చిన్నప్పుడు జ్వరమొస్తే గ్లాసెడు నీళ్లలో జిందాతిలిస్మాత్ కలుపుకొని తాగడం.. జలుబు చేస్తే అదే జిందాతిలిస్మాత్ రుమాలుకి కాస్త రాసుకొని పీల్చడం. కానీ ఇప్పుడు ప్రతీ దానికి ఒక మాత్ర వేసుకోవాల్సిందే. డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే ముందు మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవడం.. వేసుకోవడం. ఇలా ఎట్లాబడితే అట్లా ట్యాబ్లెట్లు వేసుకోవడం ప్రమాదకరం. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ఆయన రాసిన ట్యాబ్లెట్లు వేసుకోవడం ఉత్తమం అని చాలా మంది చెబుతుంటారు. కానీ ‘పిల్’ అనే వెబ్ సిరీస్ చూస్తే జీవితంలో ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా భయపడతారు.
ప్రపంచంలో అత్యంత పెద్ద మార్కెట్ ఫార్మా. కానీ ఆ రంగంలో జరిగే అవినీతి అంత కంటే పెద్దది. నాణ్యత లేని, పరీక్షించని, ప్రమాదకరమైన ఔషధాలను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసి రోగుల ప్రాణాలతో ఫార్మా కంపెనీలు ఎలా చెలగాటమాడుతున్నాయో ఈ ‘పిల్’ అనే వెబ్ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫార్మా కంపెనీ యజమానులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ప్రజలకు ప్రమాదకర మందులను ఎలా సరఫరా చేస్తున్నాయో స్పష్టంగా చెప్పారు.
ఒక మందు తయారు చేయాలంటే వివిధ దశల్లో, ఏళ్ల పాటు జరగాల్సిన ‘ట్రయల్స్’ను తూతూ మంత్రంగా జరిపి మార్కెట్లోకి ఎలా విడుదల చేస్తున్నారో తెలుస్తుంది. ఫార్మా కంపెనీల ధనదాహం, రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు ఎలా బలవుతున్నాడో మనం ఈ సిరీస్ చూసి అర్థం చేసుకోవచ్చు.
Ads
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా (రైడ్ అనే సినిమా తీశాడు. దీన్నే హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్‌గా రీమేక్ చేశాడు) దర్శకత్వంలో జియో సినిమాలో రిలీజ్ అయిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘పిల్’. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ (జెనీలియా భర్త), పవన్ మల్హోత్రా, అక్షత్ చౌహాన్, అన్షుల్ చౌహాన్‌తో పాటు ఇతరులు నటించారు. కథ క్లుప్తంగా చెప్పాలంటే.. ఫరెవర్ ఫార్మా అనే కంపెనీ ఇండియాలో అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ.
ఇండియా మొత్తం తన మందులే మార్కెట్‌లో ఉండాలని భావించడంతో పాటు.. ప్రపంచ మార్కెట్‌లో కూడా తమ సంస్థనే అగ్రగామిగా ఉండాలని ఆ సంస్థ సీఈవో పవన్ మల్హోత్రా లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి సంస్థ కంటే ముందే పలు రోగాలకు మందులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంటాడు. ఒక డ్రగ్ తయారీకి ఏళ్ల పాటు ల్యాబ్‌లో, జంతువులపై, ఆ తర్వాత మనుషులపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉండగా.. అవన్నీ స్కిప్ చేస్తూ మనుషులపై కూడా నేరుగా ట్రయల్స్ చేస్తూ.. అవి పని చేయవు.. ప్రాణాంతకం అని తెలిసినా సరే.. మందులను విడుదల చేస్తుంటాడు.
