మన సైట్లకు, ట్యూబర్లకు ఒకటే లోకం… ఎవడైనా ఏదైనా రాస్తే చాలు, ఇక అందరూ దాన్నే పట్టుకుని దున్నేస్తారు… నిజమో, అబద్ధమో జాన్ దేవ్… పహెలే లిక్ లేనా… బస్…! ఎస్, నిజం… మహేశ్ బాబు ప్రతి అడుగు వెనుక నమ్రత ఉంటుంది… ఆమె గ్రిప్ చాలా ఎక్కువ తన ఫ్యామిలీ మీద… ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమే మేనేజ్ చేస్తుంది… తప్పో ఒప్పో డబ్బు కావాలి… అందుకే గుట్కా సరొగేట్ యాడ్స్ కూడా చేస్తుంటాడు మహేశ్ ఎన్ని విమర్శలొచ్చినా సరే..!
మొన్న బోలెడు విమర్శలకు దారితీసిన కృష్ణ అంత్యక్రియల పొరపాటు నిర్ణయాల వెనుక కూడా నమ్రత నిర్ణయాలే కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి… మహేశ్ బాబు కమర్షియల్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రమే కాదు, సినిమాల్లోనూ ఆమె వేలు పెడుతుంది… తాజాగా నమ్రత ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది… తమ ప్యాలెస్ హైట్స్‌లోనే మినర్వా కాఫీ షాప్, ఆసియన్ వాళ్లు కూడా కొంత పెట్టుబడి పెట్టినట్టున్నారు… మినర్వా వాళ్లు చాలా ఫేమస్… హైదరాబాదులోనే బోలెడు హోటళ్లున్నయ్ వాళ్లకు…
బ్లూఫాక్స్ బార్ కూడా నడిపిస్తారు… ప్యాలెస్ హైట్స్‌లో అది స్టార్ట్ చేసినట్టు లేరు… అరెరె, అక్కడ దారుణం అట… ఇడ్లి 90 రూపాయలట… పునుగులు 120 రూపాయలట… సౌతిండియా తాలీ 320 రూపాయలట… మరీ ఈ రేంజ్ ధరలా..? నమ్రత ఆశకు అంతూపొంతూ లేదా అంటూ రాతల్ని ఇరగదీసేస్తున్నారు… అవి చదువుతుంటే ఓ చిన్న హోటల్ గుర్తొచ్చింది… మా ఇంటికి దగ్గరలోనే…
Ads
ఇంటిదోశ పేరిట పెట్టారు… 10 రూపాయలకు ఇడ్లీ… రెండు ఇడ్లీలు, ఒక చట్నీ, కాస్త కారం పొడి, పేపర్ ప్లేటు… అంతే… 10 రూపాయలకు దోశ విత్ చట్నీ… వర్కవుట్ అవుతుందా అనడిగితే అవుతుందీ అన్నాడాయన… నో సాంబార్, అది లేకుండా ఇడ్లీ ఏంటయ్యా అనడిగితే ఆ రేటుకు సాంబార్ మెయింటెయిన్ చేయలేం అన్నాడు నిష్కర్షగా… సో, స్థలాన్ని బట్టి, అమ్మకాల్ని బట్టి, క్వాంటిటీని బట్టి, కస్టమర్లను బట్టి వాళ్లు నిర్ణయించుకున్న రేట్లు అవి… మినర్వా కూడా అంతే… నిర్బంధంగా రమ్మంటున్నారా వాళ్లేమైనా..? ఇదేమైనా ఎన్టీయార్ కాలమా..? జనతా సెక్షన్ పెట్టి సర్కారు రేట్లకు టిఫినీలు పెట్టడానికి..?!
