ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త ఇది… పిల్లలమర్రి చెట్టు తెలుసు కదా… 700 ఏళ్ల వయస్సున్న ముసలి చెట్టు… ప్రపంచంలో ఇంత పెద్ద ఆయష్షున్న రెండో చెట్టు అట… ఎకరాలకొద్దీ వ్యాపించింది… ఊడలు దిగిపోయి మహా వృక్షరాజం అనిపించుకుంది… ఇప్పుడది మళ్లీ చూడటానికి రారమ్మంటోంది… అదీ వార్త…
అందులో ఏముంది విశేషం అని పెదవి విరవకండి… 2018 లో ఒకేసారి చీడ, చెద పురుగులు తగులుకున్నాయి… అసలే ముసలి ప్రాణం తట్టుకోలేకపోయింది… కొమ్మలు విరిగిపోతూ, ఊడలు రాలిపోతూ, చెట్టు ఎండిపోతూ అంత్యదశకు చేరుకుంది… ఏ మహానుభావుడు తలచాడో గానీ… దానికి వైద్య చికిత్స మొదలుపెట్టారు…
ఆ చెట్టును బతికించాలి… అదే ధ్యేయంతో అనేకచోట్ల సెలైన్ బాటిళ్లు ఏర్పాటు చేశారు… ఒక్కొక్క బొట్టే కాండంలోకి ఎక్కిస్తూ, అందులోనే పెస్టిసైడ్స్, చీడనివారణ మందుల్ని కూడా కలపడం మొదలుపెట్టారు… దాని ఇన్‌ఫెక్షన్ పెరగకుండా జనం రాకడ ఆపివేశారు… ఒకరకంగా చెప్పాలంటే ఓపెన్ స్కై ఐసీయూలో పెట్టారు దాన్ని… మెల్లిమెల్లిగానైనా కోలుకుంది… మనిషి ఆ చెట్టును బతికించుకున్నాడు…
Ads
నిలబడింది… ఇప్పుడు కొత్తగా ఊడలు కూడా వస్తున్నాయి… ఇక ఇప్పట్లో ఢోకా లేదు ఈ ముసలమ్మకు… మరికొన్నేళ్లు బతుకుతుంది… చూడవచ్చే వాళ్లందరినీ పచ్చగా ఆశీర్వదిస్తుంది కూడా… ఇప్పటిదాకా చూడలేదు అనేవాళ్లున్నారా..? ఇప్పుడు వెళ్లండి… ఏడొందల ఏళ్లున్న ఆ పచ్చటి మాతను పలకరించండి… ఆమె చుట్టూ అల్లుకున్న ఆ హరిత పరిమళాన్ని ఆస్వాదించండి…
అన్నట్టు ఓ హెచ్చరిక… ఇన్నాళ్లూ దూరం నుంచి చూడటానికి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ఇప్పుడు కూడా చెట్టును తాకడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు… సందర్శకులు కొమ్మలపై పేర్లు చెక్కడం వంటివి చేయకుండా… చెట్టును తాకితే సీసీ కెమెరాల్లో చూసి 5 వేలు జరిమానా వేస్తారు… ప్రత్యేకంగా గార్డుల్ని పెట్టారు… ఆ పరిసరాల్లోనే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాట్లున్నయ్… ఓ మంచి టూరిస్ట్ ప్లేస్… దగ్గరలో ఓ చిల్డ్రన్ పార్క్, మ్యూజియం, మినీ జూ, డీర్ పార్క్, జిల్లా సైన్స్ మ్యూజియం… ఒకటీరెండు గుళ్లు కూడా ఉన్నట్టున్నయ్…
ఇదీ లొకేషన్… అప్పట్లో పూర్తిగా చెదలు పట్టిన కొమ్మలను కొట్టేశారు… ఊడలకు ప్రత్యేకంగా పైపులు తొడిగారు… వాటి నుంచి గాలి పోవడానికి వీలుగా, సూర్యరశ్మి సోకడానికి వీలుగా రంధ్రాలు… కొన్నిచోట్ల కొమ్మలకున సిమెంట్ సపోర్ట్స్ పెట్టారు… ఎరువులు వేశారు… మొత్తానికి ఆ చెట్టును బతికించి తెలంగాణ అటవీ శాఖ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది…! అభినందనలు బాధ్యులందరికీ..!!
Share this Article