‘‘అయిపోయింది… ఇక ఈ దెబ్బకు యోగి ఆదిత్యనాథ్ పని మటాష్… గిలగిల కొట్టుకోవాల్సిందే… అంతే… 22 సుగంధాలతో సెంట్ తయారు చేయించేశా… మంచి పేరు కూడా పెట్టేశా… సెంట్ ఆఫ్ సోషలిజం… జస్ట్, ఇలా పూసుకుంటే చాలు, ఎంతటి ఛాందసవాదైనా సరే, సోషలిజం అలా బుర్రకెక్కాల్సిందే… మరేమనుకున్నారు..? దాపరికం దేనికి..? తయారు చేయించిందే పార్టీ కోసం, అధికారం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, సర్వముఖ ప్రగతి కోసం… ఆ పీకే గాడు, పాకే గాడు ఎట్సెట్రా వేస్ట్, నన్ను మించిన ఎన్నికల వ్యూహకర్త ఎవరుంటారు..? మా నాన్నను మించి రాజనీతిజ్ఞుడు ఎవరుంటారు..? అరె, ఇంతకుమించిన మేనిఫెస్టోలు ఏముంటయ్..? అసలు ప్రజలకు కావల్సింది ఇంకేముంది..? సరే, పోయిన ఎన్నికల ముందు పోరగాళ్ల స్కూల బ్యాగులు, సైకిళ్లకు గట్రా పార్టీ ముద్రలేసి, మస్తు పంచిపెట్టినం, వర్కవుట్ కాలేదు… పిల్లలు కదా, ఈ సమాజ్వాదీ సోషలిజం ఏందో సమజ్ కాలేదు, ఈసారి పెద్దలందరికీ ఈ సెంట్ గురి కొట్టాల్సిందే… అటు మాయావతి, ఇటు యోగీ పని ఖతం ఇక…
అసలు సోషలిజానికి సెంట్ తప్ప మరొకటి మార్గాంతరం లేదని నేనెప్పుడో కనిపెట్టాను… చూడండి, ఎంత ముద్దొస్తున్నాయో బాటిళ్లు… అసలు పట్టుకుంటే అధికార పరిమళం గుప్పుమంటోంది… పైన ఎర్రగా, కింద ఆకుపచ్చగా… మా పార్టీ గుర్తు, పేరు… హబ్బ… పట్టుకుంటే చాలు, చేతుల్లోకి అధికారం అర్జెంటుగా వచ్చేసినట్టుగా ఎంత బాగుందో… 2016లోనే తాజ్ మహల్, బెనారస్ ఘాట్, రుమి దర్వాజ, కన్నౌజ్ పేర్లతో నాలుగైదు రకాల సెంట్ బాటిళ్లను విడుదల చేశాను… 5 వేల బాటిళ్లను పంచిపెట్టాం… లక్షలాదిగా పంచిపెట్టే టైం లేకపోయింది గానీ, ఈ బీజేపీని తొక్కిపారేసేవాడిని అప్పుడే… ఇక ఈ 2022 ఎన్నికల్లో మ్యాజిక్ తప్పదు… అసలు నా జీవితంలో విజయాలు సాధించాను అంటే ఈ పర్ఫ్యూమ్ సీసాలతోనే…
Ads
నిజానికి ఈ పర్ఫ్యూమ్ సీసాలతోనే ఆగేది లేదు… పూర్తి సోషలిజం ఈ దేశంలో సాధ్యం కావాలంటే అవే సరిపోవు… ప్లాన్ చేస్తున్నాను… తొలి దశలో సబ్బులు, హెయిర్ రిమూవర్లు తయారు చేయిస్తాను… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి పంపిణీ చేయించేస్తాను… నెయిల్ పాలిష్ సీసాలు, హెయిర్ డైలు, ఒళ్లు తోముకునే స్క్రబ్బులు గట్రా ఎన్నికల ప్రచారంలో వాడేస్తాను… నో, నో, హెయిర్ డై వాడితే పైన ఎర్ర రంగు, కింద ఆకుపచ్చ రంగు వచ్చేస్తాయని కాదు… ప్యూర్ బ్లాక్, ఈ దుష్ట, ఈ దుర్మార్గ, ఈ మతోన్మాద బీజేపీ పాలనకు నిరసన అన్నమాట… ఇక పోలింగ్ నాటికి రహస్యంగా ఇంకొన్ని సౌందర్యసాధనాలూ పంపిణీ చేస్తాను… నో నో కండోమ్స్ కాదు, అవేమిటో ఇప్పుడే బయటపెట్టను, ఆ దెబ్బకు కథ మారిపోవాలె… ఐనా ఎంతసేపూ ద్వేషపూరిత రాజకీయాలేనా..? ప్రేమ, సౌందర్యం, అనుభూతి, ఆస్వాదన, అందం, సుగంధం… అసలు సోషలిజమే సౌందర్యం… అది ప్రజలకు ఎక్కితేనే మనకు అధికారం… చాలా పనుంది… ఉంటాను…’’
Share this Article