.
అదేమిటి, కమెడియన్ హీరో కాకూడదా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కష్టం… మొదట్లో కమెడియన్‌గా చేసి, హీరోగా స్థిరపడిన నటులు తెలుగులో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు… కానీ ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ కష్టం…
ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అని ఓ సినిమా వచ్చింది… అందులో హీరో అనలేను గానీ, కథానాయకుడి పాత్రను సప్తగిరి పోషించాడు… కాస్త హీరోయిజం పోకడలుండాలి, తనకు అలవాటైన కామెడీ ఉండాలి, తగినట్టుగానే కథ ఉండాలి… అదే అనుకున్నారు పాపం సప్తగిరి, నిర్మాత, దర్శకుడు ఎట్సెట్రా…
Ads
మనవాళ్లు ఎలాగూ కథలో ప్రయోగాలు చేయరు, సాహసించరు, టేస్ట్ లేదు… కనీసం బాగా పాతబడిపోయిన పాత చింతకాయనైనా కాస్త కొత్తగా ప్రజెంట్ చేస్తారా అంటే అదీ చేతకాదు… ఈ సినిమా మరో ఉదాహరణ…
జబర్దస్త్ స్కిట్ చూస్తున్నట్టు… శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నట్టు… కాస్త అక్కడక్కడా తెలుగు పిచ్చి సీరియళ్లు చూస్తున్నట్టు… ఆ క్లైమాక్స్ కూడా అంతే… హఠాత్తుగా తెలుగు సీరియల్ ఆపేస్తే చివరి ఎపిసోడ్ చూశారా ఎప్పుడైనా..? సేమ్, ఈ సినిమా క్లైమాక్స్‌లాగే…
పెళ్లి కాని ప్రసాద్ అనగానే మనకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి గుర్తొస్తుంది… ఫాఫం, కత్రినా కైఫ్ బదులు ఏ నటిని పెట్టుకున్నా హిట్టయ్యేది… ఈరోజుకూ టీవీల్లో వస్తుంటే చూడబుద్దవుతుంది… ఇంకొందరూ ఇలాంటి పాత్రలు చేశారు… వెరీ ఓల్డ్ కాన్సెప్ట్…
పోనీ, ప్రజెంటేషన్ ఏమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు… కట్నం మీద పిచ్చి నమ్మకాల తండ్రి, 36 ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాదు… విదేశాల్లో సెటిలయ్యే పిచ్చి ఉన్న కథానాయిక… ఫ్యామిలీతో సహా… ఈ కథానాయకుడికి లైనేసి, ముగ్గులోకి దింపి, పెళ్లికి ఒప్పించాక… తీరా నేను ఇండియాలో ఉండిపోతాను అంటాడు సప్తగిరి…
తరువాత ఏమైంది..? పెద్ద ఆసక్తి కలిగించదు… కామెడీ అక్కడక్కడా వోకే అనిపించినా ఓవరాల్‌గా సినిమా ఈకాలానికి తగినట్టు లేదు… సంగీతం అంతే… దర్శకత్వ మెళకువలూ అంతంతమాత్రమే… కథానాయిక పాత్ర చుట్టే కథ తిరుగుతుంది, కానీ ఆ పాత్ర పోషించిన ప్రియాంక శర్మ సో సో…
ఆ తండ్రి పాత్ర పోషించిన నటుడే కాస్త బెటర్… మిగతావాళ్లు ఉన్నారంటే ఉన్నారు, సీన్లలోకి వస్తుంటారు, పోతుంటారు… కాసేపటికి మనమూ థియేటర్ వీడి బయటికి వెళ్లిపోతాం… ఇక చాల్లేరా బాబూ అనుకుంటూ… చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అనే కఠిన ధోరణికి కట్టుబడి ఉన్నవాళ్లకూ ఉసూరుమనిపించే సినిమా…!!
సప్తగిరి ఎలా చేశాడు అంటారా..? తనకు కామెడీ టైమింగ్ బాగా తెలుసు… అలవోకగా చేసిపడేశాడు… తనకు ఈ కథ, ఈ పాత్ర ఏమైనా పరీక్ష పెడితే కదా, ఇంకేదైనా అంచనా వేసి చెప్పడానికి..!!
Share this Article