ఆహా ఓటీటీలో శ్రీముఖి హోస్టుగా చెఫ్ మంత్ర అని ఓ కొత్త ప్రోగ్రాం రాబోతోంది… ఏముంది లెండి, సింపుల్‌గా చెప్పాలంటే ఇంకో వంటలక్క… ఆ పోస్టర్ చూడగానే ఓసారి నవ్వొచ్చింది… ‘‘ఒరేయ్ బాబూ, యాంకర్ల మొహాలు చూసి, జడ్జిలను చూసి ప్రేక్షకులు వంటల ప్రోగ్రాములను చూడరుర భయ్, వంటలు సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి, వంటల పోటీ తీరు ఆకట్టుకునేలా ఉండాలి… అంతేతప్ప, తమన్నాను పెడితే ప్రోగ్రాం క్లిక్ కాదు, ఆమె ఫ్లాప్ అయ్యిందని అనసూయను పెట్టగానే జనం విరగబడరు..’’ అని గట్టిగా చెప్పాలనుంది… నిజం కూడా అదే… తమన్నాను తీసిపారేసి, పరిహారం కేసులు వేస్తామనే లీకులిచ్చి, జెమిని టీవీవాడు మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకు అనసూయను హోస్ట్‌గా చేశాక దాని రేటింగ్స్ మరింత దిగజారిపోయినయ్… అంటే లోపం ఎక్కడుంది..? ఆ వంటల పోటీ ఫార్మాటే తప్పు అని అర్థం… నిజానికి ఈ ఓటీటీలు, టీవీల క్రియేటివ్ టీంలతో ఇదే సమస్య, వ్యూయర్స్ టేస్ట్ తెలియదు, తమ ఆలోచనలకు తగ్గట్టు ప్రేక్షకుడు టేస్ట్ మార్చుకోవాలి అనుకుంటారు… అదీ అసలు జాఢ్యం…
ఇదే ఆహా వాళ్లు ఇంతకుముందు వంటల ప్రోగ్రాములు ట్రై చేయకపోలేదు… కానీ తుస్సు… అంతెందుకు అంతటి సీనియర్ సుమ కూడా ఎవరెవరో సెలబ్రిటీలను పిలిచి ఏవేవో వంటల వీడియోలు చేసింది, డబుల్ తుస్సు… ఇప్పుడు ఆహా కొత్త వంట కూడా అంతే… రొటీన్ ఫార్ములాలో వంటలు చేయిస్తే ఎవడూ దేకడు… అది గుర్తుంచుకుంటే సరి… శ్రీముఖి పుష్టిగా కనిపిస్తోంది కదాని చూడరు… అయితే నిజంగా వంటల ప్రోగ్రాములకు ఆదరణ లేదా..? ఉంది…! బ్రహ్మాండంగా ఉంది… అసలు స్ట్రీట్ ఫుడ్ వీడియోలదే యూట్యూబులో రాజ్యం… బోలెడుమంది వంటల వీడియోలు పెట్టేవాళ్లున్నారు… బాగా క్లిక్కవుతున్నయ్ కూడా… కడుపు చేత్తో పట్టుకుని కోట్ల మంది దేశం విడిచి, వివిధ దేశాలు చేరాక నిజానికి వీటి అవసరం కూడా బాగా పెరిగింది… చదువు అయిపోయేవరకు నేటి యువతకు వంట తెలియదు, కిచెన్ వైపు వెళ్లరు, తీరా ఎక్కడికో వలసపోయాక చేతులు కాల్చుకుంటూ, తినీతినక, ఎలా వండుకోవాలో తెలియక, ఏదో హడావుడిగా నేర్చుకున్న అరకొర వంటలతోనే కాలం గడిపేస్తుంటారు… వాళ్లకు కావల్సింది తక్కువ సరుకులతో వేగంగా, రుచిగా చేసుకునే వంటలు… అవీ తెలిసిన వంటలు, స్టార్ హోటళ్లలో కనిపించే రుచీపచీ లేని, నోరు తిరగని, పేరు తెలియని చెత్త డిష్‌లు కాదు…
Ads
దాదాపు పదేళ్ల నుంచి వంటల వీడియోలు పెట్టే తుమ్మ సంజయ్ బాగా పాపులర్… కానీ మొనాటనీ వచ్చేసింది… తన వీడియోలకు వ్యూస్ ఘోరంగా పడిపోయినయ్… మా ఫామ్ హౌజులో వండిన వంకాయలతో మసాలా కూర అని వీడియో పెడితే ఎవరికి కావాలి..? ఒక సక్సెస్ స్టోరీ చెప్పుకుందాం… టీవీలకు, ఓటీటీలకు, సెలబ్రిటీలకు చేతకాని వీడియోలు… అసలు వంటల వీడియోలు ఎలా ఉండాలో చెప్పే స్టోరీ… యూట్యూబ్‌లో విస్మయ్ ఫుడ్స్ (#vismayifood) అనే చానెల్ ఉంది… నడిపించేది పరుచూరి తేజ… (తెలంగాణ టుడే పత్రికలో వచ్చింది తన స్టోరీ)… ఒక సంగతి నమ్ముతారా..? తను పెట్టిన రవ్వ లడ్డు వీడియోకు ఏకంగా కోటి వ్యూస్… ఎస్… నిజమే… 50, 60, 70 లక్షల దాకా వ్యూస్ కనిపించే వీడియోలు కూడా… దధ్యోజనం, పులిహోర, పప్పుచారు, పొంగల్ వంటి డిష్‌లు కూడా సూపర్ సక్సెస్… అందరికీ తెలిసినవే అయినా ఎందుకీ పాపులారిటీ…
నాణ్యత ఉంటుంది కాబట్టి, జాగ్రత్తలు చెబుతాడు కాబట్టి, మెళకువలు నేర్పిస్తాడు కాబట్టి, అనవసర అట్టహాసాలు లేకుండా నేరుగా వంట గురించి చెప్పడంపై మాత్రమే కాన్సంట్రేట్ చేస్తాడు కాబట్టి… అంతెందుకు తన మొహం కూడా కనిపించనివ్వడు… జస్ట్, సరుకులు, వంటలు… 22 లక్షల దాకా సబ్‌స్క్రయిబర్స్… వెజ్ మంచూరియా వీడియోకు కోటీ ముప్ఫయ్ లక్షల వ్యూస్ ఉన్నయ్… అర్థమైంది కదా… అదీ వంటల వీడియోలకు ఉన్న క్రేజ్… తనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఫీల్డులో… ఎవరి రేంజ్ వాళ్లది… తేజ ఒక ఎగ్జాంపుల్… కష్టంగా అనిపించే డిష్‌లను కూడా సింపుల్ రెసిపీలు, ఈజీ రెసిపీలుగా మనం చేసి చూపించగలిగితే చాలు అంటాడు తేజ… తను హోటల్ వ్యాపారుల కుటుంబం నుంచి వచ్చాడుట… సో, తమన్నాలు, అనసూయల మొహాలు కాదుర భయ్.., వంటల తీరు ముఖ్యం… అవి బాగుంటే ఆహా అంటారు… లేకపోతే..? బోలెడన్ని వంటల షోలలో శ్రీముఖి షో మరొకటి… అంతే…!!
Share this Article