Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పిబరే రామరసం- 1 … మన బతుకంతా రామమయం…

April 16, 2024 by M S R

ఒక దేశానికి, ఒక జాతికి తనకంటూ సొంతమయిన అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. భాషా సంస్కృతులుంటాయి. నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలకు కట్టుకున్న గుడిగోపురాలుంటాయి. ఆ గుడి గోపురాల్లో కొలుచుకునే దైవాలుంటాయి. ఆ దైవాల ఆవిర్భావ ఘట్టాలు, లీలలను తెలిపే పురాణాలుంటాయి. ఆ పురాణాల్లో ఏ కాలానికయినా నిలిచి వెలిగే ఆదర్శాలుంటాయి. ఆ ఆదర్శాల అద్దంలో మనల్ను మనం చూసుకుంటూ నడవాల్సిన విలువలుంటాయి. ఆ విలువలను తెలుసుకుంటే జ్ఞానం. పారాయణం చేస్తే పుణ్యం. ఆచరిస్తే పుణ్యం-పురుషార్థం-మోక్షం.
అలా భారతీయులకు ఆదర్శం-రామాయణం.

మనిషిని గెలిపించడానికి మనిషిగా దిగివచ్చిన దేవుడు రాముడు. పారాయణ గ్రంథం రామాయణం.
ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు.
విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా మనల్ను నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు.
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు.
ధర్మం పోత పోస్తే – రాముడు.
ఆదర్శాలు రూపుకడితే – రాముడు.
ఆనందం నడిచి వస్తే- రాముడు.
వేదోపనిషత్తులకు అర్థం – రాముడు.
మంత్రమూర్తి – రాముడు.
పరబ్రహ్మం – రాముడు.

ఎప్పటి త్రేతా యుగ రాముడు?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే.
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే నీళ్లను సంప్రోక్షించి అమ్మ చెప్పిన మాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష .
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట- రమాలాలి – మేఘశ్యామా లాలి.
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష .
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా.
వినకూడని మాట వింటే అనాల్సిన మాట- రామ రామ.
భరించలేని కష్టానికి పర్యాయపదం- రాముడి కష్టం.
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే- రాముడు.
కష్టం గట్టెక్కే తారక మంత్రం- శ్రీరామ.
విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా!
వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా!
తిరుగులేని మాటకు – రామబాణం.
సకల సుఖశాంతులకు – రామరాజ్యం.
ఆదర్శమయిన పాలనకు కొలమానం – రాముడి పాలన.
ఆజానుబాహుడి పోలికకు – రాముడు.
అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు.
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే.
చివరకు భారతీయ ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా… రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.
ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు.
గొప్ప కొడుకు – రాముడు.
అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు.
గొప్ప విద్యార్ధి – రాముడు(వసిష్ఠ, విశ్వామిత్రులు చెప్పారు)
మంచి మిత్రుడు – రాముడు(గుహుడు చెప్పాడు)
మంచి స్వామి – రాముడు (హనుమ చెప్పాడు )
సంగీత సారం – రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు )
నాలుకమీదుగా తాగాల్సిన నామం – రాముడు ( పిబరే రామ రసం -సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పాడు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు.
నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు.
చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు.
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు.
జన్మ తరించడానికి -రాముడు , రాముడు – రాముడు.

Ads

రామాయణం పలుకుబళ్లు
———————–
మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది.
చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం.
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ.
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం.
కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు.
వికారంగా ఉంటే – శూర్పణఖ.
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ )
పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర.
పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు.
ఎంగిలిచేసి పెడితే – శబరి.
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు.
అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ.
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే.
పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే.
యుద్ధమంటే – రామరావణ యుద్ధమే.
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే.
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం )

సీతారాములు తిరగనిఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు.
ఒంటిమిట్టది ఒక కథ. భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణమంత! చెబితే మహా భారతమంత!.

(“అంతా రామమయం- మన బతుకంతా రామమయం” పేరుతో 2017లో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికకు నేను రాసిన వ్యాసమిది. దీన్ని నా పేరు మాత్రం తీసి…యథాతథంగా వారి పేరుతో ప్రచురించుకున్నవారు; పేరు లేకుండా పంపుకుంటున్నవారు; మధ్యలో కొన్ని అసందర్భమైన శ్లోకాలు, పద్యాలు, రాజకీయ వ్యాఖ్యలు కలిపి వారి పేరు పెట్టుకున్నవారు లెక్కలేనంతమంది.
నిజానికి జనం నోళ్లల్లో నానుతున్న మాటలను ఒక చోట పేర్చానే కానీ…ఇందులో నా ప్రతిభ ఏమీ లేదు. నచ్చితేనే కదా కాపీ కొడతారు? అన్న కాళిదాసు పరమ ప్రామాణికమైన ఊరడింపు ఉండనే ఉంది. అలా ఎవరు ఎలా ఏ పేరుతో వాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. కాకపోతే వాల్మీకి చెప్పని విషయాలు మధ్యలో జోడించి రామాయణాన్ని అపవిత్రం చేయకండి. విషయానికున్న ప్రాధాన్యాన్ని పలుచన చేయకండి. శ్రీరామనవమి సందర్భంగా ధారావాహిక ఇది. ఇవన్నీ ఇదివరకు ప్రచురితమైనవే. వీటిలో కొన్నింటికి ఆధారం- ముప్పయ్యేళ్లుగా నేను చదువుతున్న, వింటున్న కవి, పండిత, ప్రవచనకారులు విశ్వనాథ సత్యనారాయణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి, శ్రీభాష్యం అప్పలాచార్యులు, సామవేదం షణ్ముఖ శర్మ, చాగంటి కోటేశ్వరరావు, పుల్లెల శ్రీరామచంద్రుడు, అప్పజోడు వెంకటసుబ్బయ్యల పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలు. ఇందులో గుణదోష చర్చ వస్తే…గుణం వారిది- దోషం నాదిగా పరిగణించగలరు)  -పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions