మొక్కలు ఏడుస్తాయి..! అవును, ఏడుస్తాయి, అవీ జీవమున్న ప్రాణులే కదా మరి… ఎందుకుండవు..? ఫీలింగ్స్ ఉంటాయి, అవి కమ్యూనికేట్ కూడా చేస్తాయి… కాకపోతే వాటి భాష మనకు అర్థం కాదు… అవి మనలా గట్టిగా నవ్వలేవు, గుక్కపెట్టి ఏడ్వలేవు… కానీ వాటి భాష వాటికి సన్నిహితం మెలిగే ఇతర జంతువులకు అర్థమవుతుంది… అర్థం చేసుకుంటాయి… మనిషి అనే జంతువుకే ఏమీ అర్థం కాదు… పైగా ప్రపంచంలో నాకన్నీ తెలుసు అనే పొగరు ఈ జంతువుకు…
ఏదో పత్రికలో మాస్ట్ హెడ్ పక్కనే ఓ వార్త… ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు నరికివేతకు, పీకివేతకు గురైనప్పుడు మొక్కలు, చెట్లు ఏడుస్తున్న ధ్వనులను రికార్డ్ చేశారట,.. నిజానికి ఇదేమీ కొత్త వార్త కాదు, ఏడాది రెండేళ్లుగా బోలెడు ఆర్టికల్స్ వచ్చినయ్… యూట్యూబ్ వీడియోలు కూడా..! సరే, ఎప్పుడు వార్త వస్తేనేం, మాట్లాడుకోవడానికి మంచి సబ్జెక్టు… జంతువులకున్న జ్ఞానం, ప్రకృతిలోని ప్రతి ప్రాణితో వాటి అనుబంధం మనిషికి ఈరోజుకూ అర్థం కాదు, వాడికి చేతకాదు అని చెప్పుకోవడానికి…
చాన్నాళ్లు అసలు వృక్షజాతిని మనిషి అసలు జీవమున్న ప్రాణిగానే గుర్తించలేదు… తరువాత కదా, మనిషికి ఉన్నట్టే మొక్కలు, చెట్లలోనూ సజీవకణాలు ఉంటాయని కనిపెట్టింది… అన్ని జీవుల్లాగే అవీ ప్రత్యుత్పత్తి ద్వారానే తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి… పోషణ వ్యవస్థ ఉంటుంది… అన్నీ ఉంటాయి, ఒక్క కదలికలు తప్ప… ఐతే నాడీ వ్యవస్థ ఉండదు కదా, ఎమోషన్స్ ఉంటాయా అనేది తరతరాల ప్రశ్న… ఉంటుందని చెప్పుకుంటున్నాం తప్ప ఇన్నేళ్లుగా రుజువులేవీ..? ఇప్పుడు ఇదుగో ఆడియో రికార్డింగ్ రుజువులూ సమకూరుతున్నయ్…కృత్రిమ మేధ, కొత్త టెక్నికల్ ఆల్గరిథమ్స్ ద్వారా ఇది సాధించారట…
Ads
ప్రతికూల పరిస్థితుల్లో అవి రోదిస్తాయి, కమ్యూనికేట్ చేస్తాయి కూడా… అంతేకాదు, ఆనంద సమయాల్లో, అంటే పుష్పించినప్పుడు, ఫలించినప్పుడు, పరాగ రేణువులను వెదజల్లినప్పుడు, కీటకాల్ని ఆకర్షించినప్పుడు కూడా అవి స్పందిస్తాయి, వాటి స్పందనల్ని కమ్యూనికేట్ కూడా చేస్తాయి, కాకపోతే జంతువులు కొన్ని మాత్రమే సమజ్ చేసుకుంటాయి… పూల మకరందం కోసం వచ్చే కీటకాలైతే మరీనూ… ఆ రొమాంటిక్ అనుబంధం వేరే కదా…
మొక్కలు, చెట్ల వ్యక్తిగత స్పందనలు సరే (వ్యక్తిగతం కాదు, వృక్షగతం అనాలేమో…) మరి సమూహంగా ప్రతిస్పందనలు ఉంటాయా..? అంటే ఓ అడవిలో ఓ పచ్చని చెట్టును నరికేస్తుంటే చుట్టూ ఉన్న చెట్లు రోదిస్తాయా..? తమకూ ఆ గతి తప్పదు కదాని ఆందోళన చెందుతాయా..? వాటి నడుమ ఆ కమ్యూనికేషన్ ఉంటుందా..? అవునూ, జంతువులతో మొక్కలు ఏం సంభాషిస్తాయి..? అవి ఎవరైనా రికార్డ్ చేసి, డీకోడ్ చేస్తే బాగుండు..! ఏమో, మనిషి ప్రపంచాన్ని వేగంగా కమ్ముకొస్తున్న కృత్రిమ మేథ దాన్ని కూడా సాధించి, వృక్షజాతికి సంబంధించిన మిస్టరీలన్నీ, ఇంకా ఎన్నో ప్రకృతి రహస్యాలను మనకు చెప్పేస్తుందేమో..!
Share this Article