Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కరవు కన్నీటి పెన్నలో నేడు జీవజలం హోరు… శుష్క పెన్న కాదు జలసంపన్న …

February 21, 2024 by M S R

నాడు పెన్నేటి బాధ – నేడు పన్నీటి పాట

నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు అనంతపురం జిల్లా. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పెన్నేటి పాట ప్రారంభంలో ఉన్న రెండు మూడు పద్యాలు విన్నప్పుడు రాసిందెవరో, ఎందుకు రాశారో తెలియదు.

అదేదో రాయలసీమ సిగ్నేచర్ ట్యూన్ అనుకుని తెగ ఉత్సాహంగా పాడుకునేవాడిని. దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లు…ఇదే పెన్న…ఇదే పెన్న…నిదానించు నడు…విదారించునెదన్ పెన్నేటి పాట రాయలసీమ జనగీతం అనుకుని అర్థం తెలియకపోయినా…పదే పదే అదే పాడుకునేవాడిని. అదొక విషాద కావ్యమని నాకు తెలుగు, సంస్కృతం వ్యాకరణం పాఠాలు చెప్పిన కర్రా వెంకట సుబ్రహ్మణ్యం సార్ చెప్పేవరకు తెలియలేదు.

Ads

ఆ క్షణం నుండి విషాదాన్నే ఒక సిగ్నేచర్ ట్యూన్ గా ఆరాధిస్తున్న లక్షల మంది రాయలసీమ వాసుల్లో నేనూ ఒకడిని అయ్యాను. అర్థం తెలిశాక ఎవరయినా విద్వాన్ విశ్వంను ఆరాధించకుండా ఉండలేరు. గుండెలు మెలిపెట్టే ఒక మహా విషాదానికి, నైరాశ్యానికి, నిర్వేదానికి, నీరింకిన కళ్లకు, ఆశలు ఉడిగిన మనసులకు, బాసలు మిగిలిన మనుషులకు పెన్నేటి పాట ఒక ప్రతిబింబం.

కరువుతీరా ఏడవడానికి కూడా వీల్లేని ఎడారి బతుకుల కరువు మాటున నలిగే జీవితాలకు ప్రతిరూపం పెన్నేటి పాట. అత్యంత సంపన్నులను కూడా అడుక్కుతినేలా చేసి…ఆత్మాభిమానాన్ని బజారుపాలు చేసే కరువు కాఠిన్యానికి అక్షర రూపం పెన్నేటి పాట. రాయలసీమ కోటిగొంతుల విషాద జీర పెన్నేటి పాట.

ఇప్పుడు నా వయసు 55. పెన్నలో ఆడుకున్నాము. పాడుకున్నాము. నీటి చుక్క లేని పెన్న కాలువ ఇసుక మీదే కూర్చుని పెన్నేటి పాట పద్యాలు గొంతు తడారిపోయే వరకు చెప్పుకున్నాము. నీరు మరిచిన పెన్న మీద వందల ఊళ్లు పుట్టుకొచ్చాయి. లేదా నీళ్లు రానేరావనుకుని ఊళ్లు పెన్న ఒడిలోకి చేరాయి. నాకు ఊహ తెలిసినప్పటినుండి పెన్నలో ఒక్కసారి నీళ్లు పారితే హిందూపురం పక్కన సేవామందిరం దగ్గర అయిదారు రోజులు నీళ్లల్లోనే ఉన్నాము. మోకాటి లోతు వరకు పెన్న కాలువలోకి దిగి అదేదో ప్రపంచ వింతల్లో ఒక వింతను చూస్తున్నట్లు ఒళ్లు మరిచి గంతులేశాము.

ఈమధ్య నాలుగయిదేళ్ళుగా పెన్న వరద, పెన్న పొంగు వార్తలతో పెన్నా తీరం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తన దశాబ్దాల తత్వానికి భిన్నంగా పెన్న ఊళ్లను ముంచెత్తుతోంది. పంటలను మింగేస్తోంది. డ్యామ్ గేట్లను పగులగొట్టి కడలి తీరానికి పరుగులు పెడుతోంది.

రాదనుకున్న పెన్న వస్తోంది. వచ్చిన పెన్న వెళ్లడానికి కాలువల దారుల్లేక ఊళ్లల్లోనే ఉండిపోతోంది. నా ఏట్లో మీరెందుకు ఇళ్లు కట్టుకున్నారు? అని పెన్న అడుగుతోంది. నువ్ రాక బతుకు ఏటిపాలు అయినప్పుడు ఏట్లో ఉండక ఇంకెక్కడ ఉంటాం? అని అక్కడున్నవారు పెన్నను నిలదీస్తున్నారు.  వారిని వెళ్లిపోండి అని పెన్న కన్నెర్ర చేసి గట్టిగా అనలేదు. ఇక ప్రతి ఏటా ఖచ్చితంగా ఇలాగే వస్తావా? అని పెన్న మెడ పట్టుకుని వీరు గట్టిగా అడగనూ లేరు. ఇదొక అతివృష్టి- అనావృష్టి సమస్య.

నిజంగా ఏటేటా క్రమం తప్పకుండా పెన్న ఇలాగే వస్తే…
“కండలేక ఎండిపోయి బెండువారినా…
తిండి లేక, తుండు లేక బండవారినా…”
అని కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ రాయలసీమ పెన్నేటి విషాద గీతాలను పాడాల్సిన పని ఉండదు.

నాలుగు రోజులుగా అనంతపురం, పెనుగొండ, హిందూపురం, మడకశిర, హేమావతి, లేపాక్షి, కొడికొండల్లో తిరుగుతున్నా. బండలు పగిలే ఎండల్లో సైతం నీటి తళతళలతో కళకళలాడే చెరువులు, ఆ నీటిలో విచ్చుకున్న తామరాకులను చూడడానికి నాకు రెండు కళ్లు చాలడం లేదు. కరువు కన్నీటి పెన్నేటి పాటలు చెవి మరుగై…పన్నీటి జలకాల పెన్నేటి పాటల రోజులొచ్చాయి. నెర్రెలు చీలిన సీమ నేలలు కనుమరుగై… పుడమి తల్లి పచ్చని పొలాల పట్టు చీర కట్టుకుని పైరగాలులతో పరవశ గీతం పాడుతోంది.

నీరింకిన పెన్నేటిని చూడలేక… విద్వాన్ విశ్వం గుండెలు బాదుకుంటే- నాడు “పెన్నేటి పాట” అయ్యింది. నీరు నిండిన పెన్నేటిని చూసి…గుండె పొంగి…ఏ విశ్వమో ఇప్పుడు కలం కదిలిస్తే పెన్న కన్నీరు తుడిచిన “పన్నీటి పాట” అవుతుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions