మళ్లీ మొదలుపెట్టారు… రాహుల్ గాంధీ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి, మా ఫోన్లు హ్యాక్ అవుతున్నయ్, ఐనా సరే, ఏం చేసుకుంటారో చేసుకొండి, డోన్ట్ కేర్, నా ఫోన్ ఇవ్వమన్నా ఇస్తాను అంటూ భీకరమైన ప్రకటనలు జారీ చేశాడు… కేటీయార్, రేవంత్ సహా పలు బీజేపీ విపక్షనేతలు కూడా వంత పలికారు… శశిధరూర్, అఖిలేష్, ఏచూరి, మహువా ఇవే ట్వీట్లు చేశారు…
తమకు యాపిల్ అలర్ట్ మెసేజులు వచ్చాయి కాబట్టి మా ఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నట్టే అని వాళ్ల ఆరోపణల సారాంశం… కానీ అదే యాపిల్ మాత్రం అలాంటి ఫేక్ మెసేజులు వస్తూనే ఉంటాయని స్పందించింది… తుస్… అసలు ఈ కీలక ఎన్నికల వేళ ఈ హ్యాకింగ్ ఆరోపణలు జనంలోకి వెళ్తాయా..? ఎందుకీ ప్రయాస..? సగటు వోటర్లలో ఎందరికి తెలుసు ఈ హ్యాకింగ్ అనేది పక్కన పెడితే… గతంలోకి ఓసారి వెళ్దాం…
Ads
పెగాసస్… ఈ స్పైవేర్ సంస్థ ద్వారా అత్యాధునిక పరికరాలు, సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి విపక్ష నేతలతో పాటు లాయర్లు, జర్నలిస్టుల, ఇతర ఎన్‌లైటెన్ పీపుల్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అప్పట్లో పెద్ద దుమారం రేపారు… విపక్ష అనుకూల ది వైర్ వంటి వెబ్‌సైట్లు పెద్ద క్యాంపెయిన్ నడిపించారు… వివాదం సుప్రీంకోర్టు దాకా పోయింది… అదీ ఏమీ చెప్పలేదు, మొత్తం సద్దమణిగింది… మళ్లీ ఇప్పుడు మొదలు… కాకపోతే పెగాసస్ పేరు చెప్పడం లేదు, అంతే…
ఇక రియాలిటీ గురించి చెప్పుకుందాం… అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం విపక్షంలో ఉన్నవారి ఫోన్లపై నిఘా వేయడం ఇప్పుడేమీ కొత్త కాదు… అసలు మన ఫోన్లలో నిజంగా ప్రైవసీ ఉందా..? మన వివరాల డేటా సురక్షితమా..? కాదు… మన ఫోన్లలో కాల్స్, కంటాక్ట్స్, మెయిల్స్, మెయిల్ ఐడీలతో మొదలుకుని ప్రతిదీ బయటి మార్కెటింగ్ సంస్థలకు చేరిపోతోంది… మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, దేని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం, ఎవరికి ఎక్కువ కాల్స్ వెళ్తున్నయ్… ఒక్కసారి మనం వెబ్‌కు కనెక్ట్ అయిపోతే సరి, ఇక అంతా బహిరంగమే… అంతెందుకు..? మ్యాప్స్ యాక్టివ్‌గా ఉంటే మనం ఎప్పుడెప్పుడు ఎక్కడ తిరుగుతున్నామో కూడా రికార్డ అయిపోతుంది, లోకేషన్లతో సహా…
అప్పట్లో తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్‌కు అత్యంత ముఖ్యుడైనా ఓ ఐఏఎస్ అధికారి ఏమన్నాడు..? ప్రతి పౌరుడి జాతకం మా చేతి వేళ్ల మీద ఉంది… మరిక్ సగటు పౌరుడి ప్రైవసీ ఏమున్నట్టు..? తెలంగాణలో ఎవరి ఫోన్లమీద నిఘా లేదా..? ట్యాపింగ్ లేదా..? హ్యాకింగ్స్ లేవా..? కేంద్రమే కాదు, ప్రతి రాష్ట్రమూ ఈ నిఘా పరికరాలు, వ్యవస్థలను కొంటున్నది, వాడుతున్నది… అది అవసరం కూడా… అసాంఘిక శక్తుల సమాచారం, కదలికల్ని కనిపెట్టడానికి తప్పదు…
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఓ డీజీపీ స్థాయి అధికారి ఇజ్రాయిల్ నుంచి ఇలాంటి పరికరాలు కొనే ప్రయత్నంలోనే బుక్కయినట్టున్నాడు కదా… ఓ మిత్రుడు ఏమంటాడంటే..? ‘‘ఫోన్లు హ్యాక్ కావడం అనేది కామన్… అందుకే నాయకులు నంబర్లు మారుస్తుంటారు, డ్రైవర్లు, పీఏల నంబర్లతో కీలక సంభాషణలు చేస్తుంటారు… చివరకు టెలిగ్రామ్, ఫేస్‌టైమ్, వాట్సప్, సిగ్నల్ తదితర ‘ఎన్‌క్రిప్టెడ్ మెసేజులు, కాల్స్’ కూడా ఛేదిస్తున్నారు పోలీసులు… ఐనా ఫెయిర్‌గా ఉండేవాళ్లు, ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు ఈ ఫోన్ నిఘాకు భయపడితే ఎలా..?’’
నిజానికి ఫోన్ అధికారిక ట్యాపింగ్‌కు ఓ పెద్ద ప్రొసీజర్ ఉంది… దాని ప్రకారం వెళ్తే రాష్ట్ర, కేంద్ర నిఘా వ్యవస్థలకు అడుగు కూడా కదలదు… అందుకని ఇంటలిజెన్స్ వ్యవస్థలు రహస్యంగానే ఈ ప్రక్రియలకు పాల్పడుతుంటాయి… ఇందులో ఏ పార్టీ అనే తేడా లేదు… అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రాల్లో ఎవరు కుర్చీల్లో ఉన్నా సరే… ప్రభుత్వ నిఘా విభాగాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి… మావోయిస్టుల చేతుల్లోకి మొబైళ్లు వచ్చాక నక్సలైట్లు ఎంత చావుదెబ్బ తిన్నారో మనం చూస్తున్నదే కదా…!! ఐతే ఏ ప్రభుత్వమూ ఈ రహస్య నిఘాను బహిరంగంగా చేస్తున్నట్టు ఒప్పుకోదు… అదే సత్యం..!!
Share this Article