన వారు .. మళ్లీ మైక్ పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారా.. అని నవ్వారు .. )
Share this Article