Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’

October 30, 2022 by M S R

కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను…  ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance ) అనేది చూసి తీరాల్సిన అనుభూతి…

* తుళు ప్రాంతీయ పురాణం ప్రకారం… పార్వతి దేవి పెంచుకున్న వరాహం కైలాసంలో అలజడి సృష్టిస్తే, శివుడు దాన్ని అక్కడ “మాయం” చేసి, భూమిపైన ఈ ప్రాంతానికి “పంజుర్లి” వరాహ దేవతగా పంపాడు… సాక్షాత్తూ పార్వతి దేవి రాయి రూపంలో దేవతయ్యింది… పంజుర్లి దేవత వాళ్ళను సంరక్షిస్తుంది. ఆ వరాహానికి ఆవేశం, ఆకలి ఎక్కువ. పంజురితో పాటు క్షేత్రపాలకుడిగా “గుళిగ” ను కూడా పంపుతారు…

కర్ణాటకలో ఉన్న నానుడి ఏమిటంటే… “పంజుర్లి వదిలినా, తప్పుచేస్తే నిన్ను గుళిగ వదలడు”… ఈ గుళిగ అక్కడ “భూత కల” అనే ఒక ప్రత్యేక సంగీత నాట్యకళ చేసే (కథాకళిలా ఉంటుంది) వారి లోపలికి ప్రవేశించి, జరిగింది, జరగబోయేది చెప్పి, వాళ్ళను సంరక్షిస్తాడు. (మన దగ్గర “దేవుడు మీదకి రావటం”, “పూనకం” ఇలా రకరకాల పేర్లతో చూస్తాము. దాదాపు ఇండియా అంతా ప్రతి ప్రాంతంలో కుల దేవత, గ్రామ దేవత, వన దేవత రూపంలో ఇలాంటివి వున్నాయి)…

Ads

* శివుడు పార్వతి ఆది దంపతులు. వారికి వివిధ అంశలతో రూపాలున్నాయి, వివిధ రూపాల్లో శివపురాణం కొనసాగుతుంది. ఆది అనాది ఏదీ లేని అనంత దాంపత్యం వారిది. శివుని అంశాలైన కాల భైరవుడు, రుద్రుడు, వీరభద్రుడు, హనుమంతుడు, ఈ చిత్రంలో ఉన్న పంజుర్లి, గుళిగ, వీరు కూడా కాలాతీతులు, ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటారు…

* దశావతారాల్లో, మత్స్య (చేప), కూర్మ (తాబేలు ) అవతారాలు నీటి నుండి ఒడ్డు వైపు వస్తే, వరాహం భూమి పైన నడిచే మొదటి అవతారం. అందుకే పార్వతి వరాహాన్ని కైలాసంలో పొందింది. చిత్రంలో వచ్చే వరాహం అద్వైత రూపం, శివ- విష్ణు తత్వాలు రెండూ ఉన్నాయి. అందుకే చిత్రమంతా అది రక్షకుడు (protector), నిర్మూలకుడు (destroyer ) గా మారుతుంటుంది, అలాగే “శివ” (ప్రధాన పాత్ర ఐన రిషబ్ ) ను మారుస్తుంటుంది!

* జాతక సంహిత ప్రకారం, నవగ్రహాలు, మనిషి జన్మ లగ్నం దశావతారాలను సూచిస్తాయి. వరాహావతారం రాహువు, తన అధిష్టాన దేవత దుర్గ. అందుకే పార్వతి కలియుగంలో కోరికల వ్యాప్తి/వినాశనానికి తన ప్రతిరూపంగా వరాహాన్ని ఇచ్చింది.  గుళిగ (లేదా గుళిక), శని యొక్క పుత్రుడు. (పంచాంగంలో గుళిక యోగం చూస్తుంటాం మనం). శని కర్మలను శాసించే, శిక్షించే కఠిన గురువు. ఆయన కొడుకు కదా గుళిగ కూడా అంతే.

