‘‘మీ ప్రజలతో నూకలు తినిపించండి, సమస్య అదే పరిష్కారమవుతుంది’’…. ఒక కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో వెటకారంగా మాట్లాడిన మాట ఇది…! ఇది నిజమే అయి ఉంటే… ఒకవేళ ఆయన అలాగే అని ఉంటే మాత్రం దాన్ని అధికార బలుపుగా వర్ణించడానికి, ఖండించడానికి వెనుకాడాల్సిన పనిలేదు… ఒక రాష్ట్ర ప్రజల పట్ల అది చులకనభావమే, పరాభవించడమే అవుతుంది… అది నీచ వాచాలత్వం అనిపించుకుంటుంది… కానీ..?
నిజంగా అన్నాడా..? అలా అన్నాడని తనతో భేటీలో పాల్గొన్న తెలంగాణ అధికార ప్రతినిధి బృందం చెబుతోంది… ధాన్యం, బియ్యంపై మొదటి నుంచీ అసత్యాలు, అర్ధసత్యాలు, అసమర్థ నిర్ణయాలతో సమస్యను సంక్లిష్టం చేసిందే రాష్ట్ర ప్రభుత్వం… దాన్ని రాజకీయం చేసి, బీజేపీపైకి నూకి, పొలిటికల్ లబ్ధికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం… అందుకే పీయూష్ ఆ మాట అన్నాడంటే ఎవరూ నమ్మడం లేదు… ఇటు కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, అటు పెట్రోల్, గ్యాస్ ధరలపై బజారుకెక్కిన టీఆర్ఎస్ సూపర్ క్రెడిబులిటీని నిన్న చూశాం కదా…
Ads
నువ్వు వెంటనే ధాన్యం సేకరణ విధానాన్నే మార్చేయాలి అని స్టేట్ ప్రతినిధులు డిమాండ్ చేశారట… దానికి మీరు అధికారంలోకి రండి, మీ ఇష్టం వచ్చినట్టుగా పద్ధతి మార్చండి అన్నాడట పీయూష్… దేవుడి దయ ఉంటే తప్పకుండా అదే చేస్తామని వీళ్లు బదులిచ్చారట… తీవ్ర వాగ్వాదం జరిగిందట… మేం కేంద్రంతో ఎట్లా కొట్లాడుతున్నామో చూశారా అని జనానికి చెప్పడమా ఇది..? కేంద్రాన్ని ఇంకాస్త ఎక్కువగా గిచ్చే వ్యూహమా..?
మాటిమాటికీ టీఆర్ఎస్ చేసే ఆరోపణ ఏమిటంటే..? ‘‘పంజాబ్‌లో మొత్తం పంట కొంటారు, తెలంగాణలో ఎందుకు కొనరు,..? బియ్యం చేసుకుంటావో, ఏం చేసుకుంటావో నీ ఖర్మ, వడ్లు కొనాల్సిందే…’’ ఇదే కదా… నిజానికి పంజాబ్‌లో ఒకరకం, తెలంగాణలో మరోరకం కొనుగోలు విధానం ఉందా..? లేదు… అంతటా ఒకే పద్ధతి… మీరు ఎఫ్సీఐ అధికారిక సైటులోకి వెళ్లి పరిశీలించినా తేలే నిజం అదే… ఎఫ్సీఐ వడ్లు కొనదు, గతంలో మిల్లర్ల నుంచి లెవీ తీసుకునేది, తరువాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, డీసెంట్రలైజ్డ్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది…
దానిప్రకారం… రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర ఇచ్చి వడ్లు కొంటాయి, మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తాయి, ఎఫ్సీఐ ఆ బియ్యం కొంటుంది… ఇదీ ఆచరణలో ఉన్న పద్ధతి… పంజాబ్‌లో వడ్లు కొంటూ, తెలంగాణలో నిరాకరించడం ఏమీ లేదు… పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ తక్కువ, రా రైస్ ప్రధానం… ప్రస్తుతం ఆహారభద్రతకు ఉండాల్సిన నిల్వలకన్నా మూడునాలుగు రెట్ల నిల్వలున్న స్థితిలో, బాయిల్డ్ రైస్ ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ కొనడం లేదు… పదే పదే అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది… రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాను అంటోంది…
ఇతర ప్రధాన పత్రికలు అన్నీ ఈ సమస్య మీద నిజాల్ని రాయడం మానేశాయి… సబ్జెక్టు తెలియకపోవడం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోలేని అసహాయత కావచ్చు… ఆంధ్రజ్యోతి ఈ ధాన్యం, బియ్యం సేకరణ మీద కొన్ని కథనాలు రాసింది… అవి సరైన దిశలో ఉన్నయ్… చాలామంది జర్నలిస్టులకు బాయిల్డ్, రా రైస్ నడుమ తేడా తెలియదు… దేశంలో ఎక్కడా తలెత్తని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తున్నది అనేది కేంద్రం ప్రశ్న…
నమస్తే తెలంగాణ అయితే ఏకంగా కేంద్రం ఎఫ్సీఐ సేకరణ ఆపేసి, ఆహారభద్రతకు తూట్లు పొడిచేసి, మొత్తం రేషన్ బియ్యాన్నే ఆపేయబోతోందనే కథనాలకు దిగింది… కేంద్రంతో పోరాటం స్ట్రెయిట్‌గా సాగాలి.,. కానీ ఇలాంటి వాదనలతో కాదు… ఫోర్టిఫైడ్ రైస్, యాసంగి రైస్ టార్గెట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటి..? యాసంగిలో వరి వేస్తే ఒక్క గింజ కొనేది లేదని భీష్మించింది ఈ ప్రభుత్వమే… మళ్లీ కేంద్రం గనుక కొనకపోతే తాట తీస్తాం అని ఉరుముతున్నదీ ఈ ప్రభుత్వమే…
సరే, కేంద్రం చాలా దుర్మార్గమైంది… ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నది… తెలంగాణ రైతాంగం మీద మాత్రమే పగ, కక్ష చూపిస్తున్నది… అన్నీ సరే… పర్ డిబేట్ సేక్, అంగీకరిద్దాం… కానీ సింపుల్‌గా ఈ సమస్యకు బీజేపీయే కారణమంటూ రాష్ట్ర రైతాంగాన్ని గాలిలో వదిలేస్తే ఎలా..? సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పరిష్కార ప్రయత్నం ఏం జరిగింది..? అసలు ఇంత ధాన్యం నిజంగానే పండుతోందా అని కేంద్రం సందేహిస్తోందట… పండకపోతే ఈ వడ్లు ఎక్కడి నుంచి వస్తున్నయ్..? అసలు బీజేపీ వైపు నుంచి తెలంగాణ రైతుల అభిమానం పొందే అడుగులు ఏవి..? అసలు రాష్ట్ర బీజేపీకి ఈ సమస్యపై సోయి, లైన్ ఉన్నయా..? ఇదీ ప్రశ్నే…!! ఇష్యూను తవ్వుకుంటూ పోతే అన్నీ మట్టిబెడ్డలే…!!
Share this Article