.
ఈమధ్య ఒక సర్జరీ జరిగి దాదాపు వారంపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెయిన్ కిల్లర్లు, నిద్రపట్టే మందులు వాడడంవల్ల పగలుకూడా పడుకున్నట్లే ఉంటుంది. ఆసుపత్రి నుండి డిస్ చార్జ్ అయ్యేప్పుడు సాహిత్యశాస్త్రంలో కూడా అందె వేసిన చేయి అయిన నా శ్రేయోభిలాషి సర్జన్ సకల జాగ్రత్తలు చెప్పాడు.
బరువులు ఎత్తవద్దు. కఠినమైన పదార్థాలు తినవద్దు. ఒక వారం తరువాత కట్లు తీద్దాం- అని. డాక్టర్ల మాటవింటే రోగులం ఎందుకవుతాం?
Ads
ఒకరోజు సాయంత్రం నొప్పిగా, విసుగ్గా ఉండి ఏమీ తోచక టీ వీ ఆన్ చేశాను. ఏమి చూడాలో క్లారిటీ లేక ఓ టి టీ ఆన్ చేస్తే ప్రైమ్ లో ముందు వరుసలో రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’ కనిపించింది. నొక్కాను. మా అబ్బాయి నా సాహసానికి నివ్వెరపోయి నిరసనగా హాల్ లోనుండి లేచి స్టడీ రూములోకి వెళ్ళిపోయాడు.
మరీ నాది ఇంత బరితెగింపా? అన్నట్లు మొహం పెట్టినా ఇలాంటి కష్టంలోనే సహధర్మచారిణిగా తోడు ఉండాలని నా భార్య సోఫాలో నా పక్కనే కూర్చుంది. అనారోగ్యంతో ఉన్న ఇలాంటివేళ కృష్ణా రామా అనుకోకుండా ఇదేమి చోద్యం అన్నట్లు మా అత్త అయోమయంగా మెహం పెట్టింది.
గాథాసప్తశతి, బృహత్కథ, కథాసరిత్సాగరం లాంటివి చదివిన నాకు ఆఫ్టరాల్ కూలీ సినిమా కథ ఎందుకు అర్థం కాదులే! అన్న నా గర్వానికి ఒక్కో సన్నివేశం అవుతుంటే గర్వభంగం తీవ్రత పెరుగుతూ పోయింది.
శస్త్రచికిత్సలో మత్తుమందు ఇచ్చి సర్జన్ గాట్లు పెట్టి…కుట్లు వేశాడు. కూలీ అనస్తీషియా ఇవ్వకుండానే నిలువెల్లా గాట్లు పెట్టి… కుట్లు వేయకుండానే వెళ్ళిపోయాడు. దాంతో రక్తం కారుతూనే ఉంది. అక్కడ ఎంతో కొంత హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు. రాదు. ఆ ఆరోగ్య నష్టం మందులతో భర్తీ అవుతోంది. ఇది భర్తీ కాదు. అది ప్రాణావసరం. ఇది ప్రాణాపాయం.
- కూలీ ఇచ్చి నిలువెల్లా పరాపరా కోయించుకోవడమంటే ఇదే! పాపం! అక్కినేని నాగార్జున బిందె అంత మందు బాటిల్ భుజాన పెట్టుకుని తాగుతూనే ఉన్నాడు. మలయాళానికి ఒకరు, కన్నడకు ఉపేంద్ర, హిందీకి అమీర్ ఖాన్…ఇలా అన్ని భాషల మార్కెట్ సూత్రానికి లెక్కప్రకారం పాత్రలను సర్దారు. నావరకు అనారోగ్యం వల్ల కథ గుర్తులేదు. కథ ఎలెక్ట్రిక్ కుర్చీలో రెండు సెకెన్లలో బూడిద అయ్యిందనుకుంటే మిగతా రెండున్నర గంటలు ఆ బూడిద కొనసాగింపు అనుకోవచ్చు.
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. ఈ పాపం రాత్రి కలలో కూడా కత్తులు పట్టుకుని వెంటాడింది. తెల్లవారకముందే లేచి ప్రఖ్యాత వీణ విద్వాంసుడు ధూళిపాళ శ్రీనివాస్ వీణా గానాన్ని గంటపాటు విన్న తరువాత గుండె సాధారణ స్థాయిలో కొట్టుకోవడం మొదలయ్యింది. ఎందుకైనా మంచిదని… మూడు సార్లు “ఆపదామపహర్తారం…” శ్లోకం చదువుకుని మంచం దిగాను. ఏమిటో! నా జాతకంలో గ్రహాల ప్రభావమో! ఏమో! ఇలా కష్టాలు చెప్పే వస్తున్నాయి!
మానసిక అనారోగ్య సమస్యలకు కూడా ఆరోగ్యబీమాలో ధీమా ఉండాలని ఆమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి కూలీ ఉపద్రవాలకు కూడా బీమా ఉంటే నాలాంటి పరమ పిరికివారికి ఎంతో కొంత ఆరోగ్య రక్షణ ఉండేది! ఎన్నో అనుకుంటాం! అన్నీ అవుతాయా! ప్చ్!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article