వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి…
పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… వాళ్లనే తీసుకొచ్చి నటింపజేశాడా అనే రేంజులో క్లిక్కవుతుంటాయి కొన్ని… ఇప్పుడు వ్యూహం పేరిట జగన్ రాజకీయ జీవితాన్ని, వైఎస్ మరణం నుంచి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం వరకూ జరిగిన పరిణామాలను సినిమాగా తీస్తున్నాడు కదా… సరే, తన కథాకథనాల్లో జీవం ఏనాడో చచ్చిపోయింది కానీ ఇప్పుడు సైతం ‘పాత్రలకు తగిన తారాగణం’ అనే అంశంలో తన ప్రతిభ చూపిస్తున్నాడు… వ్యూహం ప్రోమో చూస్తుంటే అర్థమయ్యేదీ అదే…
జగన్ గురించి, జగన్‌కు రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశించిన పెయిడ్ చిత్రం కాబట్టి సహజంగానే జగన్‌ను పైకెత్తి, జగన్ వ్యతిరేకుల మీద బాణాలు ఎక్కుపెడతాడు ఆర్జీవీ… సహజం కూడా… ఆ ప్రోమో చూస్తుంటే రోశయ్య, సోనియా, మన్మోహన్ పాత్రధారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఉంది… వాళ్ల వస్త్రధారణ, నడిచే తీరు అచ్చం వాళ్లనే పోలి ఉన్నాయి… ఇక ఆర్జీవీ ఎప్పుడూ ద్వేషించే పవన్ కల్యాణ్, చంద్రబాబు, చిరంజీవి ఎట్సెట్రా పాత్రల్ని కూడా తనదైన స్టయిల్‌లో చిత్రీకరించినట్టు కనిపిస్తోంది…
Ads
అక్కడెక్కడో హోటల్ వెయిటర్ కావచ్చు, పట్టుకొచ్చి చంద్రబాబులా గతంలోనే నటింపజేశాడు కదా, ఈ సినిమాలోనూ సదరు పాత్రధారి ఇంకాస్త బెటర్ పర్‌ఫామెన్స్ ఇచ్చినట్టుంది… రాష్ట్ర విభజన నేపథ్యాన్ని కూడా వర్మ చర్చించబోతున్నాడు… ఇక పవన్ కల్యాణ్ మీద పంచ్ మరీ పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా చాలా పదునుగా ఉంది… ఎప్పుడో ఒకసారి మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ చంద్రబాబును ఉద్దేశించి వినిపించింది… ఇందుకు చంద్రబాబు పాత్రధారి వ్యక్తి… ‘‘వాడికి అంత సీన్ లేదు.. తనను తానే పొడుచుకుంటాడు…’’ అని చెప్పడం చూడొచ్చు…
గతంలో కూడా వర్మ వైసీపీకి ఉపయోగపడేలా చిత్రాల్ని తీశాడు… లక్ష్మిపార్వతి కథ నేపథ్యంలో చంద్రబాబును బజారుకు లాగడం ఇందులో భాగమే… సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ గట్రా నిజంగానే ఒక పార్టీకి లేదా ఒక నాయకుడికి ఫాయిదా చేకూరుస్తాయా..? ఒక నాయకుడికి నష్టం తీసుకురాగలవా..? అనే ప్రశ్నలు డిబేటబుల్… అదేసమయంలో ఇలాంటివి ప్రజల్లో అనవసర రాజకీయ ఉద్రిక్తతలకూ కారణం అవుతాయి… అఫ్‌కోర్స్, ఏపీలో ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం నేపథ్యంలో ఆర్జీవీ పంచులు పెద్ద ప్రమాదకరం కావు…
ఇప్పుడు వివేకా హత్య కేసు ఏపీలో పెద్ద చర్చనీయాంశం… సీబీఐ దర్యాప్తు సాగుతోంది… ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో వర్మ ఏదో వాదనను తలకెత్తుకుంటే, అదీ జగన్ ఆలోచనలకు మద్దతుగా, ఏకపక్షంగా చిత్రీకరిస్తే దానికి చట్టపరమైన అడ్డంకులు ఉంటాయేమో బహుశా… ఎందుకంటే, అది ఇప్పుడు జుడిషియల్ మ్యాటర్… అన్నట్టు జగన్, భారతి పాత్రలకు కూడా ఆయా నటులు బాగానే నప్పారు..!
Share this Article