మరి నమ్రత రెస్టారెంటు మాటేమిటీ అంటే..? ఆమె నిర్ణయం కాదు అది… మినర్వా రేట్లు ఎప్పుడూ ఎక్కువే… కూకట్‌పల్లి, హిమాయత్‌నగర్ హోటళ్లకు వెళ్లేవాళ్లకు తెలుస్తుంది… అంతెందుకు..? చట్నీస్ కూడా ఫేమసే కదా… అక్కడా ఇవే రేట్లు కదా… కరోనా తరువాత అందరూ అడ్డగోలుగా రేట్లు పెంచేశారు… వెజ్, నాన్-వెజ్ అన్నీ అంతే… కొన్ని హోటళ్లు 50 శాతం దాకా పెంచేశాయి… ఒక్కసారి జొమాటో చెక్ చేయండి… నిజానికి మినర్వాలో పునుగులు అనేదే కాస్త విచిత్రం అనిపించింది… వాళ్లది స్టాండర్డ్ మెనూ ఉంటుంది సాధారణంగా…
వాళ్ల రెస్టారెంటు పెట్టిన ఏరియా, వాళ్ల దగ్గరకు వచ్చే కస్టమర్స్, హైజీన్ స్టాండర్డ్స్ గట్రా చూసినప్పుడు… అవి రీజనబుల్… ఎందుకంటే..? స్టార్ హోటళ్లలో రుచీపచీ లేని చప్పిడి తిండికి ఈ రేట్లకన్నా అధికంగా వసూలు చేస్తున్నారు… ఒక పుల్కాకు 70 రూపాయలు వసూలు చేసే హోటళ్లు బోలెడు… ఇడ్లీ మీద కాస్త నెయ్యి వేసి, కారం పొడి దట్టించి, మరో చట్నీ అదనంగా పెట్టి ఇస్తే 120 రూపాయలు…
డౌటే లేదు… హైదరాబాదు హోటల్ రేట్లపై ఎవరి నియంత్రణ లేదు… అంతెందుకు ఫుడ్ క్వాలిటీ చెక్ చేసే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కూడా లేరు… ప్రత్యేకించి నిల్వ చేసిన చికెన్, మటన్ వెరయిటీల మీద బోలెడు విమర్శలున్నయ్… గట్టిగా అడిగితే కస్టమర్ మీదే దాడి చేసే హోటళ్లు కూడా ఉన్నాయి…
నిజానికి అనుబంధంగా బార్ ఏమీ లేకుండా… కేవలం వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టి, దాని నిర్వహణ పూర్తిగా మినర్వా వాళ్లకే ఇచ్చేసినప్పుడు… ఈ అధిక రేట్లకు నమ్రతను ఆడిపోసుకోవడం కరెక్టు కాదు… మహేశ్‌ను అనడం అస్సలు సరికాదు… మరీ అంతలేసి రేట్లా అంటారా..? బిల్లు ఎంతో పట్టించుకోకుండా జస్ట్ అలా కార్డు పడేసే వాళ్ల కోసమే ఆ రెస్టారెంట్… ఆ ఆంబియెన్స్, ఆ సర్వింగ్ అలాగే ఉంటాయి…!!
చివరగా సరదాగా ఓ కథ చెప్పుకుందాం… పైన సబ్జెక్టుకు శృతి కలవొచ్చు, కలవకపోవచ్చు కూడా… ఎడారికి సమీపంలో చిన్న పూరిపాకలో హోటల్… ఎటెటో తిరిగి అలిసిన ఇద్దరు టూరిస్టులు ఆ హోటల్ చేరి ఆకలవుతోంది, అర్జెంటుగా రెండు ఆమ్లెట్లు వేసి ఇవ్వమన్నారు… కాసేపటికి సర్వ్ చేయబడింది… టీ తాగి, బిల్లు చూసి కళ్లు తేలవేశారు… ఒక్కో ఆమ్లెట్ వంద రూపాయలట… ఇదేమిటీ గుడ్లు దొరకవా ఇక్కడ అనడిగారు… దొరుకుతయ్, తినేవాళ్లే అరుదుగా దొరుకుతారు అన్నాడు ఆ ఓనర్… అలా దొరికినవాళ్లకే రేట్లు దంచుతారు… అంతే… శుభం…!
Share this Article