భర్తల్ని ప్రియుళ్లతో కలిసి చంపించిన భార్యలు… పెళ్లాలను తగలేసిన మొగుళ్లు… పిల్లలకు విషం పెట్టిన తండ్రి… బతికి ఉండగానే తల్లిదండ్రులను కాటిలో వదిలేసిన కొడుకులు… చివరకు జన్మనిచ్చిన తల్లులను సైతం చంపేసే కొడుకులు…… ఎన్నెన్నో చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం… అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం… అని నిర్లిప్తంగా ఓ పాట పాడుకుని మరిచిపోతున్నాం… తాజాగా ఓ వార్త కలచివేసింది…
చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు సుస్సు పోస్తే, గుండెల మీద తంతుంటే… ప్రేమగా మళ్లీ మళ్లీ తన్నించుకుంటాడు తండ్రి… స్థోమత మేరకు పెంచుతాడు, చదివిస్తాడు, పెళ్లిచేస్తాడు… మనుమలు, మనుమరాళ్లను కూడా అమితంగా ప్రేమిస్తాడు… ఐనా సరే, ముసలితనంలో ఆ బిడ్డలే ఈడ్చి తంతే..? ఓసారి ఈ కథ కూడా చదవండి…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా… అది చిక్కోడి ప్రాంతం… పూణెకు చెందిన మూల్‌చంద్ శర్మ అనే రిటైర్డు బ్యాంకు ఉద్యోగి ఇటీవల పక్షవాతం బారిన పడ్డాడు… ఆయనను ఎవరో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించాడు… చికిత్స తర్వాత, ఆ ఆసుపత్రికి సమీపంలోని శవనేరి అనే లాడ్జిలో ఉంచాడు… కానీ వ్యాధి ఏమిటో గానీ తిరగబెట్టింది… మరింత అస్వస్థతకు గురయ్యాడు… లాడ్జి మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు…
Ads
అప్పటికి మూల్‌చంద్ మాట్లాడే స్థితిలోనే ఉన్నాడు… పోలీసులు వచ్చి అడిగితే నా కొడుకు ఆఫ్రికాలో, బిడ్డ కెనడాలో ఉంటారని చెప్పి వాళ్ల నంబర్లు ఇచ్చాడు… తను కన్నుమూస్తే తన పిల్లల్లో ఎవరో ఒకరు వస్తారనీ, తనను పైలోకాలకు సాగనంపుతారని ఆశపడ్డాడు… తను మానసికంగా ఎలాంటి సమస్యల్లో ఉన్నాడో ఏమో గానీ… ఇక కోలుకోలేదు… శనివారం కన్నుముశాడు… భార్య ఏమైంది..? పిల్లలకూ ఆయనకూ నడుమ ఇష్యూస్ ఏమొచ్చాయి..? ఈ వివరాలు ఎవరికీ తెలియవు, చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరు…
పలుసార్లు ప్రయత్నిస్తే బిడ్డ ఫోన్‌కు దొరికింది… తండ్రి పేరు చెప్పి, ఫోటో వాట్సపులో పంపించి మరీ … ఆయన ఆమె తండ్రేనని కన్‌ఫరమ్ చేసుకున్నారు… విషయం ఏమిటో చెప్పారు… ఆమె ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది… ‘‘ఎవడు తీసుకెళ్లమన్నాడు హాస్పిటల్‌కు..? మీరే వీలైతే తగులబెట్టండి, లేదంటే ఎక్కడైనా పడేయండి’ అంటూ విసురుగా ఫోన్ పెట్టేసింది… కలికాలం కూతుళ్లు కదా… అప్పటిదాకా ‘‘కొడుకులు కానకపోయినా (పట్టించుకోకపోయినా) బిడ్డలైనా తల్లితండ్రుల కోసం ఏడుస్తారు (బాగోగులు పట్టించుకుంటారు) అని వినడమే తెలిసిన పోలీసులు సైతం ఆమె మాటల్ని విని షాక్‌కు గురయ్యారు…
తరువాత పోలీసులు ఏం చేశారనేనా మీ కుతూహలం..? చేయదగింది ఏముంది..? వాళ్లూ మనుసులే కదా… ఎక్కడో ఏదో తడి తగిలింది… వాళ్లే ముందుకొచ్చారు… ఆదివారం రాత్రి వాళ్లే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు… అవును, అనాథప్రేత దహనం వంటిదే ఇది కదా… తమ వృత్తిలో తగిలే పాపాల్లో కొన్నయినా ఈ పుణ్య కార్యంతో తుడుచుకుని పోయి ఉంటాయి… ఉండొచ్చు, తల్లీదండ్రులకూ బిడ్డలకు నడుమ ఇష్యూస్ రావని కాదు, వీళ్లకూ ఉండొచ్చు… కానీ మరీ… ‘‘తగలేయండి, లేదంటే ఎక్కడో పడేయండి…’’ అనేంత కాఠిన్యమా..? ఏమో… ఆమెకూ పిల్లలు ఉండే ఉంటారుగా… కథ రిపీట్ కాదని ఏమీ లేదు కదా…
Share this Article