కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడు, ఇక దిగడమే ఎక్కే నిచ్చెనలేమీ లేనప్పుడు… రిటైర్మెంట్ ప్రకటించగలవాడు, ఆ దశను గుర్తించగలవాడు గొప్పోడు… రాజకీయాలు గానీ, సినిమాలు గానీ, క్రికెట్ గానీ… అది ఏరంగమైనా సరే, ఇక మనం గుదిబండలం కాబోతున్నాం అనే స్పృహ తెలిసినవాడే గొప్పోడు… లేదంటే జనమే తిరస్కరిస్తారు… అది ఏ రేంజ్ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది… సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంకా ఆ సోయి రాలేదు… ఒకవైపు అదే తమిళంలో జైభీమ్ వంటి మంచి మంచి ప్రయోగాత్మక, జన ప్రయోజనాత్మక సినిమాలు పురుడు పోసుకుంటూ చప్పట్లు కొట్టించుకుంటూ ఉంటే… ఈ వయసులో అలాంటి పాత్రల పోషణతో మరింత పేరు తెచ్చుకోవాల్సింది పోయి… అవే ఇమేజ్, అవే ఫార్ములా, అవే రొటీన్, అవే పిచ్చి కథలు, అవే తిక్క పంచులు, అవే సూపర్ హీరోయిజంతో చెలామణీ కావాలనుకోవడం తన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది… జైభీమ్ 1990 నాటి ఒక రియల్ పాథటిక్ కేస్‌తో రాజ్యం కృయాలిటీని అద్భుతంగా కళ్ళ ముందు ఉంచితే, రజినీ తాజా సినిమా పెద్దన్న 1990 నాటి సినిమాల ఓవర్ మెలోడ్రామాను, బూజుపట్టిన పాత చింతకాయ పచ్చడిని వాసన చూపించింది…
నిజానికి తనకు ఈ వయస్సులో ఈ పాత్రలు అవసరమా..? తనకు ఏం తక్కువైందని..? ఈమధ్యే దాదా సాహెబ్ ఫాల్కే కిరీటం కూడా పెట్టింది ప్రభుత్వం… ఇంకా ఎందుకు దాదా ఈ ప్రయాస…? తరచూ హాస్పిటళ్లకు వెళ్తూ, అవస్థలు పడుతూ, లేస్తూ, ఇలాంటి ఫార్ములా సినిమాలతో ఎవరిని ఉద్దరించడానికి..? ఒక దశ వచ్చాక కూడా మనిషికి ఇంకా ఈ ఆస్తులు, సంపాదన, ఆర్టిఫిషియల్ పాపులారిటీల మీద ఆశలు కరెక్టేనా..? తరచూ హిమాలయాలకు వెళ్లినా ఆత్మమథనంలో కర్తవ్యమేదీ సాక్షాత్కరించలేదా..? పోనీ, అలరిస్తున్నాడా..? అసలు ఎన్ని ఏళ్లయింది ఒక హిట్ కొట్టక… రోబో తరువాత, అంటే పదకొండేళ్లలో రజినీ రేంజ్ హిట్ ఏది..? మధ్యలో కబాలి, కాలా కథాంశాల ఎంపిక కాస్త బాగున్నట్టనిపించినా ఈ పెద్దన్న సినిమాతో జర్రున ఒక్కసారిగా చాలా దిగువకు జారిపోయాడు… (హేమిటో, గతంలో ఎన్టీయార్, ఏఎన్నార్ తదితరులు కుర్ర వేషాలు వేస్తుంటే తెర మీద చిరాకేసేది… ఇప్పుడూ అంతే, వదలరు… చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, కమల్‌హాసన్, రజినీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి ఎట్సెట్రా ఎందరో… ఏజ్ బార్ తారలతో దక్షిణ వెండి తెర బరువుగా వంగిపోతోంది…)
Ads
పెద్దన్న సినిమా సంగతికొస్తే ఓ పెదరాయుడు… ఓ చెల్లెలు… ఆమె అంటే ప్రేమ, ఏదైనా చేయగల అభిమానం… హీరోయిజం… అబ్బో, ఎన్ని సినిమాల్లో చూశాం ఈ కథల్ని… ఈ వేషాల్ని…! ఫాఫం, మహానటి కీర్తిసురేష్ ఇలాంటి పాత్రల్ని ఇలాగే అంగీకరిస్తే మహానటి కాస్తా చెల్లెలి పాత్రల్లోకి ఓ మామూలునటిలా జారిపోవడం చూస్తాం… (చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించడానికి సాయిపల్లవి ఎందుకు ఒప్పుకోలేదో కీర్తి సురేష్‌కు బహుశా అర్థమై ఉండదు…) తెర మీద నయనతార ప్రజెన్స్ ఇప్పటికీ బాగుంది, కానీ ఈ కథలోనే ఆమె మెరవడానికి స్కోప్ లేదు… ఇక మీనా, ఖుష్బూ కామెడీ చూస్తే మరో తల్నొప్పి… ఈ సినిమా వాళ్లకు ఈమధ్య కామెడీ ట్రాక్ అంటే మరీ కామెడీ అయిపోయిందబ్బా…!! అదే వేషం, అదే లుక్కు, మొహంలో అదే వీసమెత్తు మారని ఫీల్… ఈ జగపతిబాబు ఇక మారడు… కాదు, కాదు… మారలేడు..! ప్రకాష్‌రాజ్ మంచి నటుడే కావచ్చుగాక, కానీ ప్రతి సినిమాలోనూ అవేతరహా పాత్రలు… చూసేవాడికి కూడా మరీ మొనాటనీ వచ్చేసింది… ఇక సినిమా కథా-కాకరకాయ, సమీక్ష-తొక్కాతోలూ గురించి మిగతా విషయాలు, వివరణలూ, విశ్లేషణలూ అక్కర్లేదు…!! ఈ దర్శకుడు ఒకటి మరిచిపోయాడు, సినిమా చివరలో తన పాదాల్ని గనుక చూపించి ఉంటే, ప్రేక్షకులు ఓ పెద్ద దండం పెట్టి, ఓ భారీ నిట్టూర్పు విడిచి వచ్చేవాళ్లు కదా…!!!
Share this Article