అలోన్, ఒలవుం తీరవుం, బర్రోజ్, రామ్ (పార్ట్-1), రామ్ (పార్ట్-2), లిజోజోస్ మూవీ (పేరు పెట్టలేదు) , వివేక్ మూవీ (పేరు పెట్టలేదు), లూసిఫర్ సీక్వెన్స్ ఎంపురాన్… ఇలా మొత్తం పది సినిమాలు ఉన్నయ్ 62 ఏళ్ల మలయాళ వెటరన్ హీరో మోహన్‌లాల్ చేతిలో…! నిజానికి సినిమాల ఫ్యాక్టరీ అంటే అక్షయ్ కుమార్ పెట్టింది పేరు… హిట్టా, ఫ్లాపా అక్కర్లేదు… ఉత్పత్తి మాత్రం ఆగకూడదు…
కరోనాలు, విపత్తులు వాళ్లను ఆపవు… ఆపలేవు… మోహన్‌లాల్ కొడుకు కూడా హీరో, అయితేనేం, తనకే గిరాకీ… అసలు ఓ వెటరన్ హీరో చేతిలో ఇప్పటికిప్పుడు పది సినిమాలు ఉన్నాయంటే… అదీ ఫెయిల్యూర్లు చుట్టుముట్టిన వేళ… నిజంగా విశేషమే… అబ్బురం… దృశ్యం-2 తరువాత మరక్కర్ డిజాస్టర్… బ్రోడాడీ, ఆరాట్టు, 12 మ్యాన్ సినిమాలూ సోసో… రీసెంట్ మాన్‌స్టర్ డిజాస్టరే…
మనం అనుకుంటూ ఉంటాం… కొత్త నీరు వస్తోంది… పాత నీటికి కదలిక వస్తోంది… ఇంకా ఈ ముసలోళ్లను ప్రేక్షకులు చూడరు, తరం మారిపోవాల్సిందే… ఇలా… కానీ ఇది అందరికీ వర్తించదు… ఇమేజీ బిల్డప్పుల జోలికి పోకుండా, సినిమా కథకు దాసోహం అనే మోహన్‌లాల్ వంటి విధేయ హీరోలను ఇండస్ట్రీ వదులుకోవడం లేదు… తనకు భాషల తేడా కూడా లేదు… హిందీ, తెలుగు, కన్నడ, తమిళం… ఏదయినా చల్తా…
Ads
అంతెందుకు… ఇతర భాషల్లో మామూలు పాత్రలు పోషించడానికీ రెడీ… చేతినిండా పని కావాలి తనకు… గిరగిరా… చక్రం తిరుగుతూనే ఉండాలి… నిజంగా ఆ ఎనర్జీకి మొక్కాలి… తన సమకాలీనుడు మమ్ముట్టి చేతిలో కూడా నాలుగు సినిమాలున్నయ్ ఇప్పుడు… క్రిస్టోఫర్, నంపకల్ నీరత్తు మయక్కమ్, కడుగన్నవా ఒరు యాత్ర, కాథల్… ఒకవైపు కొడుకు దుల్కర్ సల్మాన్ హిట్ హీరో అయిపోయాడు… మమ్ముట్టి వయస్సు కూడా డెబ్భై దాటిపోయింది… ఐతేనేం, చేతిలో నాలుగు ప్రాజెక్టులు…
సో, ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు, కొత్త రక్తానికి, కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తూనే… ఆ ఇద్దరినీ పదిలంగా అక్కున చేర్చుకుని మలయాళ ఇండస్ట్రీ పనిచేయించుకుంటూనే ఉంది… ప్రేక్షకులు కూడా ఆదరిస్తూనే ఉన్నారు… బహుశా తెలుగులో చిరంజీవికి కూడా ఇదే స్పూర్తి కావచ్చు… ఒక్క చిరంజీవే కాదు, వెంకటేష్ ఎట్సెట్రా సీనియర్ల ధైర్యం కూడా వీళ్లే… అంతెందుకు..? ఏళ్లుగా రజినీ సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉన్నయ్… ఎంత హైప్ క్రియేట్ చేసినా సరే నడవడం లేదు… వయస్సు 70 దాటింది… ఐనా చేతిలో ప్రాజెక్టులున్నయ్, గిరాకీ ఉంది… లైకా ప్రొడక్షన్స్ వాళ్లు రెండు సినిమాలకు కలిపి 200 కోట్లు ఇస్తున్నారట… ప్రస్తుతం జైలర్ చేస్తున్నాడు…
తన సమకాలికుడు కమల్‌హాసన్ కూడా 67 ఏళ్లకు వచ్చాడు… స్టిల్ గిరాకీ ఉంది… మొన్నామధ్య తీసిన విక్రమ్ సూపర్ హిట్… ఇప్పుడు చేతిలో ఇండియన్-2 ప్రాజెక్టు ఉంది… 60 నుంచి 70 ఏళ్ల మధ్య ‘బద్దలు కట్టుకుని’ మరీ హీరోలుగా చేస్తున్నారు… జనం చూస్తూనే ఉన్నారు… సో, కొత్తరక్తం, పాతనీరు వంటి పాచిపోయిన మాటలు మాట్లాడకండి… జనం యంగ్ జనరేషన్‌ను ప్రేమిస్తున్నారు, అదేసమయంలో ఆ పాత తాతయ్యలనూ ఆదరిస్తున్నారు…!!
Share this Article