ఫరెవర్ ఫార్మా సీఈవో మల్హోత్రాకు ఒక సీఎం, మరొక ఉన్నతాధికారి (డ్రగ్ టెస్టులు చేసే ప్రభుత్వ ఏజెన్సీ) సహకరిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది రోగులు ఫరెవర్ ఫార్మా మందులను వాడి అకస్మాతుగా చనిపోతుంటారు. అలా చనిపోయిన ఒక రోగి కుమారుడైన రిపోర్టర్ ఈ మందులే తన తల్లిని బలితీసుకున్నాయని నమ్మి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మరోవైపు ఔషధ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ సంస్థకు రితేశ్ దేశ్‌ముఖ్ అధికారిగా వస్తాడు. ఆయనకు తోడుగా యంగ్ ఆఫీసర్ అన్షుల్ చౌహాన్ ఉంటుంది.
వీళ్లు కూడా ఫరెవర్ ఫార్మాకు సంబంధించిన ట్రయల్ రిపోర్ట్ ఫేక్ అని భావించి విచారణ చేస్తుంటారు. వీళ్ల టీమ్‌కు పదే పదే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, బెదిరింపులు వస్తుంటాయి. ఒకవైపు రిపోర్టర్, మరోవైపు రితేశ్ టీమ్ ఫరెవర్ ఫార్మాలో జరిగే అవకతవకలు, ఫేక్‌ట్రయల్స్‌పై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇక అదే ఫార్మాలో పని చేస్తున్న ఒక యంగ్ అనలిస్ట్ కూడా అవకతవకలను తెలుసుకొని మేనేజ్‌మెంట్‌కు చేరవేయాలని అనుకుంటాడు. కానీ అతడికీ ఆటంకాలే ఎదురవుతాయి.
ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఫరెవర్ ఫార్మా క్యాన్సర్ ఔషధాన్ని మార్కెట్‌లోకి తేవాలని అనుకోవడం, యూరోప్ కంపెనీతో మెర్జ్ కావాలని ప్రయత్నించడం చేస్తుంది. కానీ రితేశ్ దేశ్‌ముఖ్, రిపోర్టర్, అనలిస్ట్‌ల కారణంగా అడ్డంకులు వస్తాయి. అప్పుడు ఫరెవర్ ఫార్మా సీఈవో వీళ్లను ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు ఎలా కలుస్తారు? కలిసిన తర్వాత ఫరెవర్ ఫార్మాను ఎలా అడ్డుకుంటారనేది ఈ సిరీస్‌లో చూడవచ్చు.
ప్రభుత్వ అధికారి అయిన రితేశ్ కూడా కోర్టు ద్వారానే ఫరెవర్ ఫార్మాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతే కానీ సినిమాలో హీరోలాగా వెళ్లి ఫైట్లు చేసి కంపెనీని తగలపెట్టి రావడం అనేది ఉండదు. మొత్తంగా 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ మధ్యలో కాస్త లాగినట్లు అనిపిస్తుంది. కోర్డు డ్రామా, అనలిస్ట్ ఎదుర్కొనే ట్రామాను కాస్త లాగినట్లు అనిపిస్తుంది. చివర్లో కూడా ఎండ్ ఎలా చేయాలో అర్థం కాలేదని అనిపిస్తుంది.
రితేశ్ దేశ్‌ముఖ్ నటన పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఆయన అసిస్టెంట్‌గా నటించిన అన్షుల్ అందంగా, డైనమిక్‌గా కనిపించింది. రిపోర్టర్‌గా యాక్ట్ చేసిన అక్షత్ చౌహాన్ కూడా ఆకట్టుకుంటాడు. డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా గతంలో తీసిన ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాలోని కోర్టు సీన్లు, రైడ్ సినిమాలో ప్రభుత్వ అధికారుల ఇన్వెస్టిగేషన్‌ను ఈ ‘పిల్’లో వాడేసినట్లు అనిపిస్తుంది. కథను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చెప్పి, 6 ఎపిసోడ్స్‌లో ముగించి ఉంటే బాగుండేది. కానీ మొత్తానికి ‘పిల్’ మాత్రం చూడదగిన సిరీస్….. (#భాయ్‌జాన్ … John Kora)
Share this Article