ఓ పని చేయండి… ఊహల్లోనే ఓ దేశం సృష్టించండి… భూమిపై స్థానం, జనాభా, చరిత్ర, సంస్కృతి లేకపోయినా పర్లేదు… అందులో మీరు చెప్పిందే శాసనం, మీరు చెప్పిందే రాజ్యాంగం… ఓ కరెన్సీ, ఓ జెండా, ఓ పార్లమెంటు… నో, నో, పార్లమెంటు, సుప్రీం కోర్టులు అక్కర్లేదు… దానికి అత్యున్నత ఏకైక ధర్మకర్త అనగా ధర్మ నియంత మీరే…… లేదంటే ఇంకో పని కూడా చేయొచ్చు… అమెరికా ఆధీనంలోని ఓ దీవి కొనండి… అందులోనే మీ దేశం ఉందని చెప్పి, మిగతా అన్ని ప్రభుత్వ ఫార్మాలిటీస్‌ను అమెరికాకే ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేయండి… ఐక్యరాజ్యసమితి మీ దేశాన్ని గుర్తిస్తుంది… సమావేశాలకు పిలుస్తుంది…… ఏమిటిదంతా జోక్ అనుకుంటున్నారా అని ఉరుమురిమి చూడకండి…
అత్యాచారాలు, లైంగికవేధింపుల కేసుల్లో మన దేశ దర్యాప్తు సంస్థలు వెతుకుతున్న నవీనదైవం నిత్యానంద ఆమధ్య దేశం విడిచిపారిపోయాడు, తెలుసు కదా… ప్రత్యేకంగా హిందూ మత రక్షణ కోసం కైలాసం అనే దేశాన్ని సృష్టించినట్టు ప్రకటించాడు… సొంత కరెన్సీ, జాతీయ పతాకం అని కూడా వార్తలొచ్చాయి… ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది..? ఏమో… ఎవరికీ తెలియదు… కానీ ఐక్యరాజ్యసమితికి కన్పించాయేమో… ఓ దేశంగా గుర్తించింది… ఈ గుర్తింపు నిజమేనా..? ఈ గుర్తింపుకు ప్రాతిపదిక ఏమిటి..? ఎవరికీ తెలియదు, తేలాల్సి ఉంది…
Ads
ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద… (హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల, హిందూ అలంకరణను సూచించే నగలు ధరించినా సరే, ఆమె ఎవరో విదేశీయురాలిగా కనిపిస్తోంది…) ఐక్యరాజ్యసమితికి చెందిన సీఈఎస్ఆర్ (Committee on Economic, Social and Cultural Rights) 19వ సమావేశానికి హాజరైంది… ఈమె కైలాస దేశానికి పర్మనెంట్ అంబాసిడర్… ఈ మీటింగు ఉద్దేశాల్లో ఒకటైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడుతూ హిందుత్వానికీ ఈ సుస్థిరాభివృద్ధికీ లంకె ఉన్నట్టు చెబుతూ… ఇక మా సుప్రీమ్ నిత్యానందను ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ, శిక్షించాలనీ భావిస్తోందనీ ఆరోపించింది… ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది…
అంతేకాదు, తమ కైలాస దేశం 150 దేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసిందనీ చెప్పిందామె… ఆమెతోపాటు కుమార్ అనే మరో ప్రతినిధి మరో సమావేశంలో కైలాస దేశానికి ప్రాతినిధ్యం వహించాడు… ఇంతకీ నిత్యానంద మీద కేసు ఏ స్థితిలో ఉందనేది వదిలేస్తే… అసలు ఒక దేశం అంటే నిర్వచనం ఏమిటనేది ఓ పెద్ద ప్రశ్నగా మారిందిప్పుడు… ఎవరైనా కరుడు గట్టిన టెర్రరిస్టు గనుక ఇలాగే ఓ ఊహాత్మక దేశం స్థాపిస్తున్నట్టు ప్రకటిస్తే… ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందా..? రక్షణగా నిలుస్తుందా..? ఈ ప్రశ్నకు జవాబు తేలాల్సి ఉంది… ఇక్కడ నిత్యానంద నేరస్థుడా కాదా అనే చర్చ కాదు, ఐక్యరాజ్యసమితి గుర్తించడానికి దేశం అంటే ఎలా ఉండాలి..? అసలు మొన్నటి యూఎన్ మీటింగుకు ఆహ్వానాన్ని ఎవరు పంపించారు..? ఏ చిరునామాకు పంపించారు..? ఏమో… అంతా నిత్యానందుడి లీల…!!
Share this Article