దేవుడిని మనిషి సృష్టించాడా..? మనిషిని దేవుడు సృష్టించాడా..? అసలు దేవుడంటే ఎవరు..? మన పుట్టుకకు పరమార్థం ఏమిటి..? జన్మంతా తపస్సు చేసినా మనకు సమాధానం కష్టం… పెద్ద పెద్ద రుషులు ఏళ్ల తరబడి ఏ హిమాలయాల గుహల్లోనో తలకిందులుగా వేలాడినా జవాబు దొరకడం లేదు… అంతటి సంక్లిష్టమైన ప్రశ్నలు ఇవి… కొన్నేళ్లుగా గమనిస్తే గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది… అంటే జనంలో భక్తి బాగా పెరుగుతున్నట్టేనా..? దేవుడిని నమ్మనివాళ్ల సంఖ్య తగ్గిపోతున్నట్టేనా..? గతంకన్నా ఇప్పుడు ప్రముఖ ప్రార్థనాలయాలకు రవాణా సౌకర్యాలు, ఆయాచోట్ల వసతి సౌకర్యాలు పెరిగాయి కాబట్టి మతపర్యాటకం పెరిగిందని అనుకోవాలా..? లేక నిజంగానే జనంలో దేవుడి మీద నమ్మకం పెరిగిందా..? ఈ విశ్లేషణ కూడా కష్టమే… కానీ గూగుల్ వాడు ఏమంటాడంటే..? నాస్తికత్వం మీద జనం ఇంట్రస్టు గతంలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది అంటున్నాడు… అంటే దేవుడి ఉనికిని నమ్మనివాళ్ల సంఖ్య ఘోరంగా పడిపోతోందని అనలైజ్ చేస్తున్నాడు… మళ్లీ ఇదో చిక్కు ప్రశ్న…
నాస్తికుడు లేదా నాస్తికత్వం… దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోతే, దాన్ని దేవుడి మీద విశ్వాసం పెరుగుతున్నట్టుగా భావించవచ్చా..? అంటే విశ్వాసుల సంఖ్య పెరుగుతున్నట్టా..? గూగుల్ ట్రెండ్స్ వెబ్‌సైట్ వాడు ఏమంటాడంటే..? ఫలానా మతం, ఫలానా ప్రాంతం, ఫలానా భాష అనే తేడా ఏమీ లేదు… అసలు నాస్తికత్వం మీద గతంలో ఉన్నంత ఆసక్తే ఇప్పుడు లేదు… దానికి 2004 నుంచి ఇప్పటివరకూ కనిపించిన ట్రెండ్ మీద రకరకాల గ్రాఫులు, నిదర్శనాలు జతచేస్తూ పెద్ద స్టోరీయే ఇచ్చాడు… నిజానికి వర్తమానజీవనంలో పెరుగుతున్న ఈతిబాధలు, కష్టాలు అనివార్యంగా మనిషిని ‘‘అంతా ఆ దేవుడే చూసుకుంటాడు’’ అనే ఓ భావన వైపు నెట్టేస్తున్నాయా..? దాన్నొక అండగా పరిగణిస్తున్నాడా..? అదొక ఉపశమనం, అదొక స్ట్రెస్ బస్టర్, అదొక రిలీఫ్, అదే బిలీఫ్… ఇలా విశ్లేషించుకోవాలా..?
Ads
ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం మీద ఆసక్తి, గూగుల్ సెర్చింగు ఎంత తగ్గిపోయిందంటే… ఈ గ్రాఫ్ చూడండి…
గతంలో ఎప్పుడూ లేనంతగా పడిపోయింది… కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయి, మనిషి తన మీద తానే విశ్వాసం కోల్పోయి… దేవుడి ఉనికిని విశ్వసించే, అంగీకరించే స్థితికి చేరుకుంటున్నాడా…? అనేకానేక మతాల వాళ్లు చేరే అమెరికా ట్రెండ్ పరిశీలిస్తే, అక్కడా అంతే… నాస్తికత్వం గురించి తెలుసుకోవడానికే జనం ఇష్టపడటం లేదు… అంటే మొత్తం తెలిసిపోయిందని కాదు, తెలుసుకోవాలని లేదు… ఈ గ్రాఫ్ చూడండి ఓసారి..,
మతం, దేవుడు ప్రబలంగా సామాజిక జీవనం మీద ప్రభావం చూపించే పాకిస్థాన్ వంటి మతదేశాల్లో సహజంగానే నాస్తికత్వం మీద సెర్చింగ్ ట్రెండ్ బలహీనంగా ఉంటుంది… కానీ భిన్న మతాలు భిన్న ప్రభావాల్ని చూపించే ఇండియా వంటి సెక్యులర్ దేశాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తున్న తీరు ఓ విశేషమే… ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2004-2006 నడుమ నాస్తికత్వం మీద ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగింది… కానీ ప్రతిచోటా అది 2015 నుంచి ఘోరంగా పడిపోయింది… ఇప్పుడు మరీ లోయెస్ట్ ట్రెండ్… కష్టాల కొలిమిలో ప్రపంచం కాలిపోతున్నప్పుడు తప్ప, మనిషికి దేవుడి ఉనికి గుర్తుకురాదా..? అంతేనా..?!
Share this Article