* అందుకే చిత్రమంతా, పంజుర్లి (వరాహం) ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తుంది, పరిధి దాటితే శపిస్తుంది. గుళిగ “భూత కల” చేస్తున్న వ్యక్తిలో ప్రవేశించి శిక్షలు వేస్తాడు. ఒకవేళ పంజుర్లి వదిలినా గుళిగ వదలడు అనేది అందుకే. శివుణ్ణి కూడా చెట్టు తొర్రలో దాగేట్టు “ఏలినాటి శని” చేసాడంటాం కదా! చిత్రమంతా శివ తత్వమే నిజానికి… వనజ (వనంలో పుట్టింది), హిమజ/పార్వతి (పర్వతాల్లో జనించింది ). ప్రకృతే పార్వతి. ప్రకృతి ఉన్న చోట ఉండే పురుషుడు అర్ధ నారీశ్వరుడైన ఆది యోగి శివుడు! అందుకే చిత్రం అడవిలో మొదలవుతుంది, చివరకు అడవిలోనే ఉంటుంది.

* ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే, ఆగ్రహించి కరువు కాటకాలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు వస్తాయి. మంచి/చెడు, పుణ్యం పాపం లేకుండా, అన్ని రకాల జీవులు జీవం కోల్పోతాయి కదా. (వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మ శేషం వల్ల, వాళ్ళక్కడ ఉండి, ఆ ఫలితం పొందుతారు ). రిషబ్ శెట్టి ఈ కథ రాశాడా? లేదు. ఆ పంజుర్లి దేవతనే రాయించిందేమో. కథ చివర్లో, కొంతమంది గిరిజనులు, భూస్వామితో పాటు, అతనికి చెందిన చెడ్డవాళ్ళు, అందరూ పోతారు. ప్రకృతి శాంతిస్తుంది…

* జగన్మాత ఈ చరాచర సృష్టిని నిరంతరం అనుశాసిస్తున్నది. జనన మరణాలు, కష్ట సుఖాలు, ధన దరిద్రాలు, ఆడ మగ, ఉండటం, లేకపోవటం ఇవన్నీ బిందురూపము నుండి అఖిలాండ కోటి బ్రహ్మాండములుగా మార్చి మాయా లీలా వినోదం చూసే ఆ తల్లికి ఒకటే!

* చిత్రం మెల్లగా కొన”సాగి”, చివరి 20 నిమిషాల్లో మనను విభ్రాంతికి గురిచేస్తుంది. తొమ్మిది నెలలు ఓర్పుగా ఎదురుచూసి పండంటి బిడ్డను కన్న తల్లిలా, సంవత్సరమంతా చదివి, పరీక్షలో ఉన్నతమార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ లా, నిశ్చలంగా ఉన్న ఆకాశం భళ్ళున వర్షం కురిపిస్తే మట్టివాసనలతో పులికించి భూమి, పచ్చగా మెరిసిపోయే చెట్లు పూలలా… ఒక చెప్పరాని, చెప్పలేని అనుభూతి మనను ఉద్విగ్నులను చేస్తుంది. చివరి ఇరవై నిమిషాల్లో, సంతోషం, విషాదం, ఎన్నో భావాలు కమ్మి, మన కళ్ళల్లో నీళ్లు! రిషబ్ కనపడితే గట్టిగా hug చేసుకోవాలని, ఏడవాలని, నువ్వు కదా సామి, ఆ దేవతా పుత్రుడివి అని కాళ్లకు మొక్కాలని నాకనిపించింది !

* విష్ణువు నడిచే చైతన్యమైతే, శివుడు యోగిపుంగవుడు. అన్నీ అలంకరించుకొనేది కేశవుడైతే, ఆయనదైన లోకంలో యోగ సాధన చేస్తూ, అందరికి వరాలిస్తూ, ఎప్పుడూ ప్రమథ గణాలను వెంటవేసుకుని తిరుగుతూ, మంచి చెడ్డ చూడకుండా, కేవలం వారి ఆర్తి, తపస్సు, కోరికలను మన్నించి, అందరిని నమ్ముతూ, వరాలిస్తూ (భస్మాసురుడు, గజాసురుడు, రావణుడు… ఎందరో ), జటలు కట్టినా, పట్టించుకోక, కాలాతీతుడై, అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్టుండే మర్మ యోగి కదా, భోళా శంకరుడు? అదే భోళా శంకరుడికి క్రోధం వస్తే, కాల రుద్రుడైతే, కల్పాంత రుద్రుడైతే? మూడోనేత్రం తెరిచి ప్రళయ రుద్ర తాండవమే కదా చేసి, శత్రు వినాశనం చేసేది? ప్రొటెక్టర్ ఆయనే ! డిస్ట్రాయర్ ఆయనే కదా!

…. ఇప్పుడు శివుడి గురించి రాసిందంతా చదవండి. రిషబ్ అసామాన్య రచనా ప్రతిభ తెలుస్తుంది. కథలో హీరో పేరు “శివ”, అతను ప్రేమించిన అమ్మాయి పేరు లీలా (అంటే దుర్గా/లలితా/పార్వతి). అతను చెట్టుపైన ఏర్పరుచుకున్న చిన్న కాటేజ్ పేరు “కైలాసం”. ఎప్పుడూ వెంట ముగ్గురు- నలుగురు ప్రమథ గణం. ఎవ్వరేం అడిగినా వాళ్లకు సాయం చేస్తాడు, మాట ఇస్తాడు, భూస్వామి అయినా, తన గూడెంలో ఎవరైనా,
అందరితో ఉంటాడు, ఎవ్వరితో కలవడు. చర్రున వచ్చిన క్రోధంతో అందరినీ చితకబాదుతాడు. నమ్మకద్రోహం తెలిసాక, ప్రళయ రుద్ర తాండవం చేస్తాడు!

శివుని చిన్నప్పుడే “భూత కళ” వేషధారి అయిన తండ్రి అరణ్యంలో అదృశ్యమైపోయాడు… అదే చేసిన తమ్ముడిదీ అదే దారి… మరి శివది ఏదీ దారి? లీల గర్భవతి అయిందని చూపి… లాస్ట్ పది సెకన్లలో రిషబ్ శెట్టి చూపిన చిత్రం క్లైమాక్స్ “న భూతో న భవిష్యతి” ఎవ్వరూ ఊహించలేనిది… ఇంకో 5 నిమిషాలైతే చిత్రం అయిపోతుందనేప్పుడు, శివ, అటవీ అధికారి, గూడెంలో ఉన్న అందరి చేతులు కలుపుకుంటూ, గుళిగ తనలో చూపే అత్యద్భుత నృత్య, ముఖ కవళికలు మిళితం చేస్తూ కళ్ళతో చెప్పే ప్రతి “మాటా” సినిమాహాల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమౌతుంది!…. కన్నీళ్లు, విభ్రాంతి, సంతోషం, విచారం, దైవభక్తి అన్నీ ఒకేసారి మనలో ఉప్పొంగుతాయి…. మన జీవితంలో కష్టాలు గుర్తుకు వస్తాయి, ఆ శివ చెయ్యి మనం కూడా పట్టుకొని “దేవత” భరోసా పొందినట్టు అనుభూతికి లోనవుతాం!………. – మాధవ్. K

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మిస్టరీ..! ఇది రుతుపవనాల రాకను చెప్పే జగన్నాథుడి గుడి..!!
  • అదిరె అభి..! తెరపైకి మరో జబర్దస్త్ హీరో..! అస్సలు అదరలేదోయ్..!!
  • నిక్కచ్చి జస్టిస్… అందుకేనా ఆమె పదవీ విరమణ ప్రోగ్రామ్‌కు బాయ్‌కాట్..?!
  • పవన్ కల్యాణ్ సినీ హూంకరింపుల వెనుక ఏదో అంతుపట్టని మిస్టరీ..!!
  • నో మైసూర్ పాక్… నో కరాచీ బేకరీ… పతంజలి ముల్తానీ మిట్టీ వోకేనా..?!
  • ది డిప్లొమాట్..! ఓ నిజజీవిత గాథకు ఆసక్తికరమైన ప్రజెంటేషన్…!
  • తాత, అయ్య, కొడుకు… కుటుంబ వారసత్వాలు, వ్యక్తులకే పార్టీల ఓనర్‌షిప్స్…
  • HAMMER… పాకిస్థాన్ నెత్తిన ‘సుత్తి’… ఉగ్రకేంద్రాలపై రియల్ పాశుపతం..!
  • అంతటి హీరో చిరంజీవికి ఫైర్‌ఫోబియా… నిప్పు చూస్తేనే భయం…
  • అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions