.
పొద్దున్నే కొమ్మలకు విరబూసిన పూలు కోద్దామని వెళితే… హాయిగా తల్లి ఒడిలో ఉయ్యాలలూగే మా గొంతు కోస్తావా? అని పూలు జాలిగా నోళ్ళు విప్పి ఏడుస్తుంటే… కోయలేక ఒట్టి చేతులతో వెనక్కు వచ్చేశాను ప్రభూ!” అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పవిలాపంలో తోటమాలి గుండెలు బాదుకుంటూ యజమానికి చెప్పుకుంటాడు. మనసు పొరల్లో నుండి కరుణ రసం ఉట్టిపడేలా ఘంటసాల పాడడంతో సృష్టిలో ఉన్న సకల పుష్పజాతి బాధగా మారిందది.
“కొమ్మలకు, రెమ్మలకు రంగులు చల్లుతూ వికసిస్తాం; గాలికి సుగంధాలు పూస్తాం; తేనెటీగలకు మకరందాన్ని ఇస్తాం; ఉన్న కాసేపు హాయిగా కొమ్మల్లో ఊగి… వాడిపోయాక ఆ కొమ్మల కిందే హాయిగా కన్నుమూస్తాం… అలాంటి మమ్మల్ను గంపల్లో ఒత్తి పారేస్తారా? గుండెలోనుండి సూదులు గుచ్చి హారాలు చేస్తారా? మమ్మల్ను తూచి వెల కడతారా? మమ్మల్ను పిండి అత్తరులు చేస్తారా? మీరసలు మనుషులేనా? మీకు కొంచెమైనా మానవత్వం ఉందా?” అని కరుణశ్రీ పూలు సకల మానవజాతిని కడిగిపారేస్తాయి.
Ads
అలా నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ సకల కోళ్ళ జాతి తరుపున వకాల్తా పుచ్చుకుని వాదించి… గెలిచింది. ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడి పక్కనున్న గడ్డివాము దగ్గరికి వెళ్ళగా… పక్కింటి అబ్బాయి కర్రతో కొట్టాడు. కోడి రెండు కాళ్ళు విరిగి స్పృహదప్పి పడిపోయింది. అక్కడ పుష్పవిలాపంలో తోటమాలిలా ఇక్కడ గంగమ్మ హృదయం విలపించింది. కోడి విలాప కావ్యమై ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పెట్టింది. దీనికి కేసెందుకమ్మా? ఆ కోడి ధర చెప్పు… ఇప్పిస్తామని పోలీసులు అన్నారు. కుదరదు… కేసు పెట్టాల్సిందే అంది. నా బంగారు కోడి కాళ్ళు విరగ్గాట్టినవాడు వచ్చి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. చివరకు ఊళ్ళో పెద్దమనుషులు పంచాయతీ పెట్టి క్షమాపణ చెప్పించారు. గంగమ్మ శాంతించింది.
విరిగిన కోడి కాళ్ళు మళ్ళీ అతుక్కుని… ఆ కోడి మళ్ళీ మునుపటిలా నడుస్తుందో! లేదో! కానీ గంగమ్మ పట్టుదలే ఆ కోడికి కాళ్ళుగా మారినట్లున్నాయి!
మనలో మనమాట!
కోడి ఎంత నిటారుగా నిలబడినా, కండతో బలపడినా కోసుకు తింటారే కానీ… మా మంచి కోడి అని వదిలిపెడతారా? బహుశా గంగమ్మ అలా కోసుకు తినకపోవచ్చు!! - పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article