పైకి చెప్పేది ప్రేక్షకదేవుళ్లు అని..! ధోరణి మాత్రం నిండా గొరగడం..! పర్సులకు కత్తెర పెట్టడం… ప్రేక్షకుడంటే ఏమాత్రం గౌరవం లేదు, సొసైటీ మీద అవగాహన లేదు… మరి ఇలాంటోళ్లు తీసే సినిమాలు చెత్త గాక మరేమిటి..? దిక్కుమాలిన ఫార్ములా సినిమాలు తప్ప ఇంకేమిటి..? యథా నిర్మాత, తథా చిత్రము…
నాగవంశీ అనే ఘనమైన దర్శకరత్నం ప్రతి కుటుంబం ఒక సినిమాకు రూ. 1500 పెట్టలేరా అని ఏదో కూశాడు తెలుసు కదా… నెటిజనం కూడా ఆడుకుంటోంది బాగానే… గతంలో ఎవడో అన్నాడుట… గోధుమ రొట్టెలకు, అన్నానికీ డబ్బుల్లేకపోతే పిజ్జాలు, బర్గర్లు తిని బతకొచ్చు కదాని… నాగవంశీ అనే కేరక్టర్ అంతకుమించి..!
దర్శక రచయిత ప్రభాకర్ జైనీ ఏమంటాడంటే..?
Ads
‘‘ఒక మధ్య తరగతి కుటుంబ యజమాని, సిటీల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదిస్తాడు. అందులో పదివేలకు పైగా ఇంటి కిరాయికే పోతుంది. వెయ్యి రూపాయలు కరెంట్ బిల్లు, నీటి బిల్లుకే పోతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే వారి చదువుకు మినిమం మూడు నుండి నాలుగు వేలు అవుతుంది. మిగిలిన పది వేలల్లో నెలకు సరిపడా కిరాణా, పాలు, మందులు, కూరగాయలకు ఏడెనిమిది వేలు పోతుంది. తరువాత ఆఫీసుకు వెళ్ళి రావడానికి ఓ రెండు వేలు ఖర్చు.
ఇక పదిహేను వందలు పెట్టి సినిమాలు చూసే ధైర్యం చేయగలడా మధ్య తరగతి కుటుంబీకుడు. భారతదేశంలో సగటు ఆదాయం ఎంతో కూడా తెలియని అఙ్ఞాని. ఎవడిక్కావాలి 1500/ పెట్టి కొనుక్కునే వినోదం. కేబుల్ బిల్లు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు నీ సినిమాలు చూసి, నువ్వు హీరోకు ఇచ్చే యాభై, అరవై కోట్లు, 7 స్టార్ల విందులు వినోదాల కోసం, తన బిడ్డ నోటి ముందు నెలకోసారి పెట్టాలనుకున్న ఒక మంచి భోజనం ముద్ద, త్యాగం చేయాలా? ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు.
ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు బాధ్యతాయుతంగా ఉండాలి. అందరూ జూబ్లీ హిల్స్ లో నివాసముండరు మీలాగా! ఒక సినిమా పరిశ్రమకు చెందిన వాడిగానే చెబుతున్నాను. ఇంతకు ముందు కూడా మీరు ప్రేక్షకులనుద్దేశించి ‘వాడు వంద పెడితే మనం వాడికి వెయ్యి రూపాయల ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్నాం’ అని చులకనగా మాట్లాడారు… మీ సినిమాల్లో నటించే హీరోలేమో వేదికల మీద ‘ప్రేక్షకులే మా దేవుళ్ళు’ అని పదే పదే అంటుంటారు.
మీ కన్నా చాలా గొప్ప, పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఎప్పుడూ ప్రేక్షకులను చులకన చేసి మాట్లాడలేదు. దయచేసి గమనించండి. ప్రేక్షకులు చూస్తేనే మీ సినిమా ఆడేది!’’
ఈ పోస్టు మీద మణ్యం రామమోహన్‌రెడ్డి అనే మిత్రుడి కామెంట్… ‘‘స్కూలుకు వెళ్తోన్న కొడుక్కి కొత్త స్కూల్ బ్యాగ్ కొందామని… చాన్నాళ్ల నుంచి అనుకుంటూనే వున్నాడు… వాయిదా వేస్తున్నాడు… నాకు తెలిసిన ఒక తండ్రి… అలాంటి వారు వీడికి కనిపించరు. ఇంతకుముందు నాని అనే హీరో…. సినిమా టికెట్ల రేట్లు తక్కువ చేస్తే… ప్రేక్షకులను అవమానించినట్టే… అందుకే పెంచుతున్నాం… సినిమా థియేటర్ల యజమానులకన్నా… పక్కన ఉన్న కిరాణా వాళ్ళు ఎక్కువ సంపాయించుకుంటున్నారు… అని చెత్త వాగాడు…’’
Share